కేసీఆర్ తీరు కేటీఆర్ కు నచ్చడం లేదా?

By KTV Telugu On 15 December, 2022
image

టీఆర్ఎస్ నుంచి  బీఆర్ఎస్ గా పార్టీ పేరును  మార్చిన  నేపథ్యంలో ఢిల్లీలో తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించారు. బుధవారం  కేసీఆర్ స్వయంగా వెళ్లి ప్రారంభించిన కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్, కుమారస్వామి, తిరుమావలవన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.  బీఆర్ఎస్ లో ఒక మాదిరి నేతలంతా  ఢిల్లీలో ఉన్నారు. ఒక్క నాయకుడు మాత్రం మిస్సయ్యారు. ఆయనే కేసీఆర్ తనయుడైన తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు.

కేటీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లలేదు. ఆయన నొచ్చుకున్నారా, అలిగారా.. పార్టీలో, ఫ్యామిలీలో ఏమైనా జరిగిందా లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఢిల్లీ కార్యక్రమంలో కేసీఆర్ సతీమణి కనిపించారు. కూతురు కవిత హల్ చల్ చేశారు. కేటీఆర్ తనయుడు హిమాన్షు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కేటీఆర్ మాత్రం మొహం చాటేశారు. ఇందుకు అధికారికంగా వస్తున్న సమాచారం మాత్రం  వేరుగా ఉంది. ఆయన బిజీగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. బుధవారం ఆయన తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించిన రెండు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. బాష్ కంపెనీ ప్రతినిధుల వచ్చి కేటీఆర్ ను కలిశారు. ఇది నెలల ముందే ఫిక్స్ చేసిన అప్పాయింట్ మెంట్. మారుతీ సుజూకీ కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చారు. తీసుకున్న అప్పాయింట్ మెంట్ ప్రకారం వచ్చిన వారిని కాదనలేని పరిస్తితి ఉన్నందునే కేటీఆర్ వెళ్లలేదని ఆ సంగతి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పర్మీషన్ పొందారని పార్టీ  వర్గాలు అంటున్నాయి.

రాజకీయ వర్గాల్లో మాత్రం కేటీఆర్ ఢిల్లీ వెళ్లకపోవడంపై పెద్ద చర్చే జరుగుతోంది. కేసీఆర్ పై ఆయన అలిగారని ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ఏర్పాటు ప్రక్రియకు కేటీఆర్ ఆమోదముద్ర పడలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యలు చాలక మళ్లీ బీఆర్ఎస్ పేరుతో కొత్త సమస్యలు తెచ్చుకోవడమెందుకన్నది కేటీఆర్ ఆలోచనా విధానమని సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచేందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సిన తరుణంలో జాతీయ రాజకీయాలంటూ డైవర్షన్ చేయడం తగదని కేటీఆర్ భావిస్తున్నారట. రాష్ట్రంలోనే ఒక పక్క బీజేపీ, కాంగ్రెస్ కమ్ముకువస్తున్న తరుణంలో పూర్తి ఏకాగ్రత ఇటువైపు పెడదామన్న కేటీఆర్ ప్రతిపాదనను కేసీఆర్ వీటో చేసినట్లు చెబుతున్నారు. కనీసం అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగుదామని చెప్పినా సమయం లేదు మిత్రమా అన్నట్లుగా ఢిల్లీ వైపు దూసుకుపోయారని కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారట.

సోదరి కవిత తీరు కూడా కేటీఆర్ కు సుతారమూ నచ్చడం లేదని చెబుతున్నారు. అవసరం లేని చోట ఆమె దూకుడును ప్రదర్శిస్తున్నారన్నది కేటీఆర్ ఆభిప్రాయంగా చెబుతున్నారు. పైగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు బయటకు రావడంతో కేటీఆర్ కు బాగా కోపమొచ్చిందంటున్నారు. అనవసర విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకున్నావని కవితను కేసీఆర్ నిలదీసినప్పుడు కేటీఆర్ కూడా అక్కడే ఉన్నారని చెబుతున్నారు. ప్రతీ అంశంలో కవిత జోక్యం చేసుకుంటున్నారని, కుటుంబ సభ్యులను డామినేట్ చేస్తున్నారని కేటీఆర్ అసహనానికి లోనవుతున్నారని ఒక వాదన ప్రచారంలో ఉంది.

కేటీఆర్ దేవుడ్ని నమ్మరు. ఆయన పూర్తి నాస్తికవాది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఒకటి రెండు  సార్లు పూజల దగ్గరకు వచ్చి వెళతారు. బీఆర్ఆర్ కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో యాగాలు, పూజలు కూడా ఆయనకు పెద్దగా నచ్చలేదని కొందరు అంటున్నారు. ఏదైనా సింపుల్ గా ముగించాలి కదా అన్నది ఆయన ఆలోచనా విధానం. అందుకే ప్రత్యేక విమానంలో అలా వెళ్లి కాసేపు కనిపించి ఇలా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆయన ఆపని చేయవద్దని అనుకున్నారట. మరికొంత మంది మాత్రం కేటీఆర్ నిజంగానే పనివత్తిడితో ఢిల్లీ వెళ్లలేదంటున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక.