బియ్యం బొక్కిన బీఆర్ఎస్ నేతలు

By KTV Telugu On 19 February, 2024
image

KTV TELUGU :-

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గుర్తున్నారు కదా.. కొడుకు చేసిన ఘనకార్యానికి తాను బలైపోయానని షకీల్ చెప్పుకోవచ్చు. కాకపోతే ఆయనేం పత్తిత్తు కాదు. పెద్ద స్కామ్ స్టర్. స్మగ్లర్ కూడా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో  రైసు మిల్లుల బియ్యాన్ని మాయం చేసి విదేశాలకు తరలించిన ఘనుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అవకతవకలతో పాటు బియ్యం  స్కామును కూడా బయటపెడుతున్న తరుణంలో షకీల్ వ్యవహారంపై కూడా దృష్టి సారించినట్లు చెబుతున్నారు…

అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చని అనుకుంటారు. అక్రమాలు తమ ఇంటిపేరని కూడా భావిస్తారు. అలాంటి వారే బోధన్  మాజీ ఎమ్మెల్యే షకీల్ అమేర్. ఆయన చేయని అవినీతి లేదని బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఏడాది ముందే తెలిపోయింది. అందులో రైస్  మిల్లుల బియ్యం స్కామ్ కూడా ఒకటని చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకుని మిల్లు ఆడించి బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన తరుణంలో షకీల్ కు సంబంధించిన రైసు మిల్లు నుంచి ప్రభుత్వానికి వెళ్లిందీ సున్నా అని తేలింది.  2021-22 యాసంగితో పాటు 2022-23 వానాకాలానికి సంబంధించి 35 వేల మెట్రిక్ ట‌న్నుల బియ్యం పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు తిరిగి ఇవ్వలేద‌ని బ‌య‌ట‌ప‌డింది. ఈ బియ్యం విలువ 60 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అధికారులు అంచనా వేశారు. మరో పది కోట్లు జరిమానా విధించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే దీనిపై ముక్కుబడిగా విచారణ జరిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగ్గాలు  చేపట్టిన తర్వాత మొత్తం వ్యవహారంపై ఒక లుక్కేసింది..

షకీల్ ఒక్కరే కాదట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో  అధికపక్షం రైస్ మిల్లుల యజమానులు షకీల్ టైపు దందా చేశారు. అందినకాడికి  ప్రజా ధనాన్ని దండుకున్నారు. ఇప్పుడు వారి సంగతి చూడాల్సి ఉంటుంది..

తెలంగాణలో  దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే దందా జరిగింది. నిజామాబాద్ జిల్లాలో అది కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. వందల కోట్ల  రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు గండి పడినప్పటికీ ఇంతకాలం పట్టించుకున్న వారు లేరు. గులాబీ నేతలు….బినామీ పేర్లతో  వారు నిర్వహించే రైస్ మిల్లుల దగ్గర బియ్యం బొక్కేస్తుంటే అధికారులు ఏమీ ఎరుగనట్లు ఊరుకున్నారు. యాసంగితో పాటు వానాకాలంలో ప్రభుత్వం కేటాయించే ధాన్యాన్ని తీసుకుని బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. ధాన్యం తీసుకున్నారే కానీ బియ్యం మాత్రం వెనక్కి ఇవ్వలేదు. బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. పైగా బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎగుమతి చేశారు.ఈ క్రమంలో ఇక్కడ బియ్యం  రేటు కిలో 65 నుంచి 70 రూపాయలకు పెరిగిపోయింది. ఇప్పుడు అధికారులు వెళ్లి తనిఖీలు చేస్తుంటే బియ్యం లెక్క తేలడం లేదు. ప్రభుత్వ అనుమతితో వారిపై కేసులు పెట్టేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. రైస్ మిల్లర్లు గతేడాది మరో స్కామ్ కూడా చేశారు. బిహార్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి లారీల కొద్దీ బియ్యాన్ని తీసుకొచ్చారు. అది తక్కువ నాణ్యత ఉన్న బియ్యం కావడంతో తమ గోదాముల్లో కొన్ని రోజులు నిల్వ ఉంచారు. కస్లమ్స్ మిల్లింగ్ బియ్యాన్ని, బిహార్ బియ్యంలో కలిపేశారు. వాటిని మార్కెట్లో సన్నబియ్యంగా విక్రయించేశారు. కొంత మొత్తాన్ని విదేశాలకు ఎగుమతి చేసేశారు. అధికారంలో ఉండటంతో ఎలాంటి అనుమతులు లేకుండా కూడా బియ్యాన్ని దిగమతి చేసుకోగలిగారు. ఈ క్రమంలో కస్లమ్  మిల్లింగ్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకుని, బిహార్ – ఛత్తీస్ గఢ్ నుంచి తెప్పించిన తక్కువ నాణ్యత బియ్యాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసి లెక్క చెప్పి చేతులు దలుపుకున్న వాళ్లూ ఉన్నారు. అలాంటి అంశాలపై ఇంకా పూర్తిగా వివరాలు సేకరించి విచారణ జరపాల్సి ఉంది….

బియ్యం స్కాముపై  విస్తృత స్థాయిలోనే  విచారణ జరపాల్సి ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా చేసిన వారందరి  లింకులు పట్టుకుని  ప్రశ్నించాలి. బియ్యం ఎక్కడ దాచారో తెలుసుకుని స్వాధీనం చేసుకోవాలి.అప్పుడే  స్మగ్లింగ్ ను నిరోధించిన వారవుతారు. ఓపెన్ మార్కెట్ల రైట్లను కొంత వరకైనా నియంత్రించిన  వారవుతారు. చూడాలి మరి…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి