అధికారపక్షం నుంచి విపక్షంలలోకి మారిన తర్వాత భారత రాష్ట్ర సమితికి ఏదీ కలిసిరావడం లేదు. పార్టీ ఫిరాయింపులతో బీఆర్ఎస్ బక్కచిక్కిపోతోంది. ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారోనని టెన్షన్ పడుతున్నప్పటికీ తలుపులు మూసుకుని కూర్చునే పరిస్థితి లేదు. మరో పక్క బీఆర్ఎస్ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. దానితో విపక్షంలో ఉంటే వచ్చే కష్టాలు ఏమిటో వారికి ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది… కేసీఆర్ అండ్ టీమ్ కు ఏమి చేయాలో తోచడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చిక్కుకుని కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇప్పుడు తీహార్ జైలులో మగ్గుతున్నారు. ఎన్ని సార్లు బెయిల్ పిటిషన్లు వేసిన అవి తిరస్కారానికి గురవుతున్నాయే కానీ బయటకు వచ్చే దారి కనిపించడం లేదు. కవితను కాపాడుకోవడమెలాగో అర్థం కాక కేసీఆర్ తలపట్టుకుంటున్నారు.ఈ క్రమంలోనే కేసీఆర్ పైనా కేసులు ఖాయమన్న చర్చ నడుస్తోంది. ఆయనపై ఈడీ కేసు నమోదు చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణ చేశారు. పైగా మాజీ సీఎం కోసం ఈడీ అధికారులు హైదరాబాద్ వచ్చారని కూడా ఆయన ప్రకటించారు. అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారమేనని అందరూ అనుమానిస్తున్నారు.ఇక ఓవైపు పవర్ కమిషన్, మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటిదాకా తన పదేండ్ల పాలనపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పిన గులాబీ బాస్.. ఇప్పుడేమో ఆగమాగమవుతున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలను తేల్చేందుకు ఏర్పాటైన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.మొదటిసారి నోటీసులు జారీ చేసినప్పుడు కమిషన్ విచారణను తప్పుబడుతూ కేసీఆర్ రాసిన లేఖతో ఆయనలోని టెన్షన్ బయటపడిందని నిపుణులు అంటున్నారు. ఆధారాలను క్రాస్ చెక్ చేసుకోవడంతో పాటు ఏమైనా వివరాలు ఉంటే కమిషన్ ముందుకొచ్చి ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్నామని కమిషన్ రెండోసారి నోటీసులు జారీ చేయగా, ఆ వెంటనే కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. దీంతో కమిషన్ల ఎంక్వైరీ విషయంలో కేసీఆర్ కు క్లారిటీ వచ్చిందని, వాటి ఆర్డర్లు తనకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆయనకు అర్థమైందని నిపుణులు చెబుతున్నారు. ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఏదైనా సరే కమిషన్ పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు ప్రభుత్వ వర్గాలకు కూడా కోపం తెప్పించేదిగా ఉంది. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కాకపోతే కేసీఆర్ కు అరెస్టు వారెంట్ వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అందుకే ఇప్పుడు కేసీఆర్ కొంత టెన్షన్ పడుతున్నట్లు సమాచారం….
కేసీఆర్ పైనే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులపై సైతం కేసులు నమోదవుతున్నాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలీయక ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారు. వరుస కేసులు ఉండటంతో ఏ కేసు ఎటు పోతుందో అర్థం కాక టెన్షన్ పెరుగుతోంది..
ఒకే రోజు పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ వైఫల్యాలను, నేతల వైఖరి, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు చేర్చేందుకు తమదైన శైలిలో విమర్శలకు పదును పెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో కరీంనగర్ జెడ్పీ సమావేశంలో కలెక్టర్ , అధికారుల విధులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారు. దీనిపై ఫిర్యాదుతో కొత్త చట్టమైన బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 221, 126(2) కింద పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయగా, కుమ్రంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మీ మధ్య ప్రొటోకాల్ వివాదం వ్యక్తిగత ఘర్షణలకు దారితీసింది. విశ్వప్రసాదరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కోవాలక్ష్మీ పై 296(బీ), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.కేసులు నమోదైన ఇద్దరు ఎమ్మెల్యేలు తమదైనశైలిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో చేరనందుకే తనను వేధిస్తున్నారని ఎమ్మెల్యే కోవాలక్ష్మి మండిపడ్డారు. ప్రొటోకాల్ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలను అవమానిస్తోందన్నారు. జెడ్పీ సమావేశంలో విద్యార్థుల సమస్యలపై స్పందించాలని కలెక్టర్ ను కోరితే అడ్డుకున్నారని, విధులకు భంగం కలిగించారని క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కేసుపై స్పీకర్ ను కలుస్తానని, ప్రివిలైజ్ నోటీసును డీఈవోకు ఇస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. తనపై కేసు విషయంలో అవసరమైతే హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలపై కేసును ప్రచార అస్త్రంగా చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ వ్యవహారశైలిని ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో లబ్దిపొందాలని, అందుకోసం ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రస్తావించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే వారి కోరిక నెరవేరే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను పక్కాగానే ఇరికించేస్తోంది. అందుకే వారిలో టెన్షన్ పెరగుతోంది. పైగా ఒక్కో నేతపై అరడజను కేసులు పెడితే.. ఏదోక దానిలో అరెస్టు చేసే అవకాశాలు కూడా పెరుగుతాయి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…