రాజకీయ పార్టీ కి ఎంత ఓటు బ్యాంక్ ఉంటే అంత బలంగా ఉన్నట్లు. ఇప్పుడు బీఆర్ఎస్‌కు ఎంత ఓటు బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఓటు బ్యాంక్ కాదు. అసలు నిఖార్సుగా ఉండే ఓట్లు వేరే. ప్రతి పార్టీకి కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. ఓటు బ్యాంక్ లేని పార్టీలకు విలువ ఉండదు. ఆ ఓటు బ్యాంక్ ఎక్కువగా కులం, మతం ఆధారంగా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ప్రాంతీయ వాదాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకుని రాజకీయం చేసింది. ఈ విషయంలో సక్సెస్ అయింది. కానీ కులం, మతం శాశ్వతం కానీ.. ప్రాంతీయ వాదం శాశ్వతం కాదు. ఈ లాజిక్ ను కేసీఆర్ మార్చిపోయారు. ఇప్పుడు పార్టీని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారు.
ప్రస్తుతం దేశంలో అయినా రాష్ట్రాల్లో అయినా రాజకీయ పార్టీలు బలంగా ఉన్నాయంటే.. కులాల సపోర్టుతోనే. తెలుగుదేశం పార్టీకి కమ్మ, బీసీ వర్గాలు అండగా ఉంటూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం, దళితులు, రెడ్డి వర్గం వారు సపోర్టు చేస్తున్నారు. ఏపీలో వైసీపీకి రెడ్డి, ముస్లిం, దళిత వర్గాల మద్దతు ఉంది. ఏపీలో జనసేన పార్టీ కీలకంగా మారిందంటే దానికి కారణం కాపు వర్గం మద్దతు వల్లే. ఆరు శాతం ఓట్లు ఆ పార్టీకి ఉన్నాయి. అదే ఆ పార్టీ ఓటు బ్యాంక్. అందుకే విలువ వచ్చింది. కానీ బీఆర్ఎస్‌కు ఓ వర్గం మద్దతుగా ఉందన్నది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటి వరకూ చేసిన రాజకీయం వల్ల కులాల మద్దతు పొందలేదు.
బీఆర్ఎస్ గెలిచిన ప్రతీ సారి తెలంగాణ సెంటిమెంటే విజయాస్త్రం. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది చూసుకోలేదు..కారు గుర్తు ఉంటే చాలు ఓటేశారు. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ .. తెలంగాణ సెంటిమెంట్ గుండె నిండా నింపుకున్నవారే. వారిలో సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ప్రజలను ఓటు బ్యాంక్‌గా మార్చుకుని అనుకున్న విజయాలు సాధించారు. కానీ కులం, మతం లాగా.. ఈ తెలంగాణ సెంటిమెంట్ శాశ్వతం కాదు. అక్కడే కేసీఆర్ రాజకీయంగా తప్పటడుగు వేశారు. తెలంగాణ సాధనే లక్ష్యం అనుకున్న తర్వాత.. లక్ష్యం చేధించిన తర్వాత ఇక సెంటిమెంట్ ఉంటుందనుకోవడం అత్యాశే. అయితే కేసీఆర్ తనదైన రాజకీయంతో పదేళ్ల పాటు నెట్టుకు రాగలిగారు. ఈ పదేళ్లలో ఆయన తెలంగాణ సెంటిమెంట్ కు అతీతమైన ఓటు బ్యాంక్‌ను సృష్టించుకోవడంలో విఫలమయ్యారు.
పదేళ్ల పాలనలో ఏ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి వర్గాలు కాంగ్రెస్ వైపు నిలిచాయని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడంతో బీఆర్ఎస్ ఘోర పరాజయాల్ని చవి చూసింది. రెడ్డి వర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన కేబినెట్‌లో ఆరుగురు రెడ్డి మంత్రులు ఉండేవారు. కానీ వారంతా సంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులు. సెంటిమెంట్ కారణంగా బీఆర్ఎస్‌కు మద్దతిచ్చారు. మళ్లీ కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిందేమీ లేదంటే.. వారు ఎంత దూరమయ్యారో అర్థం చేసుకోవచ్చు. చివరికి బీసీల్లోని ప్రధాన సామాజికవర్గాలను కూడా కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలతో దూరం చేసుకున్నారు. ముదిరాజ్ లాంటి పెద్ద సామాజికవర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. పద్మశాలీలకు కూడా టికెట్లివ్వలేదు. పైగా గెలవలేరని అందుకే ఇవ్వలేదని మొహం మీదనే చెప్పారు. దాంతో 26.25 లక్షలున్న ముదిరాజుల ఓట్లలో అత్యధికం బీఆర్ఎస్ కు దూరమైంది. అలాగే 11.80 లక్షలున్న పద్మశాలీల్లో కూడా తమనుపై కేసీయార్ చిన్నచూపు చూశారని దూరమయ్యారు. ముదిరాజ్ నేత అయిన ఈటల రాజేందర్ ను కేసీయార్ కావాలనే అవమానించారనే అభిప్రాయం వాళ్లలో ఉంది.
ఇప్పుడు కేసీఆర్ మళ్లీ బీసీలను ఆకట్టుకుని బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకనే 17 పార్లమెంటు సీట్లలో ఆరుసీట్లను బీసీలకే కేటాయించారు. జహీరాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాలను మున్నూరుకాపులకు కేటాయించారు. చేవెళ్ళ సీటులో ముదిరాజ్ ను పోటీచేయిస్తున్నారు. సికింద్రాబాద్ టికెట్ ను గౌడ్ కు ఇచ్చారు. భువనగిరిలో గొల్ల కురుమ, హైదరాబాద్ సీటును యాదవ సామాజికవర్గానికి కేటాయించారు. అలాగే బీసీ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నారు. ముదిరాజ్ సామాజికవర్గంలోని పెద్దలతో భేటీ అవబోతున్నారు. అలాగే మున్నూరుకాపులు, యాదవులతోనూ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవడం అంత తేలిక కాదు. సక్సెస్ అయితే మాత్రం బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవచ్చు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…