చంద్రబాబు వ్యాఖ్యలపై భగ్గుమంటోన్న తెలంగాణ

By KTV Telugu On 1 March, 2023
image

వయసు పెరిగే కొద్దీ క్లారిటీ ఎక్కువ అవుతుంది. కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిలో మాత్రం ఏదో మిస్ అవుతోంది. ఆయన చేసే కొన్ని వ్యాఖ్యలు చూస్తోంటే ఈయనేనా 14ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నది అనిపిస్తుంది. ఈయనేనా జాతీయ స్థాయిలో చక్రాన్ని గిరగిరా తిప్పిన నాయకుడు అనికూడా అనిపిస్తుంది. తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణా ప్రజల గుండెల్లో అగ్గి రాజేశాయి. ఇప్పుడంటే చంద్రబాబు నాయుడంటే కొందరికి కామెడీ స్టఫ్ గా కనిపిస్తోంది కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అపర చాణక్యుడాయన. పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఆనక పార్టీలో చోటిచ్చి పదవులిచ్చిన ఎన్టీయార్ కే నొప్పి తెలీకుండా వెన్నులో కత్తి అమాంతం దింపేసి ముఖ్యమంత్రి అయిపోయిన జీనియస్ చంద్రబాబు.

ఆ రోజుల్లో చంద్రబాబు నోట ఒక్క మాట కూడా జారేది కాదు. మాటే కాదు కనీసం ఒక్క అక్షరం కూడా పొల్లు పోయేది కాదు.
అటువంటి చంద్రబాబు నాయుడు కొంతకాలంగా బ్యాలెన్స్ తప్పేస్తున్నారు. గరిమనాభి తప్పినట్లు ఆయన మాట తూలేస్తోంది. కాలు జారినా తీసుకోవచ్చుకానీ నోరు జారితే తీసుకోలేం కదా. తాజాగా చంద్రబాబు నాయుడు ఏమన్నారంటూ తెలంగాణా ప్రజలకు వరి అన్నం తినడం తామే నేర్పాం అనేశారు. తెలంగాణాలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని గేరప్ చేయాలని పార్టీనేతలను ఉద్దేశించి సూచించిన చంద్రబాబు నాయుడు కాస్త జనం కనపడే సరికి ఉత్సాహం ఆపుకోలేకపోయారు. తెలంగాణా ప్రజల తలసరి ఆదాయం బాగా ఉందంటే దానికి కారణం తానే అని సీక్రెట్ బయట పెట్టారు. తెలంగాణాకు ఐటీ కంపెనీలు తెచ్చిందీ హైదరాబాద్ ను ప్రపంచ పటంపై పెట్టిందీ తానేనని గతంలో చాలా సార్లు చెప్పారు చంద్రబాబు.

ఇపుడు చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణా మేథావులతో పాటు ప్రజల్లోనూ మండుకొస్తోంది. చంద్రబాబు నాయుడు లేకపోతే తమకి వరి అన్నమే తెలీదా అని వారు మండిపడుతున్నారు. తెలంగాణా సంస్కృతిపై దాడి ఆపకపోతే  తరిమి తరిమి కొడతామని వారు హెచ్చరిస్తున్నారు. తెలంగాణా ప్రజల జీవనవిధానాన్నీ వారి ఆచార సంప్రదాయాలనూ వారి బాషనూ చీటికీ మాటికీ కించపర్చడం వల్లనే కదా తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నది. అలా సాధించుకున్న తెలంగాణా గడ్డపై నిలబడి చంద్రబాబు నాయుడు మళ్లీ  పాత రూటులోనే అవమానించడం ఏంటని తెలంగాణా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చంద్రబాబే కాదు ఆయన తనయుడు నారా లోకేష్ నిన్న కాక మొన్ననే యువగళం పాదయాత్రలో మాట్లాడుతూ 1994 వరకు హైదరాబాద్ అంటే ఎవరికీ తెలీదని పుసుక్కున అనేశారు. తన తండ్రి చంద్రబాబు నాయుడి కృషి వల్లనే హైదరాబాద్ అనే నగరం ఒకటున్నదని అందరికీ తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు.

తన తండ్రి పాలనను కీర్తించాలన్నదే లోకేష్ ఉద్దేశం కావచ్చు కానీ తెలంగాణా ప్రజలకు మాత్రం ఏపీ రాజకీయ నేతలు ఇప్పటికీ తమని అవమానిస్తున్నారనే సీరియస్ అయ్యారు. చంద్రబాబు నాయుడితో పాటు టిడిపితో పొత్తుకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య ఎన్టీయార్ వచ్చే వరకు తెలంగాణా వారికి అన్నం అంటే ఏంటో తెలీదన్నారు. పండక్కో పబ్బానికో అన్నం వండుకుంటే అదే పరమాన్నంగా భావించేవారని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్వతహాగా ఓ ప్రాంత ప్రజలను కానీ సామాజిక వర్గం ప్రజలను కానీ అవమానించే రకం కాదు. అందరినీ గౌరవించే మనిషి పవన్. అటువంటి పవన్ ఎన్టీయార్ వచ్చిన తర్వాతనే అన్నం వండుకునేవారని అనడానికి చంద్రబాబు ఇచ్చిన రాంగ్ ఫీడింగే కారణమని రాజకీయ పండితులు అంటున్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణాలో సెటైర్లు కూడా పడిపోతున్నాయి. చంద్రబాబు నాయుడి హెరిటేజ్  కంపెనీ వచ్చేదాకా తెలంగాణా ప్రజలకు పాలు అంటే ఎలా ఉంటాయో తెలీదని అప్పటి వరకు బ్లాక్ టీ మాత్రమే తాగేవాళ్లమని చంద్రబాబు పుణ్యమా అని  బ్లాక్ టీలో పాలు పోసుకుని ఛాయ్ తాగుతున్నామని పంచ్ లు వేస్తున్నారు తెలంగాణా మేథావులు. చంద్రబాబు నాయుడు చెప్పబట్టే మొఘలాయీ బిరియానీని కూడా నేర్చుకున్నామని వారంటున్నారు.
తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని పెట్టాలనుకున్న చంద్రబాబు నాయుడు అదే తెలంగాణా ప్రజలను అవమానిస్తే పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుందన్న చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారో అని రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ చంద్రబాబు ఇలాగే మాట్లాడేవారు. అమెరికాలో అక్కడి ప్రజల కన్నా మన తెలుగువాళ్లే ఎక్కువ జీతాలు సంపాదిస్తారని వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు అదీ మన చొరవ అంటే అంటూ ముక్తాయించేసరికి ప్రజలకు గుండె ఆగినంత పనైంది. అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటోన్న తెలుగువారందరినీ చంద్రబాబు నాయుడే దగ్గరుండి విమానం ఎక్కించారా ఏంటి అని అప్పట్లో సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిసింది. అయినా చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యలను తన వైఖరినీ మార్చుకోవడం లేదు. హైదరాబాద్ నగరాన్నీ తానే కట్టానన్నారు. దేశంలో సెల్ ఫోన్లు వచ్చాయంటే తన చలవే అన్నారు. కరోనాకు వ్యాక్సీన్ వచ్చిందంటే అది టిడిపి ఘనతే అన్నారు. సత్య నాదెళ్ల తన స్ఫూర్తితోనే ఐటీ రంగంలోకి వెళ్లి అలా మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సంపాదించారన్నారు చంద్రబాబు.

ఇలా కత్తిమీద సాములాంటి ఆచరణ సాధ్యం కాని ఎన్నో వ్యాఖ్యలను అత్యంత అవలీలగా చంద్రబాబు అనేస్తూ ఉంటారు. అయితే దాన్ని అర్ధం చేసుకోలేని వారు మాత్రం తెలంగాణా ప్రజల్లా మండిపడుతూ ఉంటారు. అయితే వీటిని చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ విధంగా వెనక్కి పోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఎత్తుగడలు వ్యూహాల్లో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు ఇపుడిలా మాట్లాడ్డంపై చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పి ప్రధానులు రాష్ట్ర పతులను నియమించిన చంద్రబాబు నాయుడు నలుగురూ నవ్విపోతారని కూడా చూసుకోకుండా అనాలోచిత వ్యాఖ్యలు చేయడం బాగాలేదని మేథావులు అంటున్నారు.