గేమ్ మారడం లేదా..? -BRS-KCR-KADANABERI SABHA-KARIMNAGAR

By KTV Telugu On 15 March, 2024
image

KTV TELUGU :-

నిన్న మాట్లాడిన బూతుల్ని ఆయన మరిచిపోయారు. నిన్నటి దూషణలు మదిలోంచి మాయం చేసినట్లున్నారు. తనకు అసలు  బూతులే రావని విడ్డూర వాదనను తెరమీదకు  తెచ్చారు.  కేసీఆర్ కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందనేందుకు  ఇదో  నిదర్శనమని చెప్పక తప్పదు. నేతలు ఒక్కరొక్కరుగా జారిపోతుంటే.. పార్టీ ఉంటుందా లేదా అన్నది కేసీఆర్ మదిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న. అందుకే నేను రాముడ్ని,మంచి బాలుడిని అని చెప్పుకునే పరిస్థితి ఆయనకు  ఎదురైంది…

అవే పండ్లు.. అవే బ్యారేజీలు.. అదే మేడిగడ్డ.. అదే కేసీఆర్.. నల్లగొండలో ఏం చెప్పాడో.. కరీంనగర్ లోనూ అవే మాటలన్నాడు. కాకపోతే ఈసారి బీఆర్ఎస్ తెలంగాణ గళం, తెలంగాణ దళం.. తెలంగాణ బలం.. అని ప్రాసతో కూడిన మాటలు మాట్లాడాడు. రేవంత్ పై అవే విమర్శలు, కాంగ్రెస్ పార్టీపై అదే తిట్ల పురాణం.. మొత్తానికి వరుసపెట్టి నాయకులు వెళ్లిపోతున్న తరుణంలో.. కీలకమైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్న సమయంలో.. కేసిఆర్ ఒకింత ఆగ్రహంతో మాట్లాడారు. కోపం కట్టలు తెంచుకున్నప్పటికీ.. చాలా వరకు కంట్రోల్ చేసుకున్నారు. మొత్తానికి కరీంనగర్ కదన భేరి సభలో మేడిగడ్డ ఎందుకు కుంగిందో చెప్పలేదు గాని.. దాని రిపేర్ మాత్రం కాంగ్రెస్ బాధ్యత అని రేవంత్ బాధ్యత గుర్తు చేశాడు.పైగా  రెండు పిల్లర్లు కూలిపోతే జరిగే నష్టమేదీ  లేదని  కొత్త వాదనకు తెరతీశారు..

లోక్ సభ ఎన్నికల వేళ కేసీఆర్ కు ఏదో తెలియని భయం ఆవహించింది. పార్టీ పూర్తిగా దెబ్బతింటుందన్న అనుమానం ఆయనలో  మొలకెత్తింది. ఇంతకాలం వారసులను నమ్ముకున్న కేసీఆర్ కూ ఇప్పుడు వాళ్లపై కూడా నమ్మకం సన్నగిల్లినట్లున్నది. చివరకు మీటింగులు మొక్కుబడిగా మారుతున్నాయన్న వాదనలూ  వినిపిస్తున్నాయి…

ఓడిన నేతగా కొంత సంయమనం పాటించాలని కేసీఆర్ అనుకున్నారు. మూడు నెలలు ఆగండి అని తమ పార్టీ శ్రేణులకు నూరిపోశారు. ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టామన్నారు. కాకపోతే ఆ యుద్ధంలో జోష్ కనిపించడం లేదు. కేసీఆర్ మాటల్లో మునుపటి పదును  ఉండటం లేదు. కదన భేరిలో కదనం లేదనిపించింది. లోక్ సభ ఎన్నికల వేళ్ల సిట్టింగు ఎంపీలే పక్కపార్టీలోకి వెళ్లిపోయి బీఆర్ఎస్ కు కలిగించిన నష్టం ఆయన కళ్లలో కనిపించింది.జెడ్పీలు, మున్సిపాలిటీలు చేజారి పోతున్న వేళ.. ఇక చేసేదేమీ లేదన్న నిరాశ అయనలో కనిపిస్తోంది. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని పెద్దగా ఏమీ అనలేని పరిస్థితి. తిప్పి తిప్పి కాంగ్రెస్  పార్టీనే తిట్టి ఆయన  టైమ్  పాస్ చేసినట్లుగా కనిపించింది. జనంలో కూడా కేసీఆర్ ప్రసంగాల పట్ల ఆసక్తి కనిపించలేదు. ఏదో తోలారు, వచ్చాం, పోయాం…అన్నట్లుగా తయారైందీ కరీంనగర్ సభ పరిస్థితి. వచ్చిన నేతల్లో కూడా అయోమయమే దర్శనమిచ్చింది.లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ చేసిన దిశానిర్దేశం ఏమిటో వారికి అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు కేసీఆర్ చెప్పనూ లేదు…

కేసీఆర్ ఒకప్పుడు మంచి ఆటగాడు. దెబ్బతగలకుండా తెలంగాణ తెచ్చిన ఘనుడన్న పేరు కూడా ఉంది. రక్తపాతం లేని ఉద్యమాన్ని నడిపిన నాయకుడు.ఓడిపోయిన నేపథ్యంలో ఆయన కొత్త ఆటకు తెరతీయాలి. ఇంతవరకు  జరిగిన గేమ్ వేరు, ఇకపై ఆడే గేమ్ వేరు అని జనానికి ఎక్కించగలగాలి. కేసీఆర్ మాత్రం పాత గేమే ఆడుతున్నారు. అదే ధోరణిలో పోతున్నారు.. ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి