బ్రాండ్ న్యూ BRS

By KTV Telugu On 24 January, 2024
image

KTV TELUGU :-

కారు షెడ్డుకెళ్లలేదని సర్వీసింగ్ కు వెళ్లిందని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు.  ఆయన మాటల్లో అంతరార్థం వేరే ఉంది. సర్వీస్ చేసిన కారు సరికొత్త పద్దతిలో తెరపైకి రాబోతోందని ఆయన చెబుతున్నారు. పూర్తి గా నాయకత్వం మారబోతోంది.  వర్కింగ్ స్టైల్ కూడా మార్చాలని డిసైడయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమైన కేటీఆర్ వారి పాత్ర కీలకమని క్లారిటీ ఇచ్చారు. పార్టీ వ్యవస్థలోనూ మార్పులు తెస్తామని చెబుతున్నారు. అంటే పూర్తి సర్వీసింగ్ చేసిన తర్వాత సరికొత్త నాయకత్వంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోందన్న మాట

బీఆర్ఎస్  పార్టీని గాడిలో పెట్టడానికి కేసీఆర్  పూర్తి స్థాయిలో మేథోమథనం చేస్తున్నారు. ముందుగా  ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ఇదే అంశాన్ని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్సీల భేటీలో వెల్లడించడం పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీని గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.  లోక్‌సభ ఎన్నికలు అయిన వెంటనే  స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది.  ఇటీవల లోక్‌సభ సన్నాహక సమావేశాల్లో ఇక నుంచి బీఆరెస్‌లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీ కాకుండా పార్టీ కేంద్రంగానే ఎమ్మెల్యేలు పనిచేసే విధానం తీసుకొస్తామని కేటీఆర్ ప్రకటించారు. బీఆరెస్‌లో సంస్థాగతంగా భారీ మార్పులు ఖాయమని కేటీఆర్ మాటలే వెల్లడిస్తున్నాయని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. కేసీఆర్ కూడా నేరుగా ఫోన్లు చేసి క్యాడర్ తో మాట్లాడుతున్నారని అంటున్నారు.

అధికారంలో ఉన్నన్నినాళ్లు పార్టీ నిర్మాణంపై అధినేత కేసీఆర్‌ లేదా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ పెద్దగా దృష్టి సారించలేదు.  కార్యకర్తల్ని పట్టించుకోలేదు. ఇది తన తప్పేనని కేటీఆర్ అంగీకరించారు కూడా.   పాలనపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం వల్ల పార్టీకి సమయం ఇవ్వలేక పోయామని కేటీఆర్‌ సమర్థించుకున్నారు.    బీఆరెస్‌కు జిల్లాల పార్టీ అధ్యక్షులు, మండల, గ్రామశాఖల అధ్యక్షులున్నా నామమాత్రమేననే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లోనే ఉన్నాయి. కార్యవర్గాల ఏర్పాటు కాగితాలకే తప్ప కార్యవర్గాల సమావేశాలు నిర్వహించే సంస్కృతి ఏనాడో మరిచిపోయారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా వ్యవహరించడంతో వారిదే రాజ్యమయింది.  దీంతో క్యాడర్‌కు, లీడర్‌కు దూరం పెరిగిపోయింది.  కార్యకర్తల కష్టాలు ఏమిటో తెలియకుండా పార్టీ వ్యవహారాలు నడిచాయి.  ప్రోటోకాల్ పేరుతో తననూ కార్యకర్తల్ని కలవనీయలేదని కవిత కూడా ఓ సారి గట్టిగా ఫైర్ అయ్యారు.

గ్రామస్థాయి, మండల స్థాయి నాయకులు కేసీఆర్, కేటీఆర్‌లను కలవడం కలలో మాటగానే మారింది. దీంతో సిటింగ్‌లపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందన్న సంగతి క్యాడర్‌ ద్వారా అధిష్ఠానానికి ఎన్నికల సమయంలోనే తెలిసింది. సిరిసిల్ల నేతలకు కేటీఆర్ మాట్లాడిన ఫోన్ కాల్ లీక్ అయినప్పుడు ఈ విషయం స్పష్టమయింది. సమయం కేటాయించలేకపోయానని ఈ సారి వారానికో రోజు కేటాయిస్తానని కేటీఆర్ చెప్పుకొచ్చారు కానీ.. ఎవరూ నమ్మలేదు.   ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం కార్యకర్తల ద్వారా పైస్థాయి నాయకత్వానికి, తద్వారా అధిష్ఠానానికి తెలియకుండా పోయింది.   ఎన్నికలకు ముందు మండలాలు, నియోజకవర్గాలవారీగా పార్టీ కార్యకర్తలతో భారీగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సమావేశాలు  విందులకోసం అన్నట్లుగా సాగాయి కానీ..  కేసీఆర్ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోలేకపోయారు.

తెలంగాణ భవన్ వేదికగా లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో కాస్త మార్పు కనిపిస్తోంది.  కేటీఆర్‌, హరీశ్‌రావు సహా రాష్ట్ర నేతల ఉపన్యాసాల తర్వాత కొంత మంది క్యాడర్ కు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. అయితే కార్యకర్తలు, గ్రామ, మండల నాయకుల అభిప్రాయాలు చాటే అవకాశం   పూర్తి స్థాయిలో రాలేదు.  అదే సమయంలో కేసీఆర్, కేటీఆర్‌ సభల్లోనూ, బీఆరెస్ ముఖ్య కార్యక్రమాల్లోనూ, మీడియా సమావేశాల్లో, చర్చా వేదికల్లోనూ ఎక్కడా చూసినా వేళ్ల మీద లెక్కబెట్టగలిగే కొందరు నాయకులే ఎక్కువగా కనిపించేవారు. వారిలో ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వారిని దూరం పెడితేనే మంచిదన్న భావన కార్యకర్తల్లో వినిపిస్తున్నది. వారి స్థానంలో యువ నాయకత్వానికి, తొలిసారిగా గెలిచిన వారికి అవకాశాలు కల్పిస్తే పార్టీకి మేలు జరుగవచ్చని అంటున్నారు.   పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రామశాఖ, మండల, జిల్లా, రాష్ట్రశాఖల వరకు కూడా కొత్త తరం నాయకులకు, ఉద్యమకాలంలో క్రియాశీలకంగా ఉన్న నాయకులకు ఈ దఫా ప్రాధాన్యం దక్కితే పార్టీకి పూర్వవైభవం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తంగా పార్టీ పునర్‌వ్యవస్థీకరణ దిశగా కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయాలు పార్టీ భ విష్యత్ కు కీలకంగా మారనున్నాయి. ఆ నిర్ణయాలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తీసుకుంటారా.. ముందా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి