దళిత బంధు, ఉచిత విద్యుత్. భారత రాష్ట్ర సమితిని దేశవ్యాప్తంగా విస్తరించడానికి కేసీఆర్ ప్రధానంగా వాడుతున్న ఆయుధాలు ఈ రెండే. పాలకుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ఎంత బాగా చేయవచ్చో చెబుతూ ప్రజల్ని ఆశలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తన దగ్గర విజన్ ఉందని చెబుతున్నారు. ఒక్క బటన్ నొక్కాలని అడుగుతున్నారు. తెలంగాణ శివారు నాందేడ్‌లో భారత్ రాష్ట్ర సమితి తెలంగాణ బయట తొలి బహిరంగసభ నిర్వహించింది. ఇందులో కేసీఆర్ చేసిన ప్రసంగంలో కొత్త దనం లేదు. ఆయన ప్రెస్ మీట్లలో చెప్పేదే చెప్పారు. తెలంగాణలో నిర్వహించిన బహిరంగసభల్లో చెప్పిందే చెప్పారు. కానీ లోకల్ టచ్ ఇచ్చారు.
కేసీఆర్ సామాన్యుల్లో ఉండే కొన్ని సమస్యలను లేవనెత్తి వాటికి మన దగ్గర ఎందుకు పరిష్కారం రాలేదని ప్రశ్నిస్తున్నారు. ఆ నెపం అంతా పాలకులపై వేస్తున్నారు. కానీ ఆ రాజకీయ వ్యవస్థలో సుదీర్ఘంగా తానూ భాగమేనని సంగతిని గుర్తు రాకుండా తన మాటలతో చేయగలుగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ చేయలేదు తాను చేస్తానని చెబుతున్నారు. విద్యుత్ విషయంలో మనం అమెరికా కన్నా ధనవంతులం అని చెప్పడంలోనూ అదే రాజకీయ చతురత ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కో ఇంటికి రూ. పది లక్షలు ఇచ్చే దళిత బంధు సంచలనమే. తెలంగాణలో ఆ పథకం అమలుపై ఎన్ని విమర్శలు ఉన్నా దేశ ప్రజల్ని ముఖ్యంగా దళితుల్ని నమ్మించగలనని ఆయన నమ్మకంతో ఉన్నారు. ఉచిత విద్యుత్ అంటే రైతులు తన వెంటే ఉంటారని నమ్ముతున్నారు. ఓ రకంగా తెలంగాణలో సక్సెస్ ఫార్ములానే దేశం మొత్తం కేసీఆర్ ఉపయోగిస్తున్నారని అనుకోవచ్చు.
నాందెడ్ సభలో కేసీఆర్ ఎక్కువగా తెలంగాణ గురించే చెప్పారు. లోకల్ సమస్యలను ప్రస్తావించారు. మనం మనం ఒకటి అనే భావన కల్పించడానికి ప్రయత్నించారు. ఇంతకు ముందు నుంచే ఆయా ప్రాంతాల్లో మనం తెలంగాణలో కలవాలి అనే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మహారాష్ట్ర శివారు ప్రాంతం కావడం అక్కడి ప్రభుత్వం నగదు బదిలీ సంక్షేమ పథకాలు తెలంగాణ స్థాయిలో లేకపోవడంతో అక్కడి ప్రజలు సహజంకానే ఆకర్షితులవుతారు. అందుకే తెలంగాణలో కలిస్తే బాగుండనే అభిప్రాయం పెంచుకుంటున్నారు. ఇది కేసీఆర్ వ్యూహం వల్లనే సాధ్యమయింది. అయితే ఈ డిమాండ్ పెరిగితే అది రాజకీయ సమస్యగా మారుతుంది. కానీ బీఆర్ఎస్‌కు ఓటు వేసేలా మార్చుకోగలిగితే రాజకీయ బలం అవుతుంది. దీని కోసం కేసీఆర్ కార్యచరణ ప్రారంభించారు. ఆయన ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని అడగడం లేదు. బీఆర్ఎస్ పాలనే మహారాష్ట్రలో వస్తుంది ఓటు వేయమని అడుగుతున్నారు. ఇది వ్యూహాత్మకం. ఇతర రాష్ట్రాల్లోనూ బహిరంగసభలు పెడితే అదే విధంగా కేసీఆర్ లోకల్ టచ్ ఇస్తూ తన విజన్‌ను ఆయన ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు.
భారత్ రాష్ట్ర సమితిని ఇతర రాష్ట్రాల్లో విస్తరించడానికి కేసీఆర్ వ్యూహాత్మకం వేసిన ముందడుగు నాందేడ్ సభ అనుకోవచ్చు. మొదట ఆయన ఢిల్లీలో లేకపోతే యూపీలో బహిరంగసభ పెడతారన్న ప్రచారం జరిగింది. కానీ తన రాజకీయ పార్టీ తాను ఆకాశానికి గాలం వేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నా చేతల్లో మాత్రం మొత్తం నేల మీద ఉండే నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా నాందేడ్ సభను బట్టి అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ సభ పెట్టిన ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్‌లో కలిసి ఉండేది. అక్కడి ప్రజల్లో మనది తెలంగాణ ప్రాంతం అనే భావన ఉంటుంది. దీన్ని కేసీఆర్ రాజకీయంగా మరింత పైకి తీసుకు వచ్చేందుకు ఉపయోగించుకున్నారు.
కేసీఆర్ నాందేడ్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇతర పార్టీల నేతల్ని చేర్చకున్నారు. భారీ నేతలు ఎవరూ చేరకపోవచ్చు. గ్రామాల్లో కాస్త పట్టు ఉన్న వాళ్లు చేరారు. అదే ధైర్యంతో జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. నిజానికి బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తామని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు కొంత మంది వచ్చినా కేసీఆర్ వద్దనుకున్నారు. కానీ నాందేడ్ లోకల్ ఎన్నికల్లో మాత్రం పోటీకి సిద్ధమయ్యారు. ఓ రకంగా కేసీఆర్ కు ఇది మొదటి విజయం అనుకోవచ్చు. ముందుగా కేసీఆర్ తన పార్టీ బలపడాలనుకుంటున్న హైదరాబాద్ స్టేట్ పాలనలో ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టారని అర్థం చేసుకోవచ్చు. అయితే మహారాష్ట్రరాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటాయన్నది సందేహమే. అక్కడ మరాఠా సెంటిమెంట్ ఎక్కువగానే ఉంటుంది. అయితే కేసీఆర్ ఇవన్నీ ఆలోచించే రాజకీయంగా మరాఠాల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. రోటీ-భేటీ బంధంతో ప్రారంభించారు. ఎక్కడి వరకు వెళ్తుందనేది కాలమే నిర్ణయించాలి.