బీఆర్ఎస్ కు షాకిచ్చిన బీజేపీ

By KTV Telugu On 22 March, 2023
image

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు అనూహ్య ఫలితాలనిచ్చాయి. బీజేపీతో పాటు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచిన ఏవీఎన్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. తెలంగాణలో సగం ప్రాంతం ఈ మూడు ఉమ్మడి జిల్లాల కిందకే వస్తుందన్న లెక్కలో ఏవీఎన్ రెడ్డి విజయాన్ని భవిష్యత్ రాజకీయాలకు ఆపాదిస్తున్నారు. సమీప ప్రత్యర్థి పీఆర్టీయూటీఎస్‌ తరపున పోటీ చేసిన చెన్నకేశవరెడ్డిపై ఏవీఎన్ రెడ్డి 1,456 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉన్న మొత్తం 29,720 ఓట్లకు 25,868 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 452 ఓట్లు చెల్లలేదు. బరిలో 21 మంది నిలిచారు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఏవీఎన్ రెడ్డి గెలిచినట్లు ప్రకటించారు.

ఏవీఎన్ రెడ్డి విజయంతో బీజేపీలో జోష్ పెరిగింది. ఆయన్ను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పిలిచిన బండి సంజయ్ శాలవతో సత్కరించారు. బీజేపీ కార్యాలయంలో సంబరాలు కూడా జరిగాయి. బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం సాధించడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ఏవీఎన్‌ రెడ్డి ఆయన గెలుపు కోసం పనిచేసిన బీజేపీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ విజయమే తెలియజేస్తోందని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ ఎన్నికలపై వాకబు చేసి ఏవీఎన్ రెడ్డి విజయం కోసం పనిచేసిన కార్యకర్తలను అభినందించారు.

ఏవీఎన్ రెడ్డిని బీజేపీ ఓన్ చేసుకుని ప్రచారం నిర్వహించింది. రాష్ట్ర రాజకీయాల్లో పైచేయిగా నిలిచేందుకు ఈ ఎన్నిక ఉపయోగపడుతుందని అంచనా వేసుకుని మరీ రంగంలోకి దిగింది. అనుకున్నది జరగడంతో బీజేపీ ఇప్పుడు అమితానందంలో మునిగిపోయింది. విద్యాధికులు ప్రభుత్వోద్యోగులు టీచర్లలో కేసీఆర్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని గ్రహించి మరీ బీజేపీ అడుగు ముందుకేసింది. కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాల నుంచి ప్రజలను కాపాడాలంటే అవినీతికర పాలన నుంచి విముక్తి కలగాలంటే మార్పుకు ఓటెయ్యాలని బీజేపీ ప్రచారం చేసింది. ఉపాధ్యాయుల ఆకాంక్షలు నెరవేర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని అందుకు అందరూ ఏవీఎన్ రెడ్డికి ఓటెయ్యాలని బీజేపీ అభ్యర్థించింది. ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య నిరంకుశ వైఖరికి నిరసనగా టీచర్లు ఏపీఎన్ రెడ్డికి ఓటేశారని బీజేపీ అంటోంది. ఈ విజయం విద్యారంగ పరిరక్షణకు ఉపాధ్యాయుల ఉద్యోగుల హక్కులకు బాసటగా నిలుస్తుందని ఇంతకాలం తమ తరఫున చట్టసభలో మాట్లాడే వారు లేరని నిరాశ చెందిన ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థి గెలవడానికి అనేక కారణాలున్నాయి. విశాల జనహితం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయడం లేదన్న వాదనను ప్రత్యేకంగా ప్రస్తావించక తప్పదు. టీచర్లు కూడా ప్రజల్లో ఒక భాగమే అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునేందుకు ఒక మెతుకు పట్టుకుని చూస్తే చాలంటారు. ఇప్పుడు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను కూడా అదే దిశగా పరిగణించాలి. టీచర్లు ఈ ప్రభుత్వాన్ని వద్దనుకుంటే జనం కూడా వద్దనుకుంటారన్న విశ్వాసంతోనే టీబీజేపీలో జోష్ పెరిగింది. ప్రచారంలో బండి సంజయ్ టీమ్ చెప్పినది కూడా అదే. అవినీతికర కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజు వచ్చిందని దానికి ఎమ్మెల్సీ ఎన్నికలతోనే నాంది పలకాలని సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ మాత్రమే సరైన ప్రత్యామ్నాయమని సంజయ్ టీమ్ ప్రచారం చేసింది. డబుల్ బెడ్ రూము ఇళ్లు కావాలంటే ధరణి అక్రమాలు పోవాలంటే తమకే ఓటు వేయాలని ప్రచారం చేసింది. ఇలాంటి నినాదాలన్నీ టీచర్ ఓటర్లపై బాగానే పనిచేశాయి.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ అనేది భౌగోళికంగానూ సంఖ్యాపరంగానూ అతి పెద్ద నియోజకవర్గమని చెప్పక తప్పదు. అందుకే బీజేపీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది పైగా జనంలో పరపతి పెంచుకునేందుకు కూడా బీజేపీకి ఈ ఎన్నిక ఉపయోగపడింది. కమలం పార్టీకి నాయకులే గానీ కేడర్లు ఓటర్లు లేరన్న ప్రచారానికి తెరదించే దిశగా కూడా ఈ ఎన్నిక ఉపయోగపడిందని చెప్పక తప్పదు. జనంలో తమకు మద్దతుందని బీజేపీ చెప్పుకునేందుకు ఒక సదవకాశంగా లభించింది. దూకుడు రాజకీయాలు నిర్వహించే బండి సంజయ్ కు ఈ ఫలితం ఒక టానిక్ లా కూడా ఉపయోగపడుతుంది. రాష్ట్రపర్యటనకు వచ్చే జాతీయ నేతలు తెలంగాణలో తమ పార్టీ బలపడుతుందని చెప్పుకునేందుకు ఈ ఎన్నికలు ఊతమిస్తున్నాయి.