ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్‌తో లిక్కర్ స్కామ్ ఎంక్వయిరీ క్లైమాక్స్‌కి వచ్చింది. ఇప్పటిదాకా తన ప్రమేయం లేదని బుకాయించిన సిసోడియా పాత్రని ఆధారాలతో నిర్ధారించింది సీబీఐ. ఒకేరోజు మూడు ఫోన్లను మార్చిన విషయాన్ని కూడా బయటపెట్టింది. ఇప్పటిదాకా దర్యాప్తు సంస్థలు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నాయన్న ఆమ్ఆద్మీ పార్టీకి ఇది పెద్ద షాక్. డిప్యూటీ సీఎం అరెస్ట్‌తో ఆప్ షాక్ తిన్నదంటే అర్ధముంది. కానీ అంతకుమించి తెలుగురాష్ట్రాలు ఉలిక్కిపడుతున్నాయి. ఎందుకంటే ఆ స్కామ్‌లో డబ్బుల లావాదేవీలు నడిపిన సౌత్‌గ్రూప్ ప్రముఖులంతా తెలుగురాష్ట్రాలవారు కావడమే. ఈమధ్యే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనీష్ సిసోడియా వంతు వచ్చింది. తర్వాత ఎవరంటే అందరి చూపూ కేసీఆర్ కూతురు కవితవైపే.
లిక్కర్‌స్కామ్‌లో ఇప్పటిదాకా 12మంది అరెస్టయ్యారు. వారిలో కవిత సన్నిహితులైన శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, ఆడిటర్ బుచ్చిబాబు కూడా ఉన్నారు. ఒంగోలు ఎంపీ కొడుకు కూడా కవితతో కొన్నిసార్లు భేటీ అయ్యారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కూతురు కవితను సీబీఐ సాక్షిగా విచారించింది. లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ రిపోర్టులు, చార్జిషీట్‌లో కవిత పేరును దర్యాప్తు సంస్థలు ప్రస్తావించాయి. దీంతో ఈసారి ఆమెను విచారణకు పిలిస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం కేసీఆర్‌ని కలవరపెడుతోంది. అందుకే మనీష్ సిసోడియా అరెస్టుని బీఆర్ఎస్ నేతలు అంతలా ఖండిస్తున్నారు. కేంద్రం దర్యాప్తుసంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని దుమ్మెత్తి పోస్తున్నారు.
మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి ఇతర ముఖ్యనేతలంతా మనీష్ సిసోడియా అరెస్ట్ రాజకీయ కుట్రేనంటున్నారు. కవిత అరెస్ట్ తప్పదన్న భయంతోనే కేంద్రంపై బురదచల్లుతున్నారని బీజేపీ తిప్పికొడుతోంది. ఆ పార్టీ ముఖ్యనేత వివేక్ వెంకట స్వామి చేసిన వ్యాఖ్యలు గులాబీపార్టీలో గుబులు పుట్టిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో త్వరలోనే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతారని సంచలన కామెంట్స్ చేశారు వివేక్. కవిత పేరును సీబీఐ, ఈడీ ఇప్పటికే పదేపదే ప్రస్తావించాయి. ఆధారాలు చెరిపేసేందుకు మొబైల్ ఫోన్లను ధ్వంసం చేయడం, కిక్ బ్యాక్‌ల పేరుతో ముడుపులు, వైన్ షాపుల లైసెన్సులు, పాలసీ రూపకల్పన విషయంలో కవితతో పలువురు చర్చలు జరపడం అన్ని ఆధారాలు దర్యాప్తుసంస్థల దగ్గర ఉండటంతో ఏ క్షణమైనా కవిత అరెస్ట్ తప్పేలా లేదు. అదే జరిగితే శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్లే