బి.ఆర్.ఎస్. లో టికెట్లు రాని ఆశావహులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. భవిష్య ప్రణాళిక రూపొందించుకోడానికి కొందరు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే తమ అనుచరులతో చర్చలు జరిపి ఏ పార్టీలోకి వెళ్తే మంచిదో సమాలోచనలు చేసుకున్నారు. కొందరైతే తీవ్ర మనస్తాపంతో తమలో తామే బాధపడుతున్నారు. ఎప్పటికైనా కేసీయారే తమకి న్యాయం చేస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారే తప్ప కేసీయార్ విడుదల చేసిన జాబితాపై పల్లెత్తు మాట అనడం లేదు.
భారత రాష్ట్ర సమితి అధినేత విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు లేని నేతలు చాలా సీరియస్ గానే ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు.ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జాబితా విడుదల చేసిన రోజు సాయంత్రమే తన భర్తను కాంగ్రెస్ పార్టీలోకి పంపారు. తనకు కూడా ఓ బెర్త్ రిజర్వ్ చేసి పెట్టమని చెప్పి మరీ పంపారు. ఖానాపూర్ లో తనకు టికెట్ ఇవ్వకపోవడం అంటే అక్కడ బి.ఆర్.ఎస్. పార్టీ ఓటమి ఖాయమనే అర్ధం అంటున్నారు రేఖానాయక్. వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ లోనే ఘన విజయం సాధించి తన సత్తా ఏంటో చూపిస్తానని బి.ఆర్.ఎస్. నాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు రేఖ.
తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుండి పోటీచేయాలని అనుకున్నారు. అయితే అందరికీ షాకిస్తూ తుమ్మలకు కూడా టికెట్ ఇవ్వకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఎటు వైపు అడుగులు వేయాలో చర్చిస్తున్నారు. అయితే మెజారిటీ అనుచరులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. టిడిపి హయాంలో చంద్రబాబుకు నాయుడికి కూడా తుమ్మల సన్నిహితుడే. ఇపుడు తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పూర్వాశ్రమంలో టిడిపి నాయకుడే కావడం చంద్రబాబుకు కుడిభుజం కావడం విశేషం. ఈ సమీకరణలతో తుమ్మలకు కాంగ్రెస్ లో ఓ కండువా రెడీ ఉంటుందని అంటున్నారు.
ఖమ్మం జిల్లాకే చెందిన జలగం వెంకట్రావ్ ది మరో విషాదం. గత ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. తరపున కొత్తగూడెం నుండి పోటీ చేసిన జలగం వెంకట్రావ్ కాంగ్రెస్ అభ్యర్ధి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం వనమా కూడా బి.ఆర్.ఎస్. లో చేరారు. దీంతో జలగం వెంకట్రావ్ కు ఊపిరాడని పరిస్థితి. నాలుగున్నరేళ్ల తర్వాత ఇపుడు ఎన్నికలకు ముందు జలగం వెంకట్రావ్ కు షాకిచ్చారు కేసీయార్.కొత్తగూడెం టికెట్ ను వలస నేత వనమాకే కేటాయించారు. దీంతో జలగం వెంకట్రావ్ కు ఏం చేయాలో పాలు పోవడం లేదు. జలగం కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడే కాబట్టి వనమా స్థానంలో జలగం కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
జనగాం నుండి టికెట్ ఆశించిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి అంతా అయోమయంగా ఉంది. జనగాంపై కేసీయార్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ముత్తిరెడ్డి తన ప్రయత్నాలు ఆపలేదు. తనకు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ పల్లా రాజేశ్వరరెడ్డికి మాత్రం జనగాం టికెట్ ఇవ్వద్దని ముత్తిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తనకు ఇస్తే ఓకే..లేదంటే పోచంపల్లికో మరొకరికో ఇవ్వండి అని ముత్తిరెడ్డి షరతు విధిస్తున్నారు. అమెరికా నుండి కేటీయార్ హైదరాబాద్ వచ్చాక జనగాంపై నిర్ణయం తీసుకుంటారు. ఇక ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య అయితే తనకు టికెట్ రాకపోవడంతో చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. కేసీయార్ తనకు ఏదో ఒక విధంగా న్యాయం చేస్తారన్న నమ్మకం తనకి ఉందంటున్నారు.
బి.ఆర్.ఎస్. ఆశావహుల పరిస్థితి ఇలా ఉంటే బి.ఆర్.ఎఎస్. తో పొత్తులు ఖాయమని ఆశలు పెట్టుకున్న కమ్యూనిస్టుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బి.ఆర్.ఎస్. తో పొత్తును ఆశించి మునుగోడు ఉప ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. కు బేషరతుగా మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టులు ఇపుడు కేసీయార్ తమని వాడుకుని వదిలేశారని భావిస్తున్నారు. రాజకీయాల్లో మోసాలు చేసేవాళ్లు ఉన్నంత కాలం తమలా మోసపోయేవాళ్లు కూడా ఉంటారని వారు ఫిలసాఫికల్ టచ్ ఇస్తున్నారు. అయినా తాము సీట్ల కోసం రాజకీయాలు చేయమని కామ్రేడ్లు అంటున్నారు. ఇక తమ రెండు పార్టీలూ కలిసికట్టుగా పోటీ చేస్తాయని సిపిఐ,సిపిఎం నేతలు స్పష్టం చేశారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…