అపర చాణిక్యుడిగా పేరు పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతీ అడుగు వ్యూహాత్మకంగానే ఉంటుంది. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ పాలనతో జనం విసిగిపోయారని అర్థమైన తర్వాత చంద్రబాబు వేగం పెంచారు. ఇంతవరకు తెలంగాణలో నిదానంగా ఉన్న టీడీపీకి నూతన జవసత్వాలు అందించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. ఆ దిశగానే కాసాని జ్ఞానేశ్వర్ ను టీ.టీడీపీ అధ్యక్షుడిగా నియమించడం, ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఖమ్మం సభలో గంట సేపు సాగిన చంద్రబాబు ప్రసంగంలో ప్రతీ మాట వెనుక ఆయన భవిష్యత్తు దర్శనం ఉందనే చెప్పాలి.
తెలంగాణలో చంద్రబాబు వైసీపీని తిట్టారు. అదీ వ్యూహత్మకమే. ఏపీ అధికార పార్టీ పేరు ప్రస్తావించకుండా ఆపార్టీ రెండు రాష్ట్రాలను కలిపెయ్యాలని అంటోందన్నారు. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడతారా అని నిలదీయడంలో చంద్రబాబు కసి కనిపిస్తోంది.
ఒక్క విషయంలో మాత్రం దేశం అధినేత అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రస్తావించారే తప్ప తెలంగాణ పార్టీలను ఒక్క మాట అనలేదు. తమ హయాంలో ప్రాజెక్టులు వచ్చాయని లెక్కలు చెప్పారు మినహా బీఅర్ఎస్ సర్కారు ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణల మాట ఎత్తలేదు. కేసీఆర్ పాలనలో లోపాలను కానీ కవితపై వస్తున్న కేసుల ప్రస్తావన కానీ ప్రసంగంలో ఎక్కడా వినిపించలేదు. రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డున పడి కొట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలను కూడా విమర్శించలేదు. ఆ పార్టీలో ఎప్పుడూ అంతేనన్న తీరును ప్రదర్శించలేదు. ఆయన మాటల్లో బీజేపీ ప్రస్తావనే ఎక్కడా లేదు. ప్రధాన మంత్రులకు తాను అమూల్యమైన సలహాలు ఇచ్చానని చెప్పుకున్నారే తప్ప వారి పార్టీ ప్రస్తావన రానివ్వలేదు.
ఎవరినీ విమర్శించకపోవడం వెనుక చంద్రబాబు ఎన్నికల వ్యూహం ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు చోట్ల పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేసే ప్రయత్నంలో టీడీపీ ఉంది. చంద్రబాబు కాంగ్రెస్ కు కూడా మిత్రపక్షమే . 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి మహాకూటమిగా పోటీలోకి దిగాయి. అందుకే బీజేపీ, కాంగ్రెస్ విషయంలో చంద్రబాబు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. సాధారణంగా పెద్ద సభల్లో రాజకీయ నాయకులు అన్ని పార్టీలపై సెటైర్లు వేస్తారు. ఈ సారి చంద్రబాబు అలాంటి అవకాశమే ఇవ్వలేదు. ఆయన అధికార బీఆర్ఎస్ పై విమర్శలు చేయపోవడానికి రేపు ఎలా ఉంటుందో అన్న ఆలోచన దాగొన్నట్లు చెబుతున్నారు. బీజేపీతో వెళ్లలేని పరిస్థితి అంటూ వస్తే అప్పుడు కాంగ్రెస్ కు కూడా సమదూరం పాటించాల్సిన అనివార్యత ఏర్పడితే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సి రావచ్చని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకే నొప్పించక తానొవ్వక అన్నట్లుగా వ్యవహరించారన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలోనూ పొత్తులు ఖాయమన్న సంకేతం ఆయన ప్రసంగం నుంచి అందిందనే చెప్పాలి.