కేసీఆర్ కూతురికి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్లేనా?

By KTV Telugu On 31 December, 2022
image

రాజ‌కీయాల్లో కొన్ని ఈక్వేష‌న్స్ కొంద‌రికి స‌మ‌స్య‌లు తెచ్చిపెడుతుంటాయి. మ‌రికొంద‌రికి లైన్ క్లియ‌ర్ చేస్తుంటాయి. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో ప‌రిణామాలు గులాబీపార్టీ అధినేత అనుకున్న‌ట్లే జ‌రుగుతున్నాయి. కూతురు క‌విత‌ను ఈసారి సేఫ్‌గా ల్యాండ్ చేయాల‌నుకుంటున్నారు కేసీఆర్‌. మెద‌క్ ఎంపీ అసెంబ్లీకి పోటీచేయాల‌ని ఉబ‌లాట‌ప‌డుతుండ‌టంతో కాగ‌ల కార్యం కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డే తీరుస్తున్నారంటున్నారు. కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి దుబ్బాక‌నుంచి పోటీకి ఎప్ప‌టినుంచో ఆస‌క్తిగా ఉన్నారు. 2018ఎన్నిక‌ల స‌మ‌యంలో అసెంబ్లీ టికెట్ అడిగినా మ‌రోసారి ఎంపీగానే నిలబెట్టారు. రెండోసారి గెలిచారు.

దుబ్బాక‌లో రామ‌లింగారెడ్డి ఉన్న‌న్నాళ్లూ కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డికి ఆ సీటుపై పెద్ద‌గా ఆశ‌ల్లేవు. అయితే రామ‌లింగారెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణం త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న భార్య ఓడిపోవ‌టంతో మెద‌క్ ఎంపీ దుబ్బాక‌పై గురిపెట్టారు. అక్క‌డి బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న‌రావుని ఓడించేందుకు కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డే స‌రైన అభ్య‌ర్థి అనుకుంటోంది బీఆర్ఎస్ నాయ‌క‌త్వం. దుబ్బాక‌లో కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డిని ప్రోత్స‌హించ‌డానికి కేసీఆర్‌కి మ‌రో ముఖ్య‌మైన కార‌ణం కూడా ఉంది. నిజామాబాద్‌లో ఓడిపోయిన కూతురికి మ‌రో సుర‌క్షిత స్థానంగా మెద‌క్ క‌నిపిస్తోంది. కొత్త ప్ర‌భాక‌ర్‌ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంనుంచి పోటీచేస్తే మెద‌క్ ఎంపీ సీటునుంచి పోటీచేసేదెవ‌ర‌న్న అనుమానాల‌కు సమాధానం దొరుకుతోంది. కూతురు కల్వకుంట్ల కవితని సొంత జిల్లానుంచి పోటీచేయించే వ్యూహంతో ఉన్నారు కేసీఆర్‌.

మ‌రోసారి నిజామాబాద్‌లో త‌ల‌ప‌డేకంటే మెదక్ అన్ని విధాలా సుర‌క్షిత‌మ‌ని భావిస్తున్నారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గజ్వేల్, హ‌రీష్‌రావుకు కంచుకోట‌లాంటి సిద్ధిపేట రెండూ మెద‌క్ పార్ల‌మెంట్ స్థానం ప‌రిధిలోనే ఉన్నాయి. క‌ళ్లుమూసుకుని గెల‌వ‌గ‌ల ఈ రెండుసీట్ల మెజారిటీతో మెద‌క్‌నుంచి క‌విత ఈజీగా గెలిచేయొచ్చ‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌. అందుకే కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి కోరుకోగానే దుబ్బాక‌పై దృష్టిపెట్ట‌మ‌ని చెప్పార‌ని గులాబీపార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.