సీఎం కేసీఆర్‌ కు చంద్రబాబు జలక్‌

By KTV Telugu On 13 December, 2022
image

బీఆర్‌ఎస్‌ తో జాతీయ స్థాయి రాజకీయాల్లో సత్తా చాటాలనుకుంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం కూడా సిద్ధమైపోయింది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీఆర్‌ఎస్‌ కార్యాలయం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకోసం విజయవాడలో స్థలం ఎంపిక కూడా పూర్తయిందని సమాచారం. రేపోమాపో బీఆర్‌ఎస్‌కు ఏపీ అధ్యక్షుడిని కూడా నియమించేందుకు సిద్దమవుతున్నారు.

అయితే ఇటు కేసీఆర్‌ ఆంధ్రాలో అడుగుపెట్టేందుకు వ్యూహాలు రచిస్తుంటే అటు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణపై దృష్టి సారించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో తెలంగాణలో టీడీపీని యాక్టివ్ చేసేందుకు మళ్లీ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా టీడీపీకి బాగా పట్టున్న ఖమ్మం జిల్లా నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 21న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు టీటీడీపీ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ సభలో పాల్గొంటారని కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ స్పష్టం తెలిపారు.

21వ తేదీన హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ హవా ఉన్నా ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ టీడీపీకి కొద్దిగా పట్టుంది. ఆ ప్రాంతంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని చెప్పవచ్చు. అయితే ఓటుకు కోట్లు కేసు తరువాత చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీని గాలికొదిలేసి ఏపీకే పరిమితమయ్యారు. దాంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ పంచన చేరారు. ఇప్పుడు మళ్లీ ఖమ్మం జిల్లాతో మొదలెట్టి తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఖమ్మం తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌పై చంద్రబాబు దృష్టి పెట్టే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న ఈ బహిరంగ సభ ద్వారా తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆరోజు జరిగే సభలో చంద్రబాబు ఏ మాట్లాడతారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కేసీఆర్‌ను విమర్శిస్తారా లేకపోతే హైదరాబాద్‌ను నేను నిర్మించాను ప్రపంచ పటంలో పెట్టాను. హైటెక్ సిటీ కట్టాను అని ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చేసి వెళ్లిపోతారా అనేది ఆసక్తికరంగా మారింది.