ఆ మంత్రులు, సిట్టింగులకు టికెట్లు దక్కేనా
పలువురు మంత్రులపై నెగటివ్ రిపోర్టు
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలో గెలుపు ఉత్సాహంతో వచ్చే ఎన్నికలపై దృష్టి సారించారు. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటం రాష్ట్రంలో బీజేపీ బలం పెంచుకుంటున్న నేపథ్యంలో నేతలు, కార్యకర్తలను ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. సర్వేల ఆధారంగా పార్టీ పరిస్థితి, నేతల పనితీరును అంచనా వేసి దానికి అనుగుణంగా ముందుకెళ్లడానికి నిర్ణయించుకున్నారు కేసీఆర్. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులపై అంతర్గతంగా పలు సర్వేలు చేయించినట్లు సమాచారం. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని టీఆర్‌ఎస్ వస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ హామీ ఇచ్చారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరిద్దరికి తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు కూడా మళ్లీ వారికే టికెట్లు అని అనౌన్స్ చేశారు. అయితే క్షేత్ర స్థాయిలో పలువరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు కేసీఆర్ చేయించిన సర్వేలు స్పష్టం చేసినట్లు సమాచారం. కొందరు మంత్రులపై కూడా వ్యతిరేకంగా రిపోర్టు వచ్చినట్లు తెలుస్తోంది. సర్వేల ఫలితాల ఆధారంగా మొత్తం నియోజకవర్గాలను మూడు కేటగరీలుగా విభజించారు. ఖచ్చితంగా గెలిచే స్థానాలు మొదటి కేటగిరిగా కాస్త కష్టపడితే గెలిచే నియోజకవర్గాలు రెండో కేటగిరి, ట్రయాంగిల్ ఫైట్ ఉన్న స్థానాలను మూడో కేటగిరీగా వర్గీకరించారు. ఖచ్చితంగా గెలిచే కేటగిరీ లో 38 నుంచి 44, కాస్త కష్టపడితే గెలిచే కేటగిరీలో 30 నుంచి 35 నియోజకవర్గాలు ఉండగా టీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉన్న మిగతా నియోజకవర్గాలను మూడో కేటగిరీగా గుర్తించారు. పార్టీ మరీ వీక్‌గా ఉన్న నియోజకవర్గాలను డేంజర్ కేటగిరీగా కేసీఆర్ గుర్తించినట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ఈ డేంజర్ జోన్‌లో పలువురు మంత్రులు కూడా ఉన్నట్లు గులాబీ తెలుస్తోంది. ఇలాంటి నియోజకవర్గాల బాధ్యతను మంత్రులతో కూడిన బృందాలకు అప్పగించాలని కేసీఆర్ యోచిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మిగతా నియోజకవర్గాలకు కూడా కేటగిరీల వారీగా ఇంచార్జ్‌లను నియమిస్తారు. కార్యకర్తలతో మమేకం కావడం, పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం నేతల మధ్య సమన్వయం కుదర్చడం లాంటి పనులను ఇంచార్జ్‌లను అప్పగిస్తారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి బాగానే ఉన్నా నేతలపై వ్యతిరేకత ఉన్నట్లు కేసీఆర్ గుర్తించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు అని కేసీఆర్ ప్రకటించినా ఎన్నికల నాటికి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెడతారని అనుకుంటున్నారు. ఈ సారి టికెట్లు దక్కని వారి జాబితాలో ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ఉండవచ్చని సమాచారం. అయితే టికెట్లు రాని ఆ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరనేది కేసీఆర్ కు తప్ప ఇంకెవరికీ తెలియదు.