గుజరాత్ రిజల్ట్ తర్వాత ఆపరేషన్ కేసీఆర్
ఆట మొదలైంది. మధ్యలో తప్పుకోడానికి లేదు. గెలుపు సాధించడమా? ఓటమిని అంగీకరించడమా? రెండే ఆప్షన్స్. గుజరాత్ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఫలితం గురించి టెన్షన్ లేదు. కానీ డిసెంబరు8 తర్వాత బీజేపీ ఆట మొదలుపెట్టబోతోంది. ఇప్పటికే ఐటీ, ఈడీ దాడులకు తోడు కేసీఆర్ కూతురుకి సీబీఐ నోటీసులతో కేంద్రం శాంపిల్ టేస్ట్ చూపించింది. విమర్శలు చేయడం కొన్ని నిర్ణయాలతో విభేదించడం రాజకీయాల్లో మామూలే. కానీ కేసీఆర్-కేంద్రం మధ్య బద్ధశత్రువుల్లా వైరం పెరిగిపోయింది. బీఎల్ సంతోష్‌లాంటి బీజేపీ ఉద్ధండుడినే ముగ్గులోకి లాగే ప్రయత్నం చేశారు కేసీఆర్. దీన్ని బీజేపీ చాలా తీవ్రంగా తీసుకుంటోంది. కేసీఆర్‌కి కూడా చావోరేవో తేల్చుకోవడం తప్ప మరో మార్గం లేదు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రంపై విరుచుకుపడబోతోంది టీఆర్ఎస్. ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ ఎక్కడా తగ్గొద్దని చెబుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు ఎండగట్టబోతున్నారు. అదే సమయంలో కేంద్ర దర్యాప్తుసంస్థల వేధింపులను పార్లమెంట్ ఉభయసభల సాక్షిగా ఎండగట్టాలన్న వ్యూహంతో ఉన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ పన్నిన కుట్రని కూడా సభలో ప్రస్తావించి మిగిలిన విపక్షాల మద్దతు కూడగట్టాలన్నది టీఆర్ఎస్ వ్యూహం. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన కుట్ర తాలూకు వీడియోలను అన్ని విపక్షాలకూ టీఆర్ఎస్ పంపించింది. దీన్ని తెలంగాణ అంశంగా కాకుండా దేశమంతా బీజేపీ కుటిల రాజకీయాన్ని బయటపెట్టడానికి పార్లమెంట్ సమావేశాలని వేదికగా చేసుకోబోతోంది.
చివరిదాకా పోరాడండి. అవసరమైతే సమావేశాలను బహిష్కరించండి. టీఆర్ఎస్ ఎంపీలకు అధినేత నుంచి ఉన్న క్లారిటీ ఇది. అయితే సభను బహిష్కరించడం అంటే పోరాడలేక వెన్నుచూపించడమే అవుతుంది. రాష్ట్రానికి కేంద్రంనుంచి వేలకోట్లు రావాల్సి ఉందని టీఆర్ఎస్ నేతలు పదేపదే చెబుతున్నారు. విభజన వివాదాలు ఎనిమిదిన్నరేళ్ల తర్వాత కూడా కొలిక్కిరావడం లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు, కేంద్ర దర్యాప్తుసంస్థల దాడులు ఆ తర్వాతి ప్రాధాన్యాలు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందన్న విషయాన్ని సభ సాక్షిగా ముందు ఏకరువుపెట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎంపీల తొలిపోరాటం ఉండాలి. అది వదిలేసి పార్టీ ఎంపీ, మంత్రులమీద ఐటీదాడుల గురించి, కేసీఆర్ కూతురికి సీబీఐ నోటీసుల గురించి పోరాడితే ఆత్మరక్షణలో పడాల్సి వస్తుంది. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఇప్పటికే కోర్టులో ఉంది. దీనికోసం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటైంది. ఈ సమయంలో దీనిగురించి పార్లమెంట్‌లో రచ్చచేయడం వృథా ప్రయాసే. ఒకటి మాత్రం క్లియర్. కేసీఆర్ ఇప్పుడు పులిమీద స్వారీ చేస్తున్నారు. దిగితే ఏమవుతుందో ఆయనకు తెలుసు!