తెలంగాణ ప్రజలు బియ్యంతో అన్నం వండుకోలేదా

By KTV Telugu On 1 March, 2023
image

రాజకీయ నాయకులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల జీవన విధానం చరిత్ర సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. కానీ ముందూ వెనకా ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడితే ఆ ప్రాంతప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. రాజకీయ ప్రయోజనాలు కూడా దిగజారిపోతాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ఒక కార్యక్రమం ప్రారంభించారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నాయకులకు కిట్లను పంపిణీ చేశారు. అక్కడ చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆహార అలవాట్లపై కామెంట్‌ చేశారు. తెలంగాణ ప్రజలు బియ్యంతో అన్నం వండుకుని తింటున్నారంటే ఆ ఘనత తెలుగు దేశం పార్టీదని టీడీపీ రాకముందు తెలంగాణలో జొన్నలు, రాగులు, సజ్జలు తినేవారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ వచ్చాక మొట్టమొదటిసారి బియ్యంతో అన్నం వండుకుని తింటున్నారన్నారు. తెలియక అన్నారో తెలిసే అన్నారో లేకపోతే ఫ్లోలో అనేశారో తెలియదుకానీ చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండి పడుతున్నారు.

ఆంధ్రా పాలకులు గతంలో తెలంగాణ ప్రజలను ఇలా అవమానించడం వల్లే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందని రాష్ట్రం రెండుగా విడిపోయినా కూడా వారి వైఖరిలో మార్పు రాలేదని అంటున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబుది అవగాహనరాహిత్యమే కాకుండా అహంకారంతో కూడిన ధోరణి అని విమర్శించారు. భారతదేశంలోనే మొదటి సారిగా వరి అన్నం తిన్నది ప్రజలు తెలంగాణ ప్రజలే అన్నారు. 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించబడ్డ గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణలో పెసలు, అల్లం, పసుపు, వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, ఉల్లి, చెరుకు పంటలు పండించారని చెప్పారు. 15వ శతాబ్దం నాటికి బియ్యంతో చేసే హైదరాబాద్ దమ్ బిర్యానీ ప్రసిద్ధి చెందిందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే బియ్యంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అంటున్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మండిపడ్డారు. ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపారని ధమ్ కా బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో చెప్పాలని నిరంజన్‌ రెడ్డిని ప్రశ్నించారు.