ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. మరి పువ్వును దేంతో తియ్యాలి అంటే పువ్వుతోనే అంటున్నారు తెలంగాణా రాజకీయాలను గమనిస్తున్నవారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా హిందుత్వ కార్డును అడ్డుపెట్టుకుని దూసుకుపోయే బిజెపికి తెలంగాణాలో మాత్రం అది అంత వీజీ కావడం లేదు. ఎందుకంటే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ బిజెపిని మించిన హిందుత్వ వాదిగా పదే పదే చాటుకుని బిజెపికి ఝలక్ ఇస్తున్నారు.
ఎవ్వరితోనైనా పెట్టుకో కానీ కేసీయార్ తో పెట్టుకుంటే మాత్రం మటాష్ అయిపోతావ్ అంటారు రాజకీయ పండితులు.
ఎలాంటి పరిస్థితినైనా సరే తనకు అనుకూలంగా మలుచుకోవడంలో దేశంలోనే కేసీయార్ ను మించిన ఛాంపియన్ మరొకరు ఉండరు. దేశంలో ఒక్కో రాష్ట్రాన్నీ ఆక్రమించుకుంటూ వస్తోన్న బిజెపి ప్రతీ రాష్ట్రంలోనూ హిందుత్వ అజెండాతోనే దూసుకుపోతోంది. కానీ తెలంగాణాలో మాత్రం బిజెపి పప్పులు ఉడకడం లేదు. దానికి కారణం మరేమీ లేదు. బిజెపి నేతలకన్నా కూడా కేసీయారే అతి పెద్ద ఆధ్యాత్మిక వేత్తగా జనం మనసుల్లో నిలిచిపోయారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయనన్ని యజ్ఞాలూ, యాగాలూ చేయించారు కేసీయార్. కాస్త ఖాళీ దొరికితే చాలు చండీ యాగం చేసేస్తారు. దేశం నలుమూలల నుండి వేద పండితులను పిలిపించి వారికి భూరి విరాళాలు ఇవ్వడమే కాదు యజ్ఞ యాగాదులను ఎంతో నిష్టగా కుటుంబ సమేతంగా నిర్వహిస్తారు కేసీయార్.
ఇక కేసీయార్ హయాంలోనే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి మహర్దశ పట్టిందని చెప్పాలి. వందల కోట్ల రూపాయల భారీ వ్యయంతో యాదాద్రి దేవాలయాన్ని నభూతో నభవిష్యతి అన్నట్లు ఆధునికీకరించారు కేసీయార్. ఒకప్పటి యాదగిరి గుట్ట దేవాలయానికి ఇప్పటి యాదాద్రికి అసలు పోలికే లేనంత అద్భుతంగా శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా యాదాద్రికి ఆధ్యాత్మిక శోభ తెప్పించారు కేసీయార్. మరో వెయ్యేళ్ల పాటు యాదాద్రికి ఎవరు వెళ్లినా కేసీయార్ పేరును తలచుకునేలా దేవాలయాన్ని తీర్చిదిద్దారు. తిరుపతి ఎంత రద్దీగా ఉంటుందో మును ముందు యాదాద్రి కూడా భక్తులతో అలానే కిట కిటలాడాలన్నది కేసీయార్ ఆకాంక్ష. నిన్న కాక మోన్ననే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి రాజయోగం పట్టించారు కేసీయార్. కొండగట్టు దేవాలయ ఆధునికీకరణతో పాటు భక్తులకు వివిధ రకాల సదుపాయాల కల్పనకోసం వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు కేసీయార్. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా యాదాద్రి తరహాలో మెరిసిపోవడం ఖాయమంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు.
దీని పనులు జరుగుతండగానే వేముల వాడ రాజరాజేశ్వరీ దేవాలయాన్ని కూడా ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేయాలని కేసీయార్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా తెలంగాణాలోని చారిత్రక వైభవం ఉన్న ఆలయాన్నింటికీ పూర్వ వైభవం తీసుకురావడమే కాదు అంతకు మించి వాటిని తీర్చిదిద్దేందుకు కేసీయార్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. కేసీయార్ తెలంగాణాలో దేవాలయాలపై చూపిస్తోన్న ఈ శ్రద్ధను బిజెపి ప్రభుత్వాలు ఇంకే రాష్ట్రంలోనూ చూపడం లేదంటే అతిశయోక్తి కాదు. అయోధ్యలోని రామ మందిర నినాదం పునాదులపైనే బిజెపి అవతరించింది కాబట్టి రామమందిర నిర్మాణాన్ని బిజెపి భుజాలకెత్తుకుంది. అలాగే వారణాసి కాశీవిశ్వేశ్వర ఆలయాన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరిస్తూ అత్యద్భుతంగా తీర్చిదిద్దింది.
వారణాసి నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజక వర్గం కాబట్టే వారణాసి దేవాలయంపై దృష్టి సారించారని అంటున్నారు. కేసీయార్ మాత్రం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాన్నింటినీ అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఆధ్యాత్మిక వేత్తలంతా కేసీయార్ ను ప్రత్యేకించి ఆశీర్వదిస్తూ ఉంటారు. భక్తుల్లోనూ కేసీయార్ నిర్ణయాలు కార్యక్రమాల పట్ల సానుకూల స్పందన ఉందంటున్నారు రాజకీయ పండితులు. దేవుడి గుడికి వెళ్లి ఓ పువ్వును సమర్పిస్తే సరిపోతుంది. ఇంత కాలా దానికి పేటెంట్ తమదేనని బిజెపి అనుకునేది. కానీ తెలంగాణాలో మాత్రం తన తర్వాతే ఇంకెవరైనా అని కేసీయార్ చాలా బలంగా చాటి చెప్పేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే తెలంగాణాలో బి.ఆర్.ఎస్.ను దెబ్బతీయాలంటే వేరే అంశాలను స్పృశించాలే తప్ప హిందూత్వ కార్డును పొరపాటున కూడా తీయకూడదని రాజకీయ పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే బిజెపి ఒక పువ్వును వేస్తే కేసీయార్ మూడు పువ్వులు వేసి పై చేయి సాధిస్తారని వారంటున్నారు.