తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉంటే ఎంత ఊడితే ఎంత అనుకున్నారో ఏమో కానీ బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ ఆదేశాల మేరకు కొంతకాలంగా పార్టీలో చెప్పులో రాయిలా చెవిలో జోరీగలా కంట్లో నలుసులా యమ చికాకు పెట్టేస్తోన్న ఇద్దరు నేతలను అమాంతం వదిలించేసుకున్నారు బి.ఆర్.ఎస్.నేతలు. ఎన్నికల ఏడాదిలో పార్టీని శుభ్రంగా క్లీన్ చేసుకునే పనిలో భాగంగానే ఈ నేతలను తొలగించామని బి.ఆర్.ఎస్. నాయకత్వం చెబుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. ఓటమే లక్ష్యంగా కంకణం కట్టుకుని మరీ పనిచేస్తామని ఉద్వాసనకు గురైన ఇద్దరు నేతలు ఒట్టేసి చెప్పారు. ఏడాదిన్నరకు పైగా పొంగులేటి గులాబీ పార్టీ నాయకత్వంపై గుర్రుగానే ఉన్నారు. చాలా అసంతృప్తితో ఉన్నారు. అప్పుడే ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది అయితే ఆయన ఏ పార్టీలోకీ చేరలేదు కానీ కొంతకాలంగా ఆత్మీయ సమ్మేళనాల పేరిట తన అనుచరులు కార్యకర్తలతో భేటీ అవుతూ వస్తోన్న పొంగులేటి పార్టీ అధినేత కేసీయార్ పైనా ప్రభుత్వంపైనా తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. కొంత కాలం ఓపిక పట్టిన నాయకత్వం ఇంకా ఉపేక్షిస్తే అది పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపుతుందన్న ఉద్దేశంతో జూపల్లితో పాటే పొంగులేటిపైనా వేటు వేసేసింది.
సస్పెన్షన్ పై స్పందించిన పొంగులేటి తాను అసలు బి.ఆర్.ఎస్. లో సభ్యత్వమే తీసుకోలేని తనని సస్పెండ్ చేయడం ఏంటని నిలదీశారు. 2018 ఎన్నికలకు ముందు లింగాల గెలుపు బాధ్యతను తనకు అప్పగించిన సందర్భంలో తనకు రాజ్యసభ సీటు ఇస్తామని కేసీయార్ హామీ ఇచ్చారని కానీ పార్టీలో చేరిన తర్వాత హామీని అటకెక్కించి తను మోసం చేశారని పొంగులేటి ఆరోపిస్తున్నారు. తనపై వేటుపడ్డం చాలా సంతోషాన్నిచ్చిందని పొంగులేటి అన్నారు. పంజరం నుండి బయట పడ్డట్లు ఇపుడు స్వేచ్ఛగా ఉందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా లోని 10 నియోజక వర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గం నుండీ కూడా బి.ఆర్.ఎస్. అభ్యర్ధులు గెలిచి అసెంబ్లీ గేటు తాకే పరిస్థితి ఉండనే ఉండదని పొంగులేటి సవాల్ విసిరారు. బి.ఆర్.ఎస్. అభ్యర్ధుల ఓటమే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన హెచ్చరించారు. సరే ఇపుడు ఈ ఇద్దరూ ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరమైన ప్రశ్న. బి.ఆర్.ఎస్. అధినేతపై విమర్శలు చేసిన సందర్భంలో మా ఇంట్లో వై.ఎస్.ఆర్. ఫోటో ఉంటే మీకేంటి అని నిలదీశారు పొంగులేటి. nదానర్దం ఏంటి ఆయన వై.ఎస్.ఆర్. తనయ షర్మిలమ్మ పెట్టిన వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీలో చేరతారా అన్న అనుమానాలు వస్తున్నాయి.
కొద్ది నెలల క్రితం ఆయన వై.ఎస్.ఆర్. సతీమణి వై.ఎస్.nవిజయమ్మను మర్యాద పూర్వకంగా కలవడం కొద్ది సేపు చర్చించడం తెలిసిందే. అప్పుడే షర్మిల పార్టీలో చేరడానికి ఏమైనా ఒప్పందం జరిగిందా అన్నది ఓ వర్గం ప్రశ్న.
అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలే ఉన్నాయని మరి కొందరు అంటున్నారు. కాంగ్రెస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ లో చేర్చుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. nపొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబానికి ఈ ప్రాంతంపై మంచి పట్టు ఉంది. నమ్మదగిన అనుచరుల బలం కూడా ఉండడం అడ్వాంటేజ్ ఆర్ధికంగానూ పొంగులేటి బలమైన వారే. అందుకే ఆయన కోసం కాంగ్రెస్ పార్టీ ముమ్మర యత్నాలు చేస్తోందంటున్నారు. ఖమ్మం జిల్లా మొదట్నుంచీ కూడా కాంగ్రెస్-కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే ఉండేది. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కూడ తేలిపోయింది. చిత్రంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఒక ఎంపీ సీటేతో పాటు నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పాగా వేసింది అప్పట్లో. ఖమ్మం జిల్లాలో దివంగత వై.ఎస్.ఆర్.కు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ ఓటు బ్యాంకును పదిలం చేసుకోడానికే షర్మిల ఖమ్మంపై దృష్టి సారించారు. ఇక జూపల్లి పొంగులేటి చూపు ఎటు వైపు ఉంటుందనేది త్వరలోనే తేలిపోతుంది.