తెలంగాణాలో కారు పార్టీ టాప్ గేర్ లో దూసుకుపోతోంది. ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో అన్ని పార్టీలకన్నా ముందుగా బి.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. రికార్డు స్థాయిలో 115 మంది అభ్యర్ధులతో మొదటి జాబితా విడుదల చేసింది. ఇక కేవలం నాలుగు నియోజక వర్గాలకు మాత్రమే అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. 119 నియోజక వర్గాలున్న తెలంగాణాలో 115 మంది అభ్యర్ధుల జాబితాను ఒకేసారి విడుదల చేయడం రాజకీయంగా పెను సంచలనమే అని చెప్పాలి. వీటిలో 9 నియోజక వర్గాల్లో మాత్రమే సిటింగులకు చోటు దక్కలేదు. అక్కడా వివిధ కారణాలతో అభ్యర్ధులను మార్చారు.
ముఖ్యమంత్రి కేసీయార్ గజ్వేల్ నియోజక వర్గంతో పాటు కామారెడ్డి నియోజక వర్గం నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. 95 నుండి 105 స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేసీయార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విజయంపై ధీమా ఉండడం వల్లనే సిటింగులకు టికెట్లు కేటాయించారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి-పల్లా రాజేశ్వర రెడ్డి మధ్య టికెట్ పోరు నడుస్తోన్న జనగామ నియోజక వర్గంతో పాటు నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ నియోజక వర్గాలకు కొద్ది రోజుల్లో అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు
ఉప్పల్ లో సిటింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని మార్చి బండారి లక్ష్మారెడ్డికి, ఖానాపూర్ నియోజక వర్గంలో రేఖానాయక్ ను తప్పించి జాన్సన్ నాయక్ కు, కోరుట్లలో విద్యాసాగర్ రావుకు బదులు సంజయ్ కుమార్, స్టేషన్ ఘన్ పూర్ లో వివాదస్పద రాజయ్య స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వైరాలో రాములు నాయక్ బదులు మదన్ లాల్, వేముల వాడలో చెన్నమనేని రమేష్ స్థానంలో చల్మెడ లక్ష్మీకాంతరావు బోధ్ లో రాథోడ్ బాపూరావు స్థానంలో అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ లో ఆత్రం సక్కును పక్కన పెట్టి కోవా లక్ష్మి లకు టికెట్లు కేటాయించారు.
బి.ఆర్.ఎస్. పార్టీని స్థాపించిన తర్వాత మొదటి సారి పార్టీ అధినేత కేసీయార్ రెండు నియోజక వర్గాల నుండి పోటీ చేయాలని నిర్ణయించారు. గజ్వెల్ నియోజక వర్గంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుండి కూడా పోటీచేయాలని నిర్ణయించారు. అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కొద్ది రోజుల క్రితమే తమ నియోజక వర్గం నుండి కేసీయార్ పోటీ చేయాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో జిల్లా నుండి కేసీయార్ పోటీ చేస్తే దాని ప్రభావం మొత్తం జిల్లాపై పడి పార్టీకి లబ్ధి చేకూరుతుందని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.
దక్షిణ కాశిగా పేరొందిన వేముల వాడ నియోజక వర్గంలో సీనియర్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ను అయిష్టంగానే తప్పించాల్సి వచ్చిందని పార్టీ అధినేత కేసీయారే క్లారిటీ ఇచ్చారు. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం ఉంది. దాని విషయంలో రాజ్యాంగపరమైన చిక్కులు ఉన్నాయి. దీనిపై ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కారణంగానే ఆయన్ను పక్కన పెట్టాల్సి వచ్చిందని కేసీయార్ వివరణ ఇచ్చారు.టికెట్ల కోసం ఆశించి భంగపడ్డ వారు పార్టీ ఎంపిక చేసిన అభ్యర్దుల విజయానికి పాటు పడితే భవిష్యత్తులో వారికి వేరే పదవులు ఇచ్చి గౌరవిస్తామని కేసీయార్ ఆఫర్ ఇచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఎంత పెద్ద నేత అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కేసీయార్ రెండు నియోజక వర్గాల నుండి పోటీచేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విజయంపై ఆయనకు ధీమా లేకపోవడం వల్లనే రెండు నియోజక వర్గాలను ఎంచుకున్నారని రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. అయితే తిరుగులేని వ్యూహంతోనే కేసీయార్ కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారని పాలక పక్షం అంటోంది. కేసీయార్ పోటీ చేసే రెండు చోట్లా పార్టీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటు ఉమ్మడి మెదక్ తో పాటు అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లోని అన్ని నియోజక వర్గాల్లోనూ కేసీయార్ రెండు చోట్ల పోటీ చేయడం వల్ల పార్టీ అభ్యర్ధులకు మేలు జరుగుతుందంటున్నారు రాజకీయ పండితులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…