మునుగోడుకు కేసీఆర్‌ వస్తారా…రారా ?

By KTV Telugu On 22 October, 2022
image

మునుగోడు ఉప ఎన్నిక మూడు పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఎలాగైనా గెలిచి తీరాలని ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓడిపోతే పరువు పోతుందనే భయం వారిని వెంటాడుతోంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ కు మునుగోడు ఇజ్జత్‌కా సవాల్‌ అన్నట్లు మారింది. తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ కూడా ఇది అగ్నిపరీక్ష. ఆ రెండు పార్టీలు కలిపి ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడానికి విపరీతంగా ఖర్చు చేస్తున్నాయి. ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి నాయకులను తీసుకొచ్చి వారిచేత ప్రచారం చేయిస్తోంది. ఇటు టీఆర్‌ఎస్‌ తరపున మంత్రి హరిష్‌రావు, మరోవైపు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు.

సాధారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపఎన్నికల్లో తప్పనిసరి అయితే తప్ప ప్రచారం చేయరు. హరిష్‌రావుకే ప్రచార బాధ్యతలు అప్పజెప్తారు. అయితే మునుగోడు బై ఎలక్షన్‌ నువ్వా నేనా అన్నట్లుగా మారడంతో కేసీఆర్‌ను కూడా రంగంలోకి దింపాలని అంటున్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు.
కేసీఆర్‌ చేత మునుగోడులో బహిరంగ సభ ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది అని వారి అభిప్రాయం. అయితే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలో.. మునుగోడులో ప్రచారం చేశాక కూడా పార్టీ ఓడిపోతే పరువు పోతుంది… అందువల్ల కేసీఆర్.. ప్రచారానికి రాకపోవడమే మంచిదని కొందరు టీఆర్ఎస్‌ కార్యకర్తలు వాదిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నాయకులు మునుగోడులో రెండు బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఒక సభ ఇప్పుడు పెట్టి…ప్రచారం చివరి రోజున మరో బహిరంగసభ ఏర్పాటు చేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. కానీ కేసీఆర్ ఎటూ తేల్చకపోతూండటంతో … ఏం చేయాలా అని తర్జన భర్జన పడుతున్నారు. కేసీఆర్‌ మాత్రం తాను మునుగోడు ప్రచారానికి వస్తారా రారా అన్నదానిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు