ఒక ఓటమికే బీఆర్ఎస్ కకావికలమైందా. కేడర్ చిన్నాభిన్నమైందా. నేతలు ఇంటికే పరిమితమవుతున్నారా. బయటకు వచ్చి జనంలో తిరిగేందుకు ఇష్టపడటం లేదా. లోక్ సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందా.. అగ్రనాయకత్వం కూడా చూసీ చూడనట్లు ఊరుకుంటోందా. బీఆర్ఎస్ లో అసలేం జరుగుతోంది…..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఊహించిందే అయినా ఆశించింది కాదని చెప్పక తప్పదు. ఈ క్రమంలో ఓటమి బాధ నుంచి బయటపడేందుకు తొలుత బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ప్రయత్నించింది. తెలంగాణ భవన్ వేదికగా మీటింగులు పెట్టింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా రోజువారీ మీటింగులకు హాజరై ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించారు. ఓటమి ఒక గ్యాప్ మాత్రమేనని, త్వరలో బౌన్స్ బ్యాక్ ఖాయమని పార్టీ శ్రేణులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంతలో అసెంబ్లీ సమావేశాలు రావడంతో పార్టీ మీటింగులకు బ్రేక్ పడింది. ఈ లోపు కొందరు నాయకులపై అవినీతి ఆరోపణలు రావడంతో కథ మొత్తం మారిపోయింది. కళేశ్వరం ప్రాజెక్టుపై పార్టీ మీద వచ్చిన ఆరోపణలు ఒక వంతయితే, వ్యక్తిగతంగా నేతలపై వస్తున్న కబ్జాలు, బెదిరింపుల లాంటి ఆరోపణలు మరోవంతు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీలో మాజీ ప్రజాప్రతినిధులంతా సైలెంట్ అయిపోయారు. ఎవరూ ఎవరినీ కలవడం లేదు. పార్టీని నిలబెట్టుకోవాలన్న తపన వారిలో కనిపించడం లేదు. ప్రస్తుతానికి మౌనంగా ఉండటమే మంచిదన్న ఆలోచన వారిలో కలుగుతోంది..
లోక్ సభ ఎన్నికల్లో ఏం జరగబోతోంది. పార్టీ తరపున పోటీ చేసే వాళ్లుంటారా. వారికి ఇతరులు సహకరిస్తారా. కేడర్ తీరు ఎలా ఉంది.. కేడర్ కు , నాయకత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడిందా…
పార్లమెంటు ఎన్నికలకు ముందు పార్టీ కార్యక్రమాలు స్తంబించిపోవడం బీఆర్ఎస్ కు చావు దెబ్బగా పరిణమించే ప్రమాదం ఏర్పడింది. ఓడిపోయిన నాయకులంతా నియోజకవర్గాల్లో సైతం ప్రజలకు, కేడర్‌కు తూతూమంత్రంగా అందుబాటులో ఉంటున్నారు. ఏ కార్యక్రమం నిర్వహించినా భారీగా ఖర్చు అవుతుందని అందుకే దూరంగా ఉంటున్నట్లు సమాచారం. లోక్‌సభకు పోటీచేసేవారే ఖర్చుపెట్టుకొని పార్టీని యాక్టివ్ చేసుకుంటారని, తమకెందుకు అనే ధోరణిలో ఇతర ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలో స్తబ్దత నెలకొనడంతో కేడర్‌లో సైతం నైరాశ్యం నెలకొంది. అర్బన్ ప్రాంతాల్లోని కేడర్ అంతా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపడంతో పాటు కండువాలు కప్పుకుంటున్నారు. వారిని కాపాడుకునే ప్రయత్నం సైతం అధిష్టానం చేయడం లేదని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. దీనితో పార్టీలో ఉండాలా..మారిపోవాలా అన్న ఆలోచన కొందరితో నెలకొన్నది.
బయటకు చెప్పకపోయినా బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఒక సమస్య వేధిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏమిటన్న ఆవేదన వారిని వెంటాడుతోంది. పార్టీకి మూడు నుంచి ఐదు లోక్ సభా స్థానాలకు మించి రావని తాజా సర్వేలు తేల్చేయడంతో కొత్త టెన్షన్ మొదలైంది. ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని దూరం పెట్టాలో కూడా అర్థం కావడం లేదు,టికెట్ తీసుకున్న వాళ్లు కష్టపడి పనిచేస్తారా…నామ్ కే వాస్తే పోటీ చేసి ఓడిపోతారా అర్థం కాక తలపట్టుకు కూర్చుంటున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…