పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు

By KTV Telugu On 11 September, 2024
image

KTV TELUGU :-

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. అనర్హతపై నాలుగు వారాల్లో ఆదేశాలు జారీచేసింది. అనర్హత పిటిషన్లను స్పీకర్‌ ముందుంచాలని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పించాలని ఆదేశించింది. గడువులోపు ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లయితే సుమోటోగా మరోసారి విచారణ చేస్తామని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది. లేదా హైకోర్టు తీర్పు మేరకు నడచుకోవాలంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఈ నోటీసులపై ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వాలి. ఈ సమాధానంపై స్పీకర్ వారిని విచారించాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పై నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ కు విచక్షణ అధికారం ఉంది.

అయితే మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇదే స్పీకర్ కు కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. హైకోర్టు తీర్పు మేరకు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులిస్తారా? లేదా అప్పీల్ కు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ, ఇతరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరుపక్షాల వాదనలు గత నెల 7న పూర్తయ్యాయి. నేడు తీర్పును వెలువరిస్తూ పిటిషన్ల విచారణపై షెడ్యూల్‌ రిలీజ్‌ చేయాలని స్పీకర్‌ను ఆదేశించింది. నోటీసులు ఎప్పుడు ఇస్తారు, విచారణ ఎప్పుడు జరుపుతారు, ఎప్పటివరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్‌ పూర్తి చేయాలనే విషయాలను ప్రకటించాలని తెలిపింది. నాలుగు వారాల్లోగా షెడ్యూల్‌ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

ఇంతకీ బిఆర్ఎస్ నుంచి ఎవరెవరు Congress పార్టీకి వెళ్లారో ఒకసారి చూద్దాం…
గత ఏప్రిల్‌ 24న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన 7 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ప్రకాశ్‌ గౌడ్‌ చేరితే కాంగ్రెస్‌లోకి వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 8 కి చేరుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది బీఆర్‌ఎస్ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జెడ్పీ చైర్మన్, మున్సిపల్ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. జిల్లా స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్‌), దానం నాగేందర్‌ (ఖైరతాబాద్‌), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన దాఖలు చేయగా, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరొకరు పిటిషన్‌ దాఖలు చేశారు

పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు చాలా మంచిదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొనగా.. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ”పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకుంటే సంతోషించే వాళ్లం. మేమే పార్టీ మారితే వెంటనే ఆటో మేటిక్‌గా అనర్హత వేటు పడాలి. పార్టీ మారిన వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాల”ని ఆయన వ్యాఖ్యానించారు.

పార్టీ ఫిరాయింపులపై కోర్టులు భిన్నమైన తీర్పులు ఇస్తున్నాయంటూ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ”కోర్టుల భిన్నమైన తీర్పులపై అధ్యయనం జరగాలి. ఇలాంటి తీర్పులపై రాజ్యాంగ ధర్మాసనం వద్ద చర్చ జరగాలి. ఒక అంశంపై సుప్రీంకోర్టే రెండు భిన్నమైన తీర్పులు ఇస్తోంది. ఫైవ్ జడ్జెస్ ధర్మాసనం ఒక రకంగా, త్రీ జడ్జెస్ బెంచ్ మరో రకంగా స్పందిస్తోంది. ఈనాటి ఫిరాయింపుల అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఒక రకంగా, సింగిల్ జడ్జ్ బెంచ్ మరోరకంగా స్పందించింది. నా విషయంలో కోర్టు తీర్పుపై నేను వ్యక్తిగతంగా పోరాటం చేస్తాను. కాంగ్రెస్ మద్దతు తీసుకుంటాను. హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తాను. రాజకీయాలను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది. ఫిరాయింపులను ప్రోత్సహించింది. బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు ఏమనుకుంటారోననే ఇంగిత జ్ఞానం కూడా లేద”ని విమర్శించారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి