బీఆర్ఎస్ – ఆ 4 నియోజకవర్గాలు…!

By KTV Telugu On 15 May, 2024
image

KTV TELUGU :-

ఏ పార్టీకైనా ఉత్థాన,పతనాలు ఉండటం సహజమే. కొన్ని నియోజకవర్గాల్లో  ఎన్నటికీ గెలవలేకపోవడమూ సహజమే. రెండు  దశాబ్దాల బీఆర్ఎస్, అలియాస్ టీఆర్ఎస్ రాజకీయ ప్రయాణంలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మొండిచేయి కనిపిస్తూనే ఉంది. ఎంత ప్రయత్నించినా పార్టీ ఒక్క సారి కూడా అక్కడ గెలవలేదు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లోనైనా అక్కడ గెలిచే అవకాశం ఉందా అన్న కోణంలో గులాబీ బాస్ కేసీఆర్ లెక్కలేసుకుంటున్నారు….

అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్ సభ ఎన్నికలు వేరు అని చెబుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించిన ఓటర్లు లోక్ సభ ఎన్నికల్లో ఓడించిన  సందర్భాలు దేశంలో చాలా చోట్లనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఖంగు తిని, తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిలదొక్కుకున్న దాఖలాలు కూడా ఉన్న మాట వాస్తవం. బీఆర్ఎస్ ఇప్పుడు అదే ఆలోచనతో ఉంది.  అసెంబ్లీ ఎన్నిక్లలో ఓడిపోయి ఇంటికే పరిమితమైన ఆ పార్టీ నేతలు ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్నారు. ఆ క్రమంలో తమకు విజయమంటే ఏమిటో తెలియని నాలుగు నియోజకవర్గాల్లో ఈసారైనా గెలవాలని ప్రయత్నించారు. పోలింగ్ పూర్తయి, ఓటరు మనోగతం ఈవీఎంలలో నిక్షిప్తిమైన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా  వేసుకుంటున్నారు. వాస్తవానికి పదేళ్లు పోరాటాలు చేసి.. ఆపై పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీకి ఓ నాలుగు నియోజకవర్గాలు మాత్రం కొరుకుడు పడడం లేదు. ఎంత ప్రయత్నించినా విజయం మాత్రం అందని ద్రాక్షే అవుతోంది. గెలుపు చేతిదాకా వచ్చి చేజారుతోంది. పోనీ, అవేమైనా దూర ప్రాంతాల్లో ఉన్నాయా? లేక పార్టీ లక్ష్యానికి అక్కడ ఆదరణ లేదా? అంటే.. అదేమీ కాదు.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి  తయారైంది. ఆ నియోజకవర్గాలు అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, నల్లగొండ నియోజకవర్గాల్లో  విజయం .. ఆ పార్టీకి అందని ద్రాక్షే అయ్యింది. విజయానికి చేరువగా వస్తున్నారే గానీ గెలవలేకపోతున్నామన్న వెలితి కారు పార్టీ పెద్దలను వెంటాడుతూనే ఉంది….

తెలంగాణ ఏర్పాటుకు ముందు 2004 ఆ తర్వాత 2009 ఎన్నికలు.. తెలంగాణ ఏర్పాటైనా తర్వాత 2014 ఆ తర్వాతి 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలవలేదు. నిజానికి తెలంగాణ ఏర్పాటుకు ముందు తొలి సారి కాంగ్రెస్ పార్టీతో, తర్వాతి సారి మహాకూటమిలో భాగంగా పోటీ చేసినప్పటికీ హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ,  మల్కాజ్ గిరి నియోజకవర్గాలు  బీఆర్ఎస్ ను వెక్కిరిస్తూనే ఉన్నాయి. 2019లో కారు..సారు.. పదహారు నినాదంలో బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లోకి దిగింది. అంటే ఒక హైదరాబాద్ మినహా మిగిలిన 16 నియోజకవర్గాల్లో గెలుస్తామని చెప్పుకుంది. ఐనా సరే ఆ పార్టీకి వచ్చిందీ ఆరు సీట్లే. అప్పుడు ఆ నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించలేకపోయింది. హైదరాబాద్  లో మజ్లీస్ ను దాటి గెలవడం కష్టమేనని చెప్పక తప్పదు. కాకపోత్ అసెంబ్లీ ఎన్నికల్లో  గెలిచే సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా లోక్ సభకు మాత్రం బీఆర్ఎస్ గెలుపు కష్టమవుతోంది. గత ఎన్నికల్లో అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తరపున  విజయం సాధించారు.  ఇక ఉద్యమాల గడ్డ నల్లగొండ కూడా బీఆర్ఎస్ ను దూరం పెట్టింది. అక్కడ కాంగ్రెస్ లోని వేర్వేరు గ్రూపులు బలంగా ఉన్నాయి. మామూలు రోజుల్లో ఎంత కొట్టుకున్నా.. ఎన్నికల సమయంలో మాత్రం అంతా ఒకటే కాంగ్రెస్ ను గెలిపించుకుంటూ బీఆర్ఎస్ ను దూరం పెడుతున్నారు. గత ఎన్నిక్లలో అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. ఇక 2009లో ఏర్పాటైన మల్కాజ్ గిరి నియోజకవర్గంలో గత సారి గెలుస్తామనుకున్న బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి రూపంలో గండం అడ్డు పడింది.  జనం రేవంత్ పక్షం వహించడంతో బీఆర్ఎస్ కు నిరాశ తప్పలేదు..

ఈ సారి అదృష్టం మారుతుందని  బీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల చీలిక ఏర్పడి తమకు ప్రయోజనం కలిగితే మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ లో గెలుస్తామని బీఆర్ఎస్ విశ్వసిస్తోంది.కాకపోతే నల్లగొండ మాత్రం కష్టమేనని భావిస్తున్నారు. అక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి  కుటుంబం కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతిస్తోంది. చూడాలి ఫలితాలు  ఎలా ఉంటాయో…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి