బొగ్గు నేలపై పట్టుకోసం తాపత్రయం

By KTV Telugu On 1 July, 2024
image

KTV TELUGU :-

సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ గులాబీ పార్టీ కార్యాచరణకు రెడీ అవుతోందా..? సింగరేణిలోని తమ కార్మిక సంఘాన్ని బీఆర్ఎస్ యాక్టివ్ చేయనుందా..? చేయబోయే ఉద్యమంతో కోల్ బెల్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ తన పట్టును పెంచుకోగలుగుతుందా? సింగరేణిలో గులాబీ బాస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇంతకీ బొగ్గు కార్మికుల్లో బిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పట్టు చిక్కుతుందా.?

దేశ వ్యాప్తంగా బొగ్గు గనులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయంతో తెలంగాణలో పాలిటిక్స్ వేడెక్కాయి. రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల రక్షణ కుఓసం బిఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి సిద్దం అయింది. తిరిగి తమ కార్మిక సంఘాన్ని యాక్టివ్ చేసింది. సింగరేణి కార్మికులతో కలిసి పోరాటం చేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే బొగ్గు గనుల వేలంపై రాష్ట్రంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య వార్ నడుస్తోంది. బొగ్గు గనుల వేలంపై బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యాయని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలో వుండగానే కేంద్రం రెండు బొగ్గు బ్లాకులను వేలం వేసిందని కాంగ్రెస్ పార్టీ అంటోంది.

తాజాగా దేశ వ్యాప్తంగా వేలం వేయనున్న గనుల్లో తెలంగాణకు చెందిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ వుంది. రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా సింగరేణి సంస్థకే ఇవ్వాలని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.బొగ్గు బ్లాకులను ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా సింగరేణి సంస్థను ప్రయివేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బిఆర్ఎస్ పార్టీ బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తోంది. సింగరేణి

సంస్థను ప్రయివేటు పరం చేయకుండా అడ్డుకుంటామని అంటోంది. అందులో భాగంగానే తమ కార్మిక సంఘం భవిష్యత్ కార్యాచరణ గురించి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించి సంఘ నేతలతో చర్చించారు.

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో దీక్షలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 27వ తేదీ వరకు విడతల వారీగా నిరసన దీక్షలు చేపట్టనున్నారు. హైదరాబాద్ లో వున్న సింగరేణి భవన్ తో పాటుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో దీక్ష చేపట్టేందుకు కూడా బిఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. కేంద్రం బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా ఒత్తిడి పెంచే విధంగా గులాబీ పార్టీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది.

బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. సింగరేణికి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో రెండు సార్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపొందింది. ఆ తర్వాత బొగ్గు గని కార్మిక సంఘాన్ని కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు వున్నాయి. సింగరేణి కార్మిక సంఘానికి గౌరవ  అధ్యక్షురాలిగా వున్న ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం మూడవ స్థానానికి పరిమితం అయింది. దీంతో బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా తమ కార్మిక సంఘాన్ని తిరిగి యాక్టివేట్ చేయాలని గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. ఇదే అంశాన్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకుని సింగరేణిపై పట్టును నిలబెట్టుకోవాలని బిఆర్ఎస్ భావిస్తోంది.

రాష్ట్రంలో సింగరేణి కోల్ బెల్ట్ పరిధిలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా…అసెంబ్లీ ఎన్నికల్లో అన్నింటిలోను బిఆర్ఎస్ ఓడిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోను సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో బిఆర్ఎస్ ఓడిపోయినా అధికారం రావడంతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ గూటికి చేరారు. కోల్ బెల్ట్ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ తిరిగి బలోపేతం కావాలంటే బొగ్గు గనుల వేలం అంశంతో తిరిగి ప్రజల్లోకి వెళ్తేనే పార్టీకి మైలేజీ వస్తుందని బిఆర్ఎస్ భావిస్తోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి