అప్పుడెప్పుడో ఓటుకునోటు కేసులో అప్పట్లో టీడీపీ నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి దొరికాక అధినేత అ్రడస్ లేరు. రాష్ట్ర విభజన ముందుదాకా రెండు కళ్ల సిద్ధాంతం వల్లెవేసిన సీనియర్ మోస్ట్ నేత విభజన తర్వాత తెలంగాణలో జెండా పీకేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏవో ఒక కార్యక్రమాలు జరుగుతుండొచ్చుగానీ తెలంగాణలో టీడీపీకి ఉనికిలేకుండాపోయింది. ఉమ్మడి రాజధానిగా సాంకేతికంగా హైదరాబాద్ ఉన్నా ముందే ఇక్కడినుంచి పచ్చపార్టీ తట్టాబుట్టా సర్దేసుకుంది.
దింపుడుకళ్లెం ఆశని ఒకటుంటుంది. టీడీపీ ఇప్పుడా ఆశతోనే తెలంగాణపై దృష్టిపెట్టినట్లుంది. ఖమ్మంలో ఉన్నట్లుండి సభపెట్టి ఉమ్మడిరాష్ట్రంలో తన తొమ్మిదేళ్లపాలనగురించి ఓ రేంజ్‌లో డబ్బా కొట్టుకున్నారు చంద్రబాబు. హైటెక్‌సిటీనుంచి జీనోమ్‌వ్యాలీదాకా రికార్డ్ రీప్లే చేశారు. తెలంగాణలో సీన్ సితారయ్యాక చంద్రబాబుకి మళ్లీ పూనకం తెప్పించింది ఖమ్మం సభ. ప్రత్యక్షంగా ఎవరు పనిచేశారో, తెరవెనుక ఎవరు సహకరించారోగానీ మొత్తానికి సభాప్రాంగణం సందడిగా ఉంది. ఒకప్పుడు ఉమ్మడిరాష్ట్రాన్ని ఏలిన తాను తెలంగాణకి దూరమైపోవడం, ఏపీలో ఓటమిపాలుకావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు చంద్రబాబు. ఖమ్మం సభతో టీడీపీకి ఊపిరిపోయాలనుకుంటున్నారు.
నో డౌట్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీచేస్తుంది. స్వతంత్రంగానా, పొత్తులుంటాయా అన్నది భవిష్యత్తులో తేలుతుంది. మొన్నటిదాకా టీడీపీమీద ఆంధ్రాపార్టీ ముద్రవేసింది బీఆర్‌ఎస్. తెలంగాణవాదంతో అధికారంలోకొచ్చిన కేసీఆర్ పార్టీ పేరులో ఇప్పుడా పేరే లేకుండా పోయింది. మరోవైపు ఏపీ సీఎం సోదరి కూడా వైఎస్సార్టీపీ పేరుతో పార్టీ పెట్టి హడావుడిచేస్తున్నారు. దీంతో పోయినచోటే వెతుక్కోవాలనుకుంటున్నారు చంద్రబాబు కూడా. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడెవరో తెలీని పరిస్థితుల్లో జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ఖమ్మం సభతో లేని ఉత్సాహం తెచ్చుకున్నారు.
ఏపీలో వైసీపీ ఏకుమేకైంది. కలిసొస్తాడనుకున్న పవన్‌కళ్యాణ్ కొత్త లెక్కలేసుకుంటున్నారు. ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పటి మిత్రపక్షం బీజేపీ అస్సలు లెక్కచేయడంలేదు. అందుకే వన్ షాట్ టూ బర్డ్స్‌లా గురి పెట్టాలనుకుంటున్నారు పచ్చపార్టీ అధినేత. రెండుచోట్లా హడావుడి ఉంటే ఇతర పార్టీలతో బేరాలడే కెపాసిటీ పెరుగుతుందన్నది ఆయన వ్యూహం.
2018 తర్వాత తెలంగాణలో టీడీపీ ఉనికి పెద్దగా లేదు. మరో ఏడాదిలో ఎన్నికలుండటంతో మళ్లీ ఆయనకు తెలంగాణ గుర్తుకొచ్చింది. సామాజికవర్గబలంమీద ఉన్న నమ్మకంతో ఖమ్మంలో తొలిసభ నిర్వహించారు. ఎంతమంది జనమొచ్చినా ఖమ్మం సభ వాపేగాని బలుపు కాదు. ఇప్పటికే పార్టీనుంచి ముఖ్యమైన నేతలంతా వేరేపార్టీల్లోకి వెళ్లిపోయారు. తుమ్మల నాగేశ్వరరావులాంటి నేతలు కొన్ని సంకేతాలిస్తున్నా మిగిలినవారు వెనక్కివస్తారనుకోవడం అత్యాశే. కానీ చంద్రబాబుకి కూడా రాజకీయంగా చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఈ ఆరాటం, పోరాటం. చంద్రబాబు మీటింగ్ మీద బీఆర్‌ఎస్‌నుంచి గట్టి కౌంటర్లు పడుతున్నాయి. కనీసం ఆయన జైతెలంగాణ కూడా అనలేదని గులాబీ నేతలు గుర్రుమంటున్నారు. చంద్రబాబు కొండకి వెంట్రుకేస్తున్నారు. కొత్తగా పోయేదేమీ ఉండదంతే!