ఎన్నికల వేళ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నదేమిటి. బీఆర్ఎస్ తో విసిగిపోయిన జనం కాంగ్రెస్ కోసం ఎదురుచూస్తున్నారా. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్లు కోరుకుంటున్నదీ సాధ్యమేనా. అవినీతికర పార్టీగా ముద్రపడిన బీఆర్ఎస్ నుంచి విముక్తి పొందితే సరిపోతుందా. రాష్ట్రంలో సమూల మార్పులు సాధ్యమా. దశల వారిగా అభివృద్దిని కోరుకుంటున్నారా….
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ పట్ల పూర్తిగా విసిగిపోయారు. వాళ్లిప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అధికారానికి వస్తే తమ సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా కాంగ్రెస్ చేతిలో పెట్టేస్తామని ధైర్యంగా చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో వాళ్లు ఖుషీ ఖుషీగా ఉన్నారు. పనిలో పనిగా ధరణి పోర్టల్ నుంచి తమకు విముక్తి కలిగించాలని జనం కోరుకుంటున్నారు. ధరణి కారణంగా వేలాది మంది రైతులు మోసపోయారని చెబుతూ ముందుగా వారికి న్యాయం చేయాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దిశగా సుదీర్ఘమైన ఆలోచన చేసిన నేపథ్యంలో ధరణి కంటే మెరుగైన వ్యవస్థను తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రైతు బంధు ఒక్కటే పరిష్కారం కాదని అన్నదాతలు నిర్థారణకు వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండా చూడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. వాటి వైపు కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టాలి. అభివృద్ధి అంటే పట్టణాలకే పరిమితమైందని, గ్రామీణ మౌలిక సదుపాయాల వైపు పదేళ్లుగా దృష్టి పెట్టలేదని జనం వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నికల తర్వాతైనా గ్రామీణ రోడ్లు, విద్యుత్ ఇతర సదుపాయాలపై ఆలోచించాలని కోరుతున్నారు. కేసీఆర్ చెబుతున్న డబుల్ రోడ్లు ఏ గ్రామాలకు వచ్చాయో చెప్పాలంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లో వోల్టేజీ సమస్యలను పరిష్కరించాల్సి ఉంది.గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాల పేరుతో అప్పట్లో ఓ నినాదం ఎత్తుకున్నా ఇప్పుడదీ నిర్వీర్యమైపోయిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. దానిపై కూడా కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉంది. అందుకే ఎన్నికల వేళ తమ సమస్యలను ప్రతిబింబించేందుకు వారు చేపట్టిన బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. జాబ్ క్యాలెండర్ పేరుతో ఏమీ చేయకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం తమను మోసగించిందని యూత్ ఆందోళన చెందుతోంది. ఉద్యోగాలు లేక యువతీయువకులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదని వారు గుర్తు చేస్తున్నారు. ఏడాదికి ఐదారు లక్షల మంది డిగ్రీలు పూర్తి చేస్తే పట్టుమని పదివేల మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. అందుకే జాబ్ క్యాలెండర్ సక్రమంగా అమలు చేయాలి. స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. విద్యా ప్రమాణాలు పెంచేందుకు, వృత్తి విద్యా కళాశాలల్లో నాణ్యమైన ఫ్యాకల్టీని నియమించేందుకు ప్రయత్నించాలి. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఉంటే.. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో వారు ఏదోక పని చేస్తూ కుటుంబ ఆదాయం పెరిగేందుకు తమ వంతు సహకారం అందిస్తారని రాబోయే ప్రభుత్వం గుర్తించాలి. అప్పుడే అధికారంలో ఉన్న పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది.
గృహ వసతి కంటే ధరల నియంత్రణ ముఖ్యం.చిన్న పట్టణాల్లో సైతం రియల్ ఎస్టేట్ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. ఇక హైదరాబాద్ లాంటి మహానగరాల్లో రేట్లు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. వాటిని నేలకు దించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆలోచించాలి. ఈ దిశగా రిజిస్టేషన్ ఛార్టీలు, సిమెంట్ ధరలు తగ్గించే చర్యలు అవసరం. ఇసుక లభ్యతపై కూడా దృష్టి పెట్టాల్సిన అనివార్యత ఉంది. పట్టణ పర్యావరణాన్ని దెబ్బ తీసే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడాదని జనం కోరుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై బీఆర్ఎస్ ప్రభుత్వం 50 అంతస్తులకు కూడా అనుమతులిచ్చేసింది.ఆయా అపార్టమెంటుల్లో అగ్నిప్రమాదం జరిగితే పరిస్థితేమిటన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అందుకే అపార్టమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఎంత తక్కువ అంతస్తులు ఉంటే అంత మంచిదని గుర్తించాలి.
పారిశ్రామిక ప్రగతికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత ఉంది. రెండు రాష్ట్రాలకు ఇప్పుడు సాప్ట్ వేర్ రంగం పట్టుకొమ్మగా మారిన మాట వాస్తవం. నిజానికి హైదరాబాద్ నుంచి సాఫ్ట్ వేర్ ఎగుమతులు పది రెట్లు పెరిగాయి. ఇంజినీరింగ్ చదివిన ప్రతీ యువకుడికి ఏదోక ఉద్యోగం వస్తోంది. కాకపోతే సాఫ్ట్ వేర్ ఒక్కటే బతుకు కాదని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. తయారీ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్తితి తెచ్చుకోకూడదు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ మీద పడి తయారీ రంగాన్ని వదిలేశారన్న అపవాదు ఉంది. తయారీ రంగం పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మరిచిపోకడదు. స్కిల్డ్, అన్ స్కిల్డ్ రంగాల్లో ఉద్యోగాలు వెదుక్కుంటూ వస్తాయి. సాఫ్ట్ వేర్ రంగానికి మరింత చేయూతనిస్తూనే ఇతర పారిశ్రామిక రంగాలను కూడా ప్రోత్సహించాలి. తలసరి ఆదాయాలు పెరుగుతున్న తరుణంలో అవి తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 10 పాయింట్ రెండు మూడు శాతం పెరిగిన నేపథ్యంలో దాన్ని పెరుగుదల బాటలోనే ఉంచాలి. పైగా ఇన్నోవేటివ్ హబ్స్, గ్రీన్ టెక్నాలజీ రంగాలకు గట్టి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తించక తప్పదు. స్టార్టప్స్, గ్రీన్ టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటిస్తే అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుంది.
పర్యాటకాభివృద్ధిపై కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అనివార్యత ఉంది. తెలంగాణలో 477 పర్యాటక ప్రదేశాలను గుర్తించారు. 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో దేశీయ పర్యాటకుల సంఖ్య 32 కోట్లగానూ, విదేశీ పర్యాటకుల సంఖ్య 50 లక్షలుగానూ ఉంది. పర్యాటకం పెరిగితే, జనం వస్తూ పోతూ ఉంటే.. అది పరోక్షంగా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని మరిచిపోకూడదు. అన్నింటికీ మించి అవినీతి రహిత రాష్ట్రాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందన్న ఆరోపణలున్నాయి. కల్వకుంట్ల కవిత దగ్గర్నుండి సామాన్య అధికారి వరకు ప్రతీ ఒక్కరు అవినీతికి ఆలవాలమైపోయారు. అలా అవినీతి చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టే బాధ్యతను రాబోయే ప్రభుత్వం ఎలాంటి భేషజాలు లేకుండా చేపట్టాలి. అప్పుడు స్వచ్ఛమైన సమాజ స్థాపన సాధ్యమవుతుంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…