తెలంగాణ ఎన్నికలపై జాతకప్రభావం

By KTV Telugu On 30 November, 2022
image

జ్యోతిష్యం ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు

రాజాసింగ్‌పై అనర్హత పిటిషన్ విచారణ సందర్భంగా
కేసీఆర్ సర్కార్‌పై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ సర్కార్‌పై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారం జరుగుతాయంటూ చమత్కరించింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ టిఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్‌పై అనేక క్రిమినల్ కేసులున్నందున అనర్హుడిగా ప్రకటించాలని ఆయనకు ఇంకా ఏడాది కాలం మాత్రమే పదవీ గడువు ఉందని పిటిషన్ తరపు న్యాయవాది కోరారు. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ వి రామ సుబ్రమణియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2018లో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. అక్కడ జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ కేసును కూడా విచారించాలి అంటే గ్రహాలన్నీ ఒక వరుసలోకి రావాలేమో అంటూ చమత్కరించారు. ఆపై ఈ కేసు విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం ప్రకటించింది.

సీఎం కేసీఆర్‌కు జ్యోతిష్యంపై మక్కువ ఉందంటారు. ఏం చేసినా జాతకాల ప్రకారమే చేస్తారనే పేరుంది. గతంలో ఆయన పెద్ద ఎత్తున హోమాలు, యజ్ఞయాగాదులు నిర్వహించారు. తాను ఏకార్యం తలపెట్టినా ముందుగా మంచి ముహూర్తం చూసుకొని ముందుకు సాగుతుంటారని దగ్గరి సన్నిహితులు చెబుతుంటారు. ఈనేపథ్యంలో తెలంగాణలో గత ముందస్తు ఎన్నికలపై న్యాయమూర్తి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈసారి కూడా కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు. డిసెంబర్‌లో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ రద్దు ప్రకటన చేస్తారని ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండాలని సూచించడంతో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. జిల్లాల పర్యటనకు పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఎన్నికల కోసం సిద్దమైందనే ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. అయితే టీఆర్ఎస్ మంత్రులు మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదంటున్నారు మంత్రి హరీష్ రావు. కొంతమంది బీజేపీ నేతలు జ్యోతిష్యులుగా మారి అప్పుడప్పుడు ముందస్తు ఎన్నికలపై జోస్యం చెబుతారని హరీష్ రావు సెటైర్లు పేల్చారు.