సివిల్ సర్వీస్ అధికారులు రాజకీయాల్లోకి వస్తున్నారు. కొంత మంది సొంత పార్టీలు పెడుతున్నారు. మరికొంత మంది ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అయితే ఎవరూ పెద్దగా నిలదొక్కుకుంటున్న సందర్భాలు లేవు. అతి తక్కువ మంది మాత్రమే తమదైన ముద్ర వేస్తున్నారు. మిగిలిన వారు ఒకటి, రెండు ఎన్నికల తర్వాత ఫేడవుట్ అయిపోతున్నారు. సర్వీస్‌లో తాము ఎంత పవర్ ఫుల్ గా ఉన్న రాజకీయ నేతగా వచ్చేసరికి అధినేత ముందు డమ్మీగా ఉండాల్సి వస్తోంది. సొంత పార్టీలు పెట్టుకున్న వారు అయితే అసలు ప్రజాప్రతినిధి కావడానికి కూడా కష్టపడాల్సి వస్తోంది. నేతల్ని నడిపించిన వారు తాము నేతలుగా ఎందుకు మారలేకపోతున్నారు ?
ప్రవీణ్ కుమార్ ఐపీఎస్. రాజకీయ జీవితంలో- దళితులు, దళితోద్దరణ, బహుజన వాదమనే- ఓ అంకం ముగిసింది. నూతన శకానికి తెర లేపారు. ఎవర్నైతే దొర, దొరబిడ్డ, గడి, గడిపాలనని దుమ్మెత్తి పోశారో అదే పార్టీ- బీఆర్ఎస్-లో చేరి ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో గులాబీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ ని నమ్మి, బీఆర్ఎస్ లో చేరుతున్నానని సగర్వంగా చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి ఆఫర్ చేసినా తిరస్కరించి బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రవీణ్ కుమార్ చెప్పారు. డబ్బు, పదవికి అమ్ముడుపోయే వ్యక్తి ప్రవీణ్ కాదన్నారు. బహుజన వాదం కోసం పని చేసే వ్యక్తినేనన్నారు. చదువులోనే కాదు చాలా వాటిలో ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లల్ని ప్రమోట్ చేశారు. పిల్లలే దేశానికి భవిష్యత్తు. దేశం మారాలంటే మార్చాల్సింది పిల్లల్నే అని బలంగా నమ్మిన ప్రవీణ్ కుమార్ అందుకనుగుణంగా చాలా కార్యక్రమాలు చేపట్టారు. అయితే అధికారిగా ఆయనను ఆదరించిన ప్రజలు.. రాజకీయ నేతగా మాత్రం పట్టించుకోలేదు.
ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ సివిల్ సర్వీసే కానీ ఐఏఎస్, ఐపీఎస్ దాకా రాలేదు. ఇడియన్ ఫైనాన్షియల్ సర్వీస్ దగ్గరే ఆగిపోయారు. చాలా త్వరగా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మంచి సక్సెస్ చూసినట్లే. కానీ ఏ రాజకీయ పార్టీకి కూడా ఐఎఎస్ లు, ఐపీఎస్ లు నాయకత్వం వహించి తుదికంటా నడిపిన దాఖలాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్నీ ఫెయిల్యూర్ స్టోరీలే కనిపిస్తాయి. జమ్మూ కాశ్మీర్ మొదలు ఈర్ఖండ్ వరకు ఎందరెందరో పార్టీలు పెట్టినా ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు. బహుశా అందుకు మినహాయింపు ఆమ్ ఆద్మీ పార్టీ కావొచ్చు. అయితే ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఐఎఫ్ఎస్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. జాతీయ పార్టీలలో చేరిన ఒకరిద్దరు మాత్రం ముఖ్యమంత్రులు కాగలిగారు. వారిలో కాంగ్రెస్ లో చేరిన అజిత్ జోగి ఒకరు. రాజకీయాల్లోకి వచ్చిన ఎక్కువ మంది పదవులు ఆశించి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి వచ్చిన వారో లేకపోతే సర్వీస్ అయిపోయిన తర్వాత వచ్చిన వారో ఉన్నారు.
తెలుగురాష్ట్రాలకు వస్తే.. అప్పుడెప్పుడో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అనే ఐఎఎస్ అధికారి లోక్ సత్తా పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. అదే కోవలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తూ నేటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను అరెస్ట్ చేసి సంచలనం సృష్టించిన జేడీ లక్ష్మీనారాయణ సొంతపార్టీ పెట్టి ఆపసోపాలు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మరో ఐఎఎస్ అధికారి విజయ్ కుమార్ దళిత ఉద్దరణ పేరిట కొత్త పార్టీ పెట్టి పాదయాత్ర చేశారు కానీ ఎవరూ పట్టించుకోలేదు.
సివిల్ సర్వెంట్లు చాలా ఆలస్యంగా రాజకీయాల్లోకి వస్తారు. ఎక్కువ మంది పదవీ విరమణ తర్వాతే రాజకీయపార్టీల దరి చేరతారు. ఇతర రాజకీయ నాయకులు పార్టీలలోనే పుట్టిపెరుగుతారు. జీవితాశయాన్ని నెరవేర్చుకుంటారు. సివిల్ సర్వెంట్లు తమ సీనియారిటీ , ర్యాంక్ లు, జీతభత్యాల గురించి అవగాహన ఉంటుందే గాని రాజకీయానుభవం తక్కువ. రాజకీయాల్లో అంత సీనియారిటీ ఉండదు. యువకుల కింద పని చేయడానికి ఇష్టపడరు. జనంతో కలిసి మెలిసి తిరగలేరు. సివిల్ సర్వెంట్లకు తాము మంత్రులుగా ఏమి చేయగలరో తెలుసు గాని ఓట్లు సాధించలేని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…