నిఘా పెరిగింది.. గులాబీనేత‌ల గుండెల్లో గుబులు

By KTV Telugu On 16 January, 2023
image

ఇంట్లో నాలుగ్గోడ‌ల మ‌ధ్య తుమ్మినా ఎవ‌రెన్నిసార్లు తుమ్మారో అధినేత‌కు తెలిసిపోతుంది. గోడ‌ల‌కు కూడా చెవులుంటాయ‌న్న విష‌యం బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అర్ధ‌మ‌వుతోంది. మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ త‌ర్వాత ఫోన్ మాట్లాడాల‌న్నా, ప‌ర్స‌న‌ల్‌గా ఎవ‌రినైనా క‌ల‌వాల‌న్నా భ‌య‌ప‌డిపోతున్నారు గులాబీపార్టీ నేత‌లు. ఫాంహౌస్‌లో బేర‌సారాల‌కోసం వ‌చ్చిన ముగ్గురు బీజేపీ ప్ర‌తినిధుల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టించార‌న్నంత‌వ‌ర‌కే బ‌య‌టికి తెలుసు. విష‌యం తెలిసి అధినాయ‌క‌త్వం ఆరాతీశాకే ఆ స్టింగ్ ఆప‌రేష‌న్ ప్లాన్ జ‌రిగింద‌ని చెబుతారు. ఏద‌యినా ఎన్నిక‌ల‌కు ప‌దినెల్ల‌లోపే స‌మ‌యం ఉంది. మొయినాబాద్ ఆప‌రేష‌న్ అట్ట‌ర్‌ఫ్లాప్ కావ‌టంతో కేసీఆర్ అల‌ర్ట్ అయ్యార‌ట‌. ప్ర‌తీ ఎమ్మెల్యే, ఎంపీ క‌ద‌లిక‌పై ఈమ‌ధ్య నిఘా విప‌రీతంగా పెరిగిపోయిందంటున్నారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్క‌డున్నారు, ఏం చేస్తున్నార‌న్న‌ది గంట‌గంట‌కీ పైకి తెలిసిపోతోంద‌ని స‌మాచారం. మండ‌లానికో ఇంట‌లిజెన్స్ సిబ్బంది అచ్చంగా ఇదే బాధ్య‌త‌లో ఉన్నారంటున్నారు. నాయ‌కులు ఎవ‌రిని క‌లుస్తున్నారు, వారిని ఎవ‌రొచ్చి క‌లుస్తున్నార‌నేది ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం పైకి వెళ్లిపోతోంది. ఇదివ‌ర‌కు వారానికో ప‌దిరోజుల‌కో కాదు రోజుకు రెండుపూట‌లా రిపోర్ట్ చేరిపోతోంది. ఎవ‌రి క‌ద‌లిక‌లైనా కాస్త అనుమానాస్ప‌దంగా ఉంటే వెంట‌నే క్రాస్‌చెక్ చేసుకుంటోంద‌ట పార్టీ నాయ‌క‌త్వం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్‌పర్సన్లని ఇంట‌లిజెన్స్ నీడ‌లా వెంటాడుతోంద‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. కార్యకర్తలు, ప్రజలతో వారి వ్య‌వ‌హార‌శైలి, ప్రత్యర్థులు, ప్రతిపక్షాలతో ఎలా ఉంటున్నార‌న్న‌దానిపై కూపీలాగుతున్నారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ర్స‌న‌ల్ ప‌నులకోసం ఫోన్లు కూడా ద‌గ్గ‌ర‌పెట్టుకోకుండా సైలెంట్‌గా వెళ్లొస్తున్నారు.

వ‌ర‌సగా రెండోసారి అధికారంలోకి రావ‌టంతో బీఆర్ఎస్‌లో వ‌ర్గ‌పోరు ముదిరింది. వేరేపార్టీల‌నుంచి నేత‌లు విప‌రీతంగా వ‌చ్చిప‌డ‌టంతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీలో స‌మ‌న్వ‌యం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తీ సీటూ చాలా ముఖ్యం. అందుకే నేత‌ల మ‌ధ్య విభేదాలు, టికెట్‌కోసం పోటీ ఎక్కువ‌గా ఉన్న 30 నియోజకవర్గాల‌పై ఇంట‌లిజెన్స్‌తో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక నిఘా పెట్టిందంటున్నారు. ఖ‌మ్మం జిల్లాలో కొత్తగూడెం, సత్తుపల్లి, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. అక్క‌డ ఓడిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. ఇదే జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తిరుగుబాటు జెండా ఎగ‌రేశారు. దీంతో ఖ‌మ్మంలాంటి జిల్లాపై గులాబీపార్టీ నాయ‌క‌త్వం డేగ‌క‌ళ్ల‌తో నేత‌ల క‌ద‌లిక‌ల్ని గ‌మ‌నిస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలే మ‌ళ్లీ పోటీచేస్తార‌ని కేసీఆర్ ప్ర‌క‌టించినా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆశావ‌హులు వెన‌క్కిత‌గ్గ‌డం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో నువ్వానేనా అన్న ప‌రిస్థితి ఉంది. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని మూడుచోట్ల‌, ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని రెండుచోట్ల నేత‌ల పోటీ నాయ‌క‌త్వాన్ని ఆందోళ‌న‌పెడుతోంది. మ‌రోవైపు క‌మ్యూనిస్టుల‌తో పొత్తు పెట్టుకుంటే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వివాదాలు మ‌రింత ముదిరేలా క‌నిపిస్తున్నాయి. అందుకే ఏ నాయ‌కుడు ఏ ఎత్తుగ‌డ‌ల్లో ఉన్నారో వాళ్ల ఆలోచ‌న ఎలా ఉందో తెలుసుకునేందుకు నిఘా బృందాల‌ను దించారు. దీంతో మ‌న‌సులో మ‌రో ఆలోచ‌న ఉన్న నేత‌లు ఎక్క‌డా బ‌య‌ట‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా అడుగేస్తున్నారు.