సిట్టింగ్ – పార్టీలో ఫైటింగ్

By KTV Telugu On 22 November, 2022
image

టీఆర్ఎస్ లో ముసలం ఖాయమా ? పార్టీ శ్రేణులు ఎందుకు కోపంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా జెండా మోసిన వారికి ఒక్క అవకాశం కూడా ఇవ్వరా అని ఎందుకు ప్రశ్నిస్తున్నారు ? కేసీఆర్ వారిని ఎలా బుజ్జగిస్తారు ?

ఒక్క ప్రకటనతో తేనెతుట్టెను కదిలించిన కేసీఆర్
సిట్టింగులకు మళ్లీ టికెట్లిస్తామన్న గులాబీ దళపతి
సీఎం ప్రకటనతో గులాబీ శ్రేణుల్లో టెన్షన్
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నవారికి నిరాశ
ఇంత కాలం పార్టీ కోసం పనిచేసి ప్రయోజనమేమిటని ప్రశ్నలు
ఎప్పుడు వారికే ఛాన్సిస్తారా అన్ని ఆగ్రహం
ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకూ నామినేషన్
తక్కిన వారంతా ఎమ్మెల్యేలయ్యే అవకాశం లేదా ?
కేసీఆర్ అసలు గేమ్ ప్లాన్ వేరే ఉందా.

బీఆర్ఎస్ గా మారుతున్న టీఆర్ఎస్ లో కొత్త చర్చకు తెరలేచింది. సిట్టింగులకు మళ్లీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ ఇటీవల చేసిన ప్రకటన పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఓరుగల్లు నుంచి పాలమూరు దాకా, సంగారెడ్డి నుంచి నల్లగొండ దాకా పార్టీ శ్రేణులు సలసలాకాగిపోతున్నాయి. సిట్టింగులకు టెన్షన్ తగ్గి ఖుషీగా ఉన్నా ఇంతకాలం ఊహాలోకాల్లో తేలిన ఆశావహులు మాత్రం తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. గత రెండు పర్యాయాలు అవకాశానికి దగ్గరగా వచ్చి చేజారిన వాళ్లు ఇప్పుడు అధిష్టానంపైనా, ఉమ్మడి జిల్లాల్లో చక్రం తిప్పే నేతలపైనా కారాలు మిరియాలు నూరుతున్నారు. ఉద్యమకాలం నుంచి పనిచేస్తుంటే ఒక్క ఛాన్సు కూడా ఇవ్వరా అని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు..

టీఆర్ఎస్ తరపున గెలిచిన వాళ్లు, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లు మొత్తం కలిపి పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇతర పార్టీలకున్నదీ 15 మంది మాత్రమే. అంటే కేసీఆర్ లెక్క ప్రకారం కొత్తగా పదిహేను మందికి మాత్రమే టికెట్లు ఇవ్వాలి. అదే ఇప్పుడు పార్టీలో రచ్చకు కారణమవుతోంది. గత ఎన్నికల్లోనూ ఇదే మాట చెప్పారని తర్వాత ఏదో విధంగా అకామడేట్ చేస్తామని హామీ ఇచ్చి ఒట్టి చేతులు చూపించారని కొందరు వాపోతున్నారు. 2018లో టికెట్ దక్కకపోయినా ఎన్నికల తర్వాత కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లున్నారు. పక్క పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా గులాబీ కండువాకున్న పవర్ ను చూసి టీఆర్ఎస్ లోనే ఉండిపోయామని వాళ్లు అంటున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొంతమందిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. వాళ్లు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కూడా లేవు. అయినా గులాబీ బాస్ వారిపై నమ్మకం ఉంచడంతో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారికి దిక్కుతోచడం లేదు. తమకు అవకాశం వస్తుందన్న ఆశతో కేడర్ బలాన్ని పెంచుకుంటూ పోతుంటే కేసీఆర్ ఇంత పెద్ద బాంబు వేశారేమిటని ప్రశ్నించుకుంటున్నారు. పైగ గత ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అందులో మధుసూధనాచారి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ముఖ్యులని చెప్పాలి. ఇప్పుడు టికెట్లు లేకపోతే వారి పరిస్థితేమిటన్నది అర్థం కావడం లేదు.

ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని వారికి ఎమ్మెల్సీ ఇచ్చి సంతృప్తి పరచడం రాజకీయ పార్టీల్లో ఆనవాయితీగా ఉంది. అయితే ఇప్పుడు మండలిలో కూడా ఖాళీలు లేవంటున్నారు. పార్టీకి 34 మంది ఎమ్మెల్సీలున్నారు. వంద మందికి పైగా ఆశావహులు కనిపిస్తున్నారు. ఒక సారి ఎమ్మెల్సీగా చేసి రిటైరై  రెండో ఛాన్స్ కోసం వేచి చూసే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

టీఆర్ఎస్ లో మరో చర్చ కూడా జరుగుతోంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ తో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేజారి పోయే ప్రమాదం ఉంది. కొంత మంది పక్క చూపులు చూస్తున్నారన్న అనుమానమూ కలుగుతోంది. జనంలో వ్యతిరేకత ఉన్న వారికి టికెట్లు రావని అనుమానాలు కలిగిస్తే వాళ్లంతా కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ అధిష్టానం భయపడుతోంది. పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకుని ఉప ఎన్నికలకు కారణమవుతారు. దానితో పార్టీ ఫండ్ ఖర్చవుతుంది. పార్టీపై లేనిపోని వత్తిడి పెరుగుతుంది. అందుకే కేసీఆర్ తన గేమ్ ప్లాన్ లో భాగంగా సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తానని ప్రకటించారని ఎన్నికల నాటికి అసలు వ్యూహం బయటపడుతుందని ప్రచారం జరుగుతోంది. ఏది నిజమో మరి.