సుడిగాలిలా చుట్టేస్తోన్న గులాబీ బాస్

By KTV Telugu On 9 November, 2023
image

KTV TELUGU :-

ఎన్నికల యుద్ధంలో అందరి కంటే ఎంతో ముందున్న కారు పార్టీ ప్రచారంలో మరింతగా దూకుడు పెంచింది. గులాబీ బాస్‌ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం కవరయ్యేలా సభల్లో పాల్గొంటున్నారు. ఇక కేటీఆర్‌, హరీష్‌రావులు ప్రచారంతో పాటు…చేరికలు, సంక్షోభ నివారణ బాధ్యతలతో బిజీగా ఉన్నారు. ఇక రూట్ మారిన ప్రచారంతో ఇప్పటివరకు ఒక లెక్క..ఇకనుంచి మరో లెక్క అంటున్నారు కేసీఆర్. పోలింగ్ సమయం దగ్గరపడే కొద్దీ సరికొత్త వ్యూహాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. గులాబీ పార్టీ ప్రచార వ్యూహాలు ఎలా ఉన్నాయి? వాచ్ దిస్ స్టోరీ..

సభలు, సమావేశాలతో ఎన్నికల ప్రచారాన్ని గులాబీ పార్టీ హోరెత్తిస్తోంది. రోజు వారీ కేసిఆర్ సభలు, మంత్రుల సమావేశాలు, నియోజకవర్గాల ఇంచార్జి మీటింగ్స్ తో బిజీ బిజీ గా మారింది. ఒకవైపు కేసీఆర్…మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రి హరీష్‌రావులు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గతం కంటే దూకుడుగా…ఎక్కువగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో రోజుకు ఒకటి లేదా రెండు సభలు నిర్వహించిన కేసీఆర్ తర్వాత వాటిని మూడుకు పెంచారు. ఇప్పుడు మరింత స్పీడ్  పెంచి ఒక్క రోజులోనే నాలుగు సభలు నిర్వహిస్తున్నారు.

పోలింగ్‌ షెడ్యూల్‌కు మూడు రోజుల ముందే ప్రచారం నిలిచిపోతుంది. అప్పటికి కనీసం వంద సభల్లో ప్రసంగించే విధంగా కేసీఆర్ షెడ్యూల్ తయారు చేశారు. ఎక్కడైనా వీక్‌గా ఉన్నదని భావిస్తే అటువంటి నియోజకవర్గాల్లో అదనంగా మరోసభ నిర్వహించాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. మొత్తం రాష్ట్రం అంతా కేసీఆర్ ప్రచారం కొనసాగుతుంది. సమయం తక్కువగా ఉండటంతో ప్రజలకు ప్రభుత్వ పథకాలు వివరించేందుకు పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ ఆయన పోటీ చేసే సిరిసిల్ల నియోజకవర్గం మినహా మిగిలిన రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు.

పార్టీలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా కేటీఆర్ వెంటనే అక్కడ ప్రత్యక్షమై పరిష్కరిస్తున్నారు. పార్టీలోకి వస్తామన్న నాయకులతో మాట్లాడి వారిని చేర్చుకుంటున్నారు. వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా  ఆత్మీయ సమ్మేళనాలు, కుల సంఘాల సమావేశాలతో దూకుడు పెంచింది. వివిధ కులాల వారు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు ఒకవైపు కేటీఆర్‌..మరోవైపు హరీష్‌రావు హాజరవుతున్నారు. జిల్లా స్థాయిలో అక్కడి మంత్రులే ఆత్మీయ సమ్మేళనాలు, కులసంఘాల సమావేశాల్లో పాల్గొంటున్నారు.  ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరాదని కేసీఆర్ పార్టీ నాయకుల్ని ఆదేశించారు.

కుల సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి, అన్ని సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకుని వారి ఆత్మ గౌరవం పెంచి, వారి సమస్యలు తీర్చేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందనే భరోసా కల్పిస్తోంది బీ ఆర్ ఎస్ నాయకత్వం. ఎన్నికల్లో కులాల ఓట్లు ఎక్కడా చీల కూడదు..ప్రాబల్యం ఉన్న కులాల ఓట్లన్నీ గంపగుత్తగా కారు గుర్తుకే పడాలన్న లక్ష్యంగా గులాబీ పార్టీ పనిచేస్తోంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ప్రతి ఒక్క ఓటర్ ను నేరుగా కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీలు కూడా ఇలా నిర్వహించలేదు. బీ ఆర్ ఎస్ మాత్రమే ఈ సమావేశాలతో ఎక్కువ మందికి ప్రణాళిక రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంది.

బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని 17 ముఖ్యమైన అంశాలను కేసీఆర్ భరోసా పేరుతో పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నారు. ప్రతి సభలోనూ కేసీఆర్ సూటిగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆగమై ఆలోచన లేకుండా ఓటేయవద్దని..విచక్షణతో ఓటేయాలని ప్రజలకు గులాబీ బాస్ పిలుపునిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో భారత రాష్ట్ర సమితి ప్రచారంలో దూసుకుపోతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి