టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ నేతలు చేశారు. తమ పార్టీ టీఆర్ఎస్సేనని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి పుట్టిన టీఆర్ఎస్ పార్టీని గత ఏడాది చరిత్రలో కలిపేశారు కేసీఆర్., బీఆర్ఎస్ ను ఆవిష్కరించారు. ఇంకా ఎందుకు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తున్నారు ? వద్దనుకున్న టీఆర్ఎస్ ఎందుకు ముద్దవుతోంది ?
తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఓ సంచలనం. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని ఉండవచ్చు కానీ.. ఆ పార్టీ పయనం అంత సాఫీగా సాగలేదు. మొదటి నుంచి పోరాటమే. ఎప్పటికప్పుడు ఉనికి పోరాటం చేసింది. మొదట్లో తెలంగాణ ఉద్యమ పార్టీపై ప్రజల్లో అంత నమ్మకం పెట్టుకోలేదు. పొత్తలు పెట్టుకుని రాజకీయ ఉనికిని చాటుకుంటూ.. రాజీనామాలు చేస్తూ.. ఉపఎన్నికల ద్వారా ఉద్యమ వేడిని పెంచుకుంటూ వచ్చారు. 2009 ఎన్నికల తర్వాత ఇక పార్టీ పరిస్థితి అయిపోయిందేమో అనుకన్నారు. అలాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ ఒక్క సారిగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించి.. ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారు. ఆ ఉద్యమం ధాటిక తెలంగాణ వచ్చింది.. ఆ తర్వాత అధికారం వచ్చింది. పదేళ్ల పాటు తిరుగులేని పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది.
ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు .. వెల్లువలా నేతలు వచ్చి చేరారు. అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చేరారు. అయితే అధికారం పోగానే అందరూ జారుకుంటున్నారు. ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్కు ఉద్యమకారులే ఓటు బ్యాంక్. తెలంగాణ ఏర్పాటు తర్వాత క్రమంగా సెంటిమెంట్ తగ్గడం కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో అసలు సమస్య ప్రారంభమయింది. ఎలా చూసినా తాను ప్రజలకు ఎంతో సంక్షేమం, అభివృద్ధి ఇచ్చానని ప్రజలు వదులుకోరని కేసీఆర్ అనుకున్నారు. కానీ ప్రజలు అలా అనుకోలేదు. ఫలితంగా అధికారం వదులుకోవాల్సి వచ్చింది. అలా అధికారం పోయిన వెంటనే..నాలుగు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు మళ్లీ తాము తెలంగాణ కోసం పుట్టామని తమను ఆదరించాలని ప్రజల్ని వేడుకోవాల్సి వస్తోంది.
కేసీఆర్ ఇప్పుడు ఎప్పుడూ లేనంత సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైల్లో ఉన్నారు. నమ్మకస్తులైనా పార్టీ నేతలంతా పార్టీని వీడిపోయారు. వ్యక్తిగత ఇమేజ్ లేని అభ్యర్థుల్ని నిలబెట్టి పార్టీ బలం మీద గెలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించడం లేదు. నిలబడి ప్రసంగించే పరిస్థితి లేదు. ఇబ్బందికరం అయినా పార్టీ కోసం బస్సు యాత్ర చేస్తున్నారు. పార్టీ క్యాడర్ లో నమ్మకం కలిగించడానికి ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ మాత్రం కాకపోయినా కనీసం ఐదు పార్లమెంట్ సీట్లు గెల్చుకుంటేనే .. క్యాడర్ కు ఎంతో కొంత భరోసా లభిస్తుంది. వారు పార్టీలో ఉండాలనకుంటారు.
ముఖాముఖి పోరు జరిగే రాజకీయం తెలంగాణలో ఉండి ఉంటే బీఆర్ఎస్ ఓడిపోయినా ఆ పార్టీకి ఇబ్బంది ఉండేది కాదు. కానీ అపర చాణక్య కేసీఆర్ చేసిన వ్యూహాత్మక తప్పిదాలే బీజేపీని బలీయమశక్తిగా మార్చాయి. విపక్షాలను లేకుండా చేయాలని చేసిన ప్రయత్నాలతో బీజేపీ బలం పుంజుకుంది. ఓ దశలో ఆ పార్టీ అదికారం సాధిస్తుందన్న అంచనాలు కూడా వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర స్థాయిలోనే పరిగణనలోకి తీసుకోకుండా ప్రతిపక్షంలో పెట్టిన ప్రజలు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయడం కష్టమే. అయినా ఉనికి సమస్య కాబట్టి కేసీఆర్ తన ప్రయత్నం తాను చేస్తున్నారు. తమ పార్టీ బీఆర్ఎస్సే అని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…