ఎంతో అట్టహాసంగా చేసిన జాతీయస్థాయి విస్తరణ ప్రయత్నాలు విఫలమైనట్లేననుకోవాలి. స్వయంగా కేసీఆర్ తీసుకున్న ప్రత్యేక చర్యలు ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరైపోతున్నాయి. బేస్ స్టేట్ అయిన తెలంగాణలోనే ఓడిపోవడంతో ఇక ఇతర రాష్ట్రాల్లోనూ కొట్టు కట్టెయ్యాల్సిందేనని భావిస్తున్నారు. మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో నేతలు ఒక్కరొక్కరుగా జారుకుంటున్నారు. కేసీఆర్ కూడా ఇప్పుడు ఏమీ ఎరుగనట్లుగా ఊరుకుంటున్నారు…
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన వేళావిశేషం బాగోలేదనిపిస్తోంది. బీఆర్ఎస్ శాఖలను మహారాష్ట్ర, ఏపీ, ఒడిశాలో ప్రారంభించినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది. తెలంగాణలోనే బీఆర్ఎస్ ఓటమితో ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా అన్న ప్రశ్నలు తలెత్తాయి.ఏడాది క్రితం ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. అప్పట్లో మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ఔరంగాబాద్, నాందేడ్, కందార్ లోహ, లాతూర్, కొల్లాపూర్‌లో బహిరంగసభలు నిర్వహించారు. కేసీఆర్‌ను నమ్మి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎంపీలతోపాటు పలు పార్టీలు, సంఘాల నేతలు గూలాబీ గూటికి చేరారు. దీంతో ఒక్కసారిగా పార్టీలో జోష్ పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు వందలకుపైగా వార్డులు, సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత బహిరంగ సభల్లో కేసీఆర్.. తెలంగాణ మాదిరిగా మహారాష్ట్రను సైతం అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని 48 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని, గెలిపించాలని ప్రజలను కోరారు. అంతేకాకుండా మహారాష్ట్ర పార్టీ ఇన్ చార్జిగా కల్వకుంట్ల వంశీధర్ రావు నేతృత్వంలో 15 మందితో మహారాష్ట్ర తాత్కాలిక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. డివిజన్లకు ఇన్ చార్జిలనూ నియమించారు. 15 లక్షలకు పైగా సభ్యత్వాలను పూర్తి చేశారు. నాగ్ పూర్ లో పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ సితారైంది..
తెలంగాణ ఓటమి తర్వాత మహారాష్ట్ర నేతలను కేసీఆర్ పట్టించుకోవడం లేదు. వాళ్లు ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదు. దానితో ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. మరో పక్క ఏపీ, ఒడిశా శాఖలు ఖాళీ అవుతున్నాయన్న నిజం కళ్లెదుటే కనిపిస్తోంది…
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న నమ్మకం కలగడం లేదు. పైగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ నుంచి తీసుకెళ్లి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. ఇప్పుడు నిధులు ఆగిపోయినట్లు చెబుతున్నారు. దానితో మహారాష్ట్ర నేతలు గుట్టుచప్పుడు కాకుండా జారుకుంటున్నారు. వారి వైపు నుంచి ఎలాంటి ప్రకటనా రావడం లేదు. ఏపీ శాఖ ఖాళీ అయే ప్రక్రియ కూడా మొదలైంది. రావెల వైసీపీలోకి వెళ్లిపోయారు. ఏపీ రాష్ట్ర శాఖాధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేన వైపు చూస్తున్నారు. చోద్యం ఏమిటంటే తెలుగు రాష్ట్రమైనప్పటికీ ఏపీలో బీఆర్ఎస్ ఒక సభ కూడా పెట్టలేదు. విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారే తప్ప.. కేసీఆర్ ఒక్కసారి కూడా అటు వెళ్లిన పాపాన పోలేదు. ఇక ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ను పార్టీలో చేర్చుకుని ఆ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు. దానితో చూసి చూసి గమాంగ్ ఇటీవలే మళ్లీ కాంగ్రెస్ లో చేరిపోయారు. తమిళనాడు నుంచి కొందరు ఔత్సాహికులు వచ్చి చేరతామని చెప్పినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దానితో ఇప్పుడు కథ మొదటికొచ్చిందన్న ఫీలింగ్ కనిపిస్తోంది….
బీఆర్ఎస్ ప్రారంభించిన తర్వాతే తెలంగాణలో గులాబీ పార్టీ పరిస్థితి దిగజారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సమర్థతకు మించి ఏదో చేయబోయి మొదటికే మోసం వచ్చిందని భావిస్తున్నారు. అందుకే తెలంగాణ మినహా వేరే చోట్ల లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని కేసీఆర్ తీర్మానించుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…