కేసీఆర్ బీజేపీకి భయపడుతున్నారా

By KTV Telugu On 29 April, 2023
image

ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే అన్నాడో సినీ కవి. అందులో ఎంత నిజం ఉందో ఏమో కానీ రాజకీయుల మాటలకు మాత్రం కచ్చితంగా అర్ధాలు వేరు. రాజకీయుల మాటలకు అర్దాలు తెలుసుకోవాలంటే ప్రత్యేక నిఘంటువులు ఉండాలంటారు రాజకీయ భాషా శాస్త్రవేత్తలు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఫలానా నేత అంటే తనకు భయం లేదన్నారంటే కచ్చితంగా ఆ నేతంటే చాలా భయమని అర్దం అంటారు విశ్లేషకులు. వీరి బాషను అర్దం చేసుకోవాలంటే ప్రత్యేక తర్ఫీదు కూడా ఉండాలంటున్నారు. బి.ఆర్.ఎస్. ఆవిర్బావ సదస్సులో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన కేసీయార్ చాలా కీలక అంశాలపై మాట్లాడారు. అన్నింట్లోకీ అందరినీ ఆకర్షించిన వ్యాఖ్య ఒకటి ఉంది. వచ్చే ఎన్నికల్లో మనకి పోటీ అంటూ ఉంటే అది కాంగ్రెస్ నుంచే ఉంటుంది తప్ప బిజెపి మనకి అసలు పోటీయే కాదు అన్నారు కేసీయార్. వెంటనే దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నిజంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కీలక పాత్ర పోషించే అవకాశాలే లేవా బి.ఆర్.ఎస్.కు పోటీనిచ్చే స్థితిలో బిజెపి లేనే లేదా అన్న ప్రశ్నలు వచ్చాయి. అయితే దీనిపై రాజకీయ పండితులు తమదైన క్లారిటీ ఇస్తున్నారు.

బిజెపి మనకి పోటీయే కాదని కేసీయార్ అన్నారంటే అసలు అర్ధం బిజెపితోనే మనం యుద్ధం చేయాల్సి ఉంటుందని అర్ధం చేసుకోవాలంటున్నారు వారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇంచుమించు పాతికదాకా నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మజ్లిస్ పార్టీ కంచుకోటలు ఏడు దాకా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ బి.ఆర్.ఎస్. బిజెపిల మధ్యనే ఉంటుందని అంటున్నారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని వారు చెబుతున్నారు. ఒక్క బి.ఆర్.ఎస్సే కాదు ఏ రాజకీయ పార్టీ అయినా అంతే. ఢిల్లీలో కాంగ్రెస్ బిజెపిలు రెండూ కూడా తమకి ఆమ్ ఆద్మీ పార్టీ అసలు పోటీయే కాదన్నాయి. కానీ రెండు పార్టీలను చెరో కాలితో తన్నేసిన కేజ్రీవాల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సినీ నటుడు నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారు. కాంగ్రెస్ ను గద్దె దించడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఎన్టీయార్ ప్రచారం చేస్తోంటే కాంగ్రెస్ నేతలు వెటకారాలాడారు. ముఖానికి రంగులు వేసుకునే మనిషికి ఎవరు ఓట్లు వేస్తారంటూ ఎన్టీయార్ ను కించపరిచారు. టిడిపికి ఒక్క సీటు అయినా వస్తుందని ఎకసెక్కాలాడారు. అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఎన్టీయార్ అల్లుడు చంద్రబాబు నాయుడు అయితే తనకి హై కమాండ్ అవకాశం ఇస్తే ఎన్టీయార్ పైనే పోటీ చేసి ఓడిస్తా అన్నారు. చివరకు సాధారణ అభ్యర్ధి చేతిలోనే ఆయన పరాజయం పాలయ్యారు. ఆయనే కాదు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది.

2019 ఎన్నికల ముందు ఏపీలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తమకి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పోటీయే కాదన్నారు. మరోసారి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది తానే అన్నారు. సీన్ కట్ చేస్తే ఆ ఎన్నికల్లో టిడిపి 23 స్థానాలకు పరిమితం కాగా పోటీయే కాదని తీసిపారేసిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతో అఖండ విజయం సాధించింది. పంజాబ్ ఎన్నికల్లోనూ అంతే కాంగ్రెస్ బిజెపిలు రెండూ పోటీ తమ మధ్యే ఉంటుంది తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ సీన్ లోనే ఉండదన్నాయి. చివరకు రెండు జాతీయ పార్టీలకు షాకిస్తూ ఆప్ అక్కడా జెండా ఎగరేసింది. అంచేత రాజకీయ పార్టీలు ఎవరి గురించి అయితే తీసిపారేసినట్లు మాట్లాడతాయో ఆ పార్టీలంటే లోలోన భయపడుతోన్నట్లు అర్ధం చేసుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని పెట్టినపుడు సిపిఎం నేతలు పగలబడి నవ్వారు. కాంగ్రెస్ పార్టీయే మమ్మల్ని ఓడించలేకపోయింది ఒక్క మమతా బెనర్జీ ఏం చేయగలదు అని మితిమీరిన విశ్వాసానికి పోయారు. మమతను తాము అసలు పోటీగా చూడ్డమే లేదన్నారు. చాలా పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి ఇంటికి పోతాయి టి.ఎం.సి.కూడా అలాంటిదే అన్నారు కామ్రేడ్లు. అలా తక్కువ అంచనా వేసిన మమతా బెనర్జీయే బెంగాల్ లో కమ్యూనిస్టుల ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టి వారి కంచుకోట బద్దలు కొట్టి వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. గత ఎన్నికల్లో అయితే కమ్యూనిస్టు పార్టీలు అసలు బోణీ కూడా కొట్టలేకపోయాయి. అందుకే ఎవరినీ తీసిపారేయకూడదంటున్నారు విజ్ఞులు.