చంద్రశేఖర్ గారి కుటుంబం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారైందా. ఎవరిని ఎవరు పట్టించుకోలేని పరిస్థితి వచ్చిందా. ఎవరికి వారు పైచేయిగా నిలుస్తూ నెంబర్ టూ అన్న ఫీలింగు కలిగించే ప్రయత్నంలో ఉన్నారా..లేక ఓడిపోయిన పార్టీతో టెన్షన్ ఎందుకులే అన్నట్లుగా వదిలేశారా….
అధికారంలో ఉన్నప్పుడు జోష్ వేరు. ఏం చేసినా చెల్లుతుంది. చేసిన ప్రతీ పని గొప్పగా ఉందని చెప్పే వందిమాగదులు ఉంటారు. కలిసొచ్చే కాలం అన్నట్లుగా అంతా స్మూత్ గా సాగిపోతుంది. ఒక్కసారి విపక్షంలోకి వస్తే అసలు డొల్లతనం బయటపడుతుంది. ఒకరితో ఒకరికి ఉన్న విభేదాలు, ఎవరిని ఎవరు డామినేట్ చేస్తున్నారు అనేది క్రమంగా బయటకు వస్తాయి. నిన్నటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీలో అదే జరుగుతోంది. కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారయ్యారు. పార్టీలో నెంబర్ టూ ఎవరూ, డామినేషన్ ఎవరిదీ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హరీష్ రావు రెచ్చిపోతున్నారా.. జోగినపల్లి సంతోష్ అలిగారా అన్న డౌట్లు చాలా మందికి వస్తున్నాయి..
అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం అన్నట్లుగా ఉన్నారు. ఎవరేమి చేయాలనుకున్నా ఫైనల్ గా కేసీఆర్ ఆమోదముద్ర పడాల్సిందే. దానితో కొంత నియంత్రణ ఉండేది. అంత కఠినంగా ఉన్నా కూడా కవిత వెళ్లి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ నలుగురు ఇప్పుడు స్వాతంత్రం ప్రకటించుకున్న సామంతరాజుల్లా తయారయ్యారు.దానితో ఇప్పుడు పార్టీపై కొంత ఒత్తిడి తప్పడం లేదు…
హరీష్ రావు పులిలా దాడి చేయగలరని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చెప్పకనే చెప్పాయి. సమావేశాల తొలి అర్థ భాగంలో కాంగ్రెస్ పై కేటీఆర్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం -మేడిగడ్డ – అన్నారం చర్చ మొదలైన తర్వాత ఆయన కాస్త తగ్గారు.ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత హరీష్ రావు భుజంపైకి ఎత్తుకున్నారు. హరీష్ రావు వర్సెస్ మంత్రులు అన్నట్లుగా రోజువారీ మాటల తూటాలు పేలాయి. కేసీఆర్ అసెంబ్లీకి అసలు రానేలేదు. దానితో కేటీఆర్, హరీష్ రావు మొత్తం చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో కేటీఆర్ తో సమన్యయం అనే మాట అవసరం లేకుండా హరీష్ రావు ఇండిపెండెంట్ గా పనిచేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా కేటీఆర్ ను హరీష్ డామినేట్ చేశారని కూడా జనం చెప్పుకోవడం అందరూ విన్నారు. బీఆర్ఎస్ తరపున హరీష్ దే వన్ మ్యాన్ షో అయిపోయింది. కేసీఆర్ పదేళ్ల పాలనలో అవినీతి, అరాచకాలు, అక్రమాలు జరిగాయని రేవంత్ అండ్ కో ధ్వజమెత్తుతుంటే కేటీఆర్ తిప్పికొట్టలేకపోయారు.దాంతో తాజా సెషన్లో కేటీఆర్ సైడయిపోయి హరీష్ బాగా హైలైట్ అయ్యారు. ఇక కవిత తన జాగృతి సంస్ధను పెట్టుకుని వ్యవహారాలు నడుపుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ విచారణ విషయంలో ఆమెలో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే పొరబాటున కూడా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడటం లేదు. తనకు రెండో టర్మ్ రాజ్యసభ పదవి ఇవ్వనందుకు సంతోష్ అలిగారని పార్టీవర్గాల టాక్. పదేళ్ళ పాటు పార్టీలో, ప్రభుత్వంలో బాగా యాక్టివ్ గా ఉన్న సంతోష్ బీఆర్ఎస్ ఓటమి తర్వాత, రాజ్యసభ ఎన్నిక తర్వాత అసలు కనబడటమే మానేశారని పార్టీలో చెప్పుకుంటున్నారు. కేసీఆర్ కు పగలు మందుగోలీలు, రాత్రి మందు గ్లాసు ఇచ్చి రాజ్యసభ కొట్టేశారని రెండో సారి ఇక వద్దులే అని కేసీఆర్ అనుకుని సంతోష్ ను దూరం పెట్టారని చెప్పుకునే వాళ్లూ ఉన్నారు..
ఆ నలుగురు ఒక్క సారి కలిసి భవిష్యత్తు కార్యాచరణను చర్చించుకున పాపాన పోలేదు. పార్టీ ఓడిపోయిన తర్వాత స్వప్రయోజనాలను కాపాడుకోవడమే ధ్యేయమన్నట్లుగా ప్రవర్తిస్తున్నారన్నది సగటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో టాక్. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చేలాయించిన వాళ్లు, ఇప్పుడు కాడి పడేసి నామ్ కే వాస్తే పనిచేస్తున్న ఫీలింగ్ కూడా కలుగుతోంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…