తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో సీఎం కేసీఆర్‌కు కొత్త కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో సతమతం అవుతుంటే ఆ పార్టీని వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు దూసుకువచ్చింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బీఆర్‌ఎస్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేసుకుపోతోంది. ఎవరు ఏం చేసుకున్నా ఈసారి కూడా గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమని బీఆర్‌ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు ఇన్నిరోజులు. కానీ వ్యూహాలు మారిపోతున్నాయి. ప్రత్యర్థులు బలం పుంజుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
అయితే ఆయన నేరుగా కేసీఆర్‌ను కానీ బీఆర్‌ఎస్ ను కానీ విమర్శించలేదు. కాకపోతే తెలంగాణలో ఓటు అడిగే హక్కు టీడీపీకే ఉందన్నారు. తాను ఫౌండేషన్ వేయకపోతే హైదరాబాద్ ఇంత అభివృద్ధి అయ్యేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు అన్నవారికి ఖమ్మంలో బహిరంగ సభకు వచ్చిన జనమే సమాధానం అని అన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే అసలు కిటుకు దాగి ఉంవది. ఏపీలో వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు అంటున్నారు. ఎలాగైనా జగన్‌ను గద్దె దించకపోతే ఏపీలో టీడీపీకి పుట్టగతులు ఉండవని ఆయనకు అర్థమైపోయింది. అధికారంలోకి రావాలంటే ఆయనకు జనసేన మద్దతు అవసరం. కానీ జనసేన బీజేపీతో సహవాసం చేస్తోంది. బీజేపీతో కూడా పొత్తుకు చంద్రబాబు రెడీగా ఉన్నారు కానీ చంద్రబాబుతో చేతులు కలపడం ఏపీ బీజేపీ నాయకులకు ఇష్టం లేదు. అందుకే ఇటు నుంచి నరుక్కురావాలనేది చంద్రబాబు వ్యూహం. తెలంగాణాలో తనకున్న బలాన్ని చూపించి ముందు ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. ఆ తరువాత ఏపీలోనూ బీజేపీని తనవైపు మళ్లించుకోవాలి ఇదీ ఆయన ప్లాన్.
చంద్రబాబు ఆలోచనను పసిగట్టిన బీఆర్‌స్ నేతలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మూకుమ్మడిగా బాబును టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. మంత్రులు హరిష్‌రావ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కవిత చంద్రబాబు మీద అటాక్ చేశారు. గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడా ఏపీలో చెల్లని నాణం తెలంగాణలో చెల్లుతుందా.? ఏపీని అభీవృద్ధి చేయలేక అప్పుల పాలు చేసి ప్రజలు చీత్కారానికి గురైన చంద్రబాబు ఇక్కడికొచ్చి అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. ఏపీలో ప్రజలు చిత్తుగా ఓడించిన వ్యక్తి తెలంగాణాలో ఏం చేస్తారు. ఆయనది భస్మాసుర హస్తం అని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తెలంగాణాలో అడుగుపెట్టి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. మొత్తానికి తెలంగాణ గడ్డ మీద చంద్రబాబు మళ్లీ అడుగుపెట్టడం బీఆర్‌ఎస్ నాయకుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఒకవైపు షర్మిల వైఎస్‌ఆర్‌టీపీతో ప్రజల్లో పాదయాత్ర చేస్తూ బీఆర్‌ఎస్ నేతలపై దుమ్మెత్తిపోస్తోంది. ఆ మధ్య ప్రధాని మోదీ స్వయంగా షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిణామాలు చూసి బీఆర్‌ఎస్ ఆలోచనలో పడింది అనంటున్నారు రాజకీయ పరిశీలకులు.