వరుసగా రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు కలిసిరాని ఖమ్మం జిల్లా ఈ సారి కూడా కేసీఆర్ ను టెన్షన్ పెడుతోంది. ఖమ్మంపై టీడీపీ, వైఎస్సార్టీపీ ప్రత్యేక దృష్టి పెట్టడంతో అధికార పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. మరోే పక్క బీజేపీ కూడా దూసుకొస్తోంది. పైగా పార్టీ నుంచి వైదొలిగేందుకు సిద్ధమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోజుకో స్కడ్ మిస్సైల్స్ ప్రయోగిస్తున్నారు. ఆయన బీజేపీలోకి వెళ్తారన్న వార్తల నడుమ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై పరోక్షంగా దుమ్మెత్తిపోస్తున్నారు. నిష్క్రమణకు తన కేడర్ ను పొంగులేటి సిద్ధం చేస్తున్నారు. మరో పక్క మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవహారం కూడా కేసీఆర్ కు కొంత ఇబ్బందిగా మారింది. దానితో ఇక లాభం లేదనుకున్న గులాబీ బాస్ తన ట్రంప్ కార్డ్ అయిన హరీష్ రావును రంగంలోకి దించారు.
ఖమ్మంలో ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ట్రబుల్ షూటర్ జిల్లాకు వచ్చినట్లు చెబుతున్నారు. అసలు సంగతి మాత్రం వేరే ఉంది. రెబెల్ గా మారాలనుకునే వారిని దారికి తెచ్చేందుకు ఆయనకు మిషన్ ఖమ్మం పొలిటికల్ ప్రాజెక్టును అప్పగించారు. బీజేపీ వారి ఆపరేషన్ ఆకర్ష్ కు అడ్డుకట్ట వేసే బాధ్యతను హరీష్ భుజ స్కందాలపై పెట్టారు.
బీఆర్ఎస్‌ను దేశవ్యాప్తం చేయడంతోపాటు బీజేపీని చావుదెబ్బ కొట్టాలన్నది కేసీఆర్ లక్ష్యం. దానికోసం ఖమ్మం సభ సక్సెస్ బాధ్యతలను గులాబీబాస్ హరీష్ రావుకు అప్పగించారు. కేసీఆర్ ఆదేశాలు అందుకున్న హారీష్ ఖమ్మం గుమ్మంలో అడుగు పెట్టీపెట్టగానే ఆపరేషన్ మొదలెట్టారు. బీఆర్ఎస్ సభ సక్సెస్ ఎంత ముఖ్యమో పార్టీ నేతలు బీజేపీ వలలో పడకుండా చూడడమూ అంతే ముఖ్యమని గులాబీబాస్ ఆదేశాలివ్వడంతో హరీష్ రావు ఆ దిశగా ఖమ్మంలో పావులు కదుపుతున్నారు. ఒకవైపు సభ ఏర్పాట్లపై అధికారులు, నేతలతో చర్చిస్తూనే మరోవైపు జిల్లాలోని బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో వ్యక్తిగతంగా సమావేశం అవుతున్నారు. ఎవరూ తొందరపడొద్దని చెప్తూ నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
హరీష్ ఇప్పటికే మండలాల వారిగా ఒక రౌండ్ వేసేశారు. పార్టీ నేతలను పేరుపేరుగా పలుకరించారు. బీఆర్ఎస్ లో ఉంటే కలిగే ప్రయోజనాలు, బీజెపీలోకి వెళితే వచ్చే నష్టాలను వివరించారు. అలిగిన వారిని స్వయంగా బుజ్జగిస్తున్నారు. కొందరి విషయంలో పొరబాట్లు జరిగినట్లు అంగీకరిస్తూ ఖమ్మం సభ తర్వాత కేసీఆర్ కు చెప్పి తానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో వాస్తవ పరిణామాలను వివరిస్తూ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు గులాబీబాస్ ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారో వారికి వివరిస్తున్నారు. కేసీఆర్ రహస్య సర్వే చేయించారని అందులో బీఆర్ఎస్ కే విజయావకాశాలు కనిపించాయని చెబుతున్నారు. కావాలంటే సర్వే రిపోర్టులను పార్టీ కేడర్ కు అందుబాటులో ఉంచుతామని ప్రకటిస్తున్నారు.
పొంగులేటితో వెళ్లేందుకు సిద్ధమైన నేతలను గుర్తించిన హరీష్ రావు వారిని పిలిపించి మాట్లాడుతున్నారు. తాను నిర్వహిస్తున్న సన్నాహక సభలకు రాని నేతల జాబితాను తెప్పించుకుని వారికి ఫోన్ చేస్తున్నారు. వీలైతే ఇక్కడికి రండి లేకపోతే హైదరాబాద్ రండీ మాట్లాడదామని చెబుతున్నారు. మరో పక్క మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా హరీష్ రావు సెట్ చేశారని చెబుతున్నారు. ఇంతకాలం ఏదేదో మాట్లాడిన తుమ్మల ఇప్పుడు ఖమ్మం సభ సక్సెస్ చేసే బాధ్యతను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పాలేరు టికెట్ తుమ్మలకే ఇస్తామని కేసీఆర్ మాటగా హరీష్ ప్రకటించడంతో తుమ్మల ఆగ్రహజ్వాలలు చల్లారాయని సమాచారం. పైగా కేసీఆర్ తో తుమ్మలను ఫోన్లో మాట్లాడించడం ద్వారా పార్టీలో దూరాన్ని కూడా తగ్గించేశారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ను వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే. కేసీఆర్ అప్పగించిన పనిలో హరీష్ 100 శాతం సక్సెస్ అవుతారా లేదా అని వారు చర్చించుకుంటున్నారు. అందుకే జనవరి 18 తర్వాత కూడా ఖమ్మం బాధ్యతలు హరీష్ రావు చూసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.