కేసీఆర్ ముందస్తుకు తథాస్తు అనేస్తున్నారా?
గులాబీ బాస్ కు పూర్తి కాలం పదవిలో ఉండే రాత లేదా
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారా? అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే జనవరిలోనే రాష్ట్ర శాసన సభను రద్దు చేసేయడానికి కేసీఆర్ ముహూర్తం పెట్టేసుకున్నారా? ముందస్తు ఎన్నికలతోనే మరోసారి అధికారంలోకి రావచ్చునని జ్యోతిష్య బ్రహ్మలు కేసీఆర్ చెవిలో ఊదారా? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా ప్రగతి భవన్ నుండి ఔననే సమాధానాలే వస్తున్నాయట.
2014లో తాను సాధించుకున్న తెలంగాణా రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికల్లో గులాబీ పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు కేసీఆర్. తిరిగి 2019లో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఎన్నికలకు వెళ్లాల్సి ఉండగా కేసీఆర్ ముందస్తుగానే 2018లో అనూహ్యంగా అసెంబ్లీని రద్దు చేసి సంచలనం సృష్టించారు. అదే ఏడాది డిసెంబరులో ఎన్నికలకు వెళ్లారు. నాలుగేళ్లు మాత్రమే అధికారంలో ఉండి ఎన్నికలకు సిద్ధమయ్యారు. దానికి కారణం లేకపోలేదు. కేసీఆర్ కు దైవభక్తి ఎంత ఎక్కువో జాతకాలన్నా అంతే నమ్మకం. కీలక నిర్ణయాలు ఏమైనా సరే ఆయన తమ ఆస్థాన సిద్ధాంతులను సంప్రదించిన తర్వాతనే తుది నిర్ణయానికి వస్తారు. 2019లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే టి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకి రాదని ఓడిపోవడం ఖాయమని జ్యోతిష్కులు చెప్పారట. 2018లోనే ఎన్నికలకు వెళ్తే తిరుగుండదని సలహా కూడా ఇచ్చారట. ఆ సలహాలతోనే కేసీఆర్ అప్పట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్-టిడిపి-లెఫ్ట్ పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. కేసీఆర్ ఒంటరి పోరుకు సై అన్నారు.
అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ కేసీఆర్ తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. విపక్షాల వ్యూహాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇపుడు 2023 డిసెంబరులో మళ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే కొద్ది రోజుల క్రితమే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే దాన్ని టి.ఆర్.ఎస్. వర్గాలు ఖండించాయి. ముందస్తు ప్రసక్తే లేదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని గులాబీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే రాష్ట్రంలో బిజెపి రోజు రోజుకూ బలపడుతూ టి.ఆర్.ఎస్. కు గట్టి సవాలే విసురుతోంది. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండడం వల్ల సహజంగానే పాలక పక్షం పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. దాన్ని అనుకూలంగా మలుచుకుని అధికారంలోకి వచ్చేయాలని కాషాయం పార్టీ చాలా కసిగా ఉంది. అటు బిజెపి జాతీయ నాయకత్వం కూడా తెలంగాణా పై ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరాదితో పాటు పశ్చిమ తూర్పు ప్రాంతాలనూ కబ్జా చేసిన బిజెపికి దక్షిణాదిలో మాత్రం ఒక్క కర్నాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో పాచికలు పారడం లేదు. పార్టీ విస్తరణకు కాలం కలిసిరావడం లేదు. ఈ సారి ఎలాగైనా సరే తెలంగాణాలో ఆ లోటును భర్తీ చేసుకోవాలని బిజెపి వ్యూహకర్తలు పట్టుదలగా ఉన్నారు.
అందుకే తెలంగాణా అంతటా ప్రతీ నియోజక వర్గానికీ ప్రత్యేక ప్రతినిథులను నియమించారు. చీటికీ మాటికీ జాతీయ నాయకులు తెలంగాణా పర్యటించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు నడ్డాతో పాటు మోదీ షాలు తెలంగాణాలో విస్తృతంగా పర్యటిస్తూ టి.ఆర్.ఎస్. ను టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ బిజెపికి సవాల్ విసురుతూ భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో అయితే కురుక్షేత్ర సంగ్రామాన్ని మించి టి.ఆర్.ఎస్.-బిజెపిలు తలపడ్డాయి. ఈ తరుణంలోనే గుజరాత్ ఎన్నికలు తరుముకు వచ్చాయి. గుజరాత్ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే కాషాయం పార్టీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని అది బిజెపి వ్యతిరేక పార్టీలు దూసుకుపోడానికి పనికొస్తుందని అందరూ భావించినట్లే కేసీఆర్ కూడా ఆకాంక్షించారు.
అయితే గుజరాత్ ఎన్నికల సరళిని నిశితంగా గమనిస్తే బిజెపి మరోసారి అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్న తరుణంలోనే తాజాగా విడుదలైన వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ బీజేపీ మరోసారి గుజరాత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని తేల్చి చెప్పాయి.
ఈ ఫలితాలను ముందుగానే ఊహించిన కేసీఆర్ 2023 డిసెంబరు వరకు ఆగితే బిజెపి తెలంగాణాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగే ప్రమాదం ఉందని అప్పుడు దాన్ని ఎదుర్కోవడం కష్టమేనని అంచనా వేస్తున్నట్లు పార్టీ వర్గాల భోగట్టా. అందుకే బిజెపి తెలంగాణాలో పాతుకు పోవడానికి ముందే ఎన్నికలు తెస్తే బిజెపి ఎదగడానికి సమయం ఉండదని అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును బిజెపి చీలిస్తే టి.ఆర్.ఎస్. హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నారట. గుజరాత్ లో బిజెపి పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ అంది పుచ్చుకోలేకపోడానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ ఆ ఓట్లను పెద్ద సంఖ్యలో చీల్చడమే. అక్కడ ఆప్ పోషించిన పాత్రే తెలంగాణలో బిజెపి పోషిస్తే మూడో సారి కూడా ముఖ్యమంత్రి కావచ్చునని కేసీఆర్ వ్యూహం అంటున్నారు. అందుకే వచ్చే జనవరిలో శాసనసభను సమావేశపర్చి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఓ తిరకాసు కూడా ఉంటుంది.
కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తే రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక వేళ అప్పుడు ఎన్నికలు నిర్వహించే వాతావరణం లేదని భావిస్తే రాష్ట్రపతి పాలన విధించి మరో ఆరు నెలలలోపు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. దాన్నే వజ్రాయుధంగా వాడుకోవాలని కమలనాథులు సిద్ధమయ్యే అవకాశాలున్నాయంటున్నారు. అంటే ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత కేసీఆర్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగే వరకు ఆగి అప్పుడు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బిజెపి ప్లాన్ చేసే అవకాశాలుంటాయి. ఈ ఇద్దరి వ్యూహాల్లో ఎవరి పాచిక పారితే వారు చక్రం తిప్పే అవకాశం ఉంది. ఈ రెండింటి నడుమ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోవడం ఖాయం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తానికి కేసీఆర్ మరోసారి ముందస్తుకు వెళ్తే ఆయన ఎప్పటికీ పూర్తి కాలం పదవిలో కొనసాగని ముఖ్యమంత్రిగా కొత్త చరిత్ర సృష్టిస్తారేమో అంటున్నారు రాజకీయ పండితులు.