అనుభవించిన వారికే పదవుల పొడిగింపు – కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం

By KTV Telugu On 8 March, 2023
image

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ ముగ్గురు దేశపతి శ్రీనివాస్, కూర్మయ్యగారి నవీన్ కుమార్ రావు, చల్లా వెంకట్రామిరెడ్డి. వీరిలో ఒక్క దేశపతి శ్రీనివాస్ మినహా మిగతా ఇద్దరి విషయంలో బీఆర్ఎస్‌లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందులో చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ నుంచి ఈ మధ్యనే వలస వచ్చిన నేత ఇక కే.నవీన్ రావు పార్టీ కోసం చేసిన కష్టం ఏమిటో సొంత పార్టీ క్యాడర్ కూ తెలియదు. పైగా ఆయనకు ఇది మొదటి సారి కాదు రెండో సారి ఎమ్మెల్సీ కేటాయించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న నవీన్ రావుకు మరోసారి పొడిగింపు ఇచ్చారు కేసీఆర్. పార్టీ కోసం పని చేసిన వాళ్లు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వాళ్లు ఎంతో మంది ఇంకా ప్రాధాన్యం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఓ సారి పదవి ఇచ్చిన వారికే మళ్లీ మళ్లీ కేసీఆర్ పదవులు కట్టబెడుతున్నారు కానీ వారికి అవకాశం లభించడం లేదు.

దేశపతి శ్రీనివాస్ కు మొదటి సారి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన పేరు గత ఏడెనిమిదేళ్లుగా ఎమ్మెల్సీ పదవుల భర్తీ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా వినిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం దేశపతి శ్రీనివాస్ ఉద్యమం చేసిన చాలా కష్టపడ్డారు. ఆయన మాటలు తూటాల్లా ప్రజల్లోకి వెళ్లేవి. పాటలు మాటలూ అంతే. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో ఆయన స్టైలే వేరు. ఆంధ్రోళ్లను కించ పరిచి ఉద్యమాన్ని రగిలిస్తున్నారని విమర్శలు వచ్చినా వెనుకడుగు వేయలేదు. ఆయన శైలి కేసీఆర్‌కు బాగా నచ్చింది. అందుకే ఆయనను ఓఎస్డీగా పెట్టుకున్నారు. ప్రభుత్వ టీచర్ అయిన ఆయనతో రాజీనామా చేయించారు కానీ ఇన్నాళ్లకు పదవి ఇచ్చారు. టీచర్ గా ఉండి ఉంటే ఇచ్చేవారో కాదో తెలియదు కానీ ఆయనకు పదవి రావడం ఉద్యమకారులకు కాస్త రిలీఫ్ అనుకోవచ్చు. కానీ మిగతా ఇద్దరు ఎమ్మెల్సీ పదవుల భర్తీ చేసే పేర్లను చూస్తే బీఆర్ఎస్ నేతలకూ గాలి పోతుంది. కేసీఆర్ కష్టపడిన వాళ్లకు ఇంకెప్పుడు గుర్తింపు అని వాళ్లలో వాళ్లు మథనపడాల్సి వస్తోంది.

కూర్మయ్యగారి నవీన్ కుమార్ రావు పార్టీకి చేసిన సేవ ఏంటి అంటే ఎవరూ చెప్పలేరు. ఆయనను ద్వితీయ శ్రేణి నేతలు గుర్తు పట్టలేరు. పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నారేమో కానీ ఆయన నేరుగా పార్టీ బలోపేతం కోసం చేసిందేమీ లేదని ఎక్కువ మంది అభిప్రాయం. నాలుగేళ్ల కిందట ఎమ్మెల్యేగా ఎన్నికలయిన మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ స్థానంలో కేసీఆర్ నవీన్ రావుకు చాన్సిచ్చారు. ఆయనకు పదవి ఇవ్వడానికి మల్కాజిరి టిక్కెట్ కోసం ఆయన రేసులో ఉన్నారని ప్రచారం చేశారు. నిజానికి ప్రజా రాజకీయాల్లో నవీన్ రావు పెద్దగా ఎవరికీ కనిపించరు. ఆయనకు క్యాడర్ తో సంబంధాలు కూడా లేవు. అయితే అప్పట్లో అది నాలుగేళ్ల పదవీ కాలమే కదా అని ఆశావహులు కూడా సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు నవీన్ రావు మరోసారి కేసీఆర్ పొడిగింపు ఇచ్చారు. అప్పటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్సీ ఆశావహులు క్యూలో ఉన్నారు. వారందర్నీ నిరాశపరుస్తూ కేసీఆర్ ఎమ్మెల్సీ పోస్టును నవీన్ రావుకే అప్పగించారు.

ఎమ్మెల్యేగా పోటీ చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కేసీఆర్ చెప్పిన మాట మేరకు సైలెంట్ గా ఉన్న నేతలు చాలా మంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు చాలా హామీలు ఇచ్చి చేర్చుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన నేతలు చాడ కిషన్‌రెడ్డి బిక్షమయ్యగౌడ్‌ తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ మాజీ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేరిలింగంపల్లి నియోజకవర్గ నేత బండి రమేష్ సీనియర్‌ నేత పీఎల్‌ శ్రీనివాస్‌, వరంగల్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌తోపాటు వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి నిజామాబాద్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డి వీరందరూ చాలా కాలం నుంచి తమకు అవకాశం ఇస్తారేమో అని ఎదురు చూస్తూ వస్తున్నారు.

ఉద్యమంలో పని చేసి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాధాన్యత దక్కని వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎ బాలసాని లక్ష్మీనారాయణ, జూపల్లి కృష్ణరావు, అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, , క్యామ మల్లేశ్, తీగల కృష్ణారెడ్డి, బొంతు రామ్మోహన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పురాణం సతీష్, గౌడం నగేష్, నారదాసు లక్ష్మణ రావు , కర్నె ప్రభాకర్ వంటి వారు అవకాశం కోసం అదే పనిగా కేసీఆర్ కు విజ్ఞాపనుల చేసుకున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇక పార్టీలో ఎన్నో ఆశలతో ఇత పార్టీల నుంచి చేరిన వారికీ అవకాశం కల్పించలేకపోయారు . కానీ ఒక సారి అవకాశం కల్పించిన వారికి రెండో సారి కూడా వీరందర్నీ కాదని అవకాశం కల్పించడం ఏమిటన్నది పార్టీ క్యాడర్‌లో అసంతృప్తి కలిగిస్తున్న అంశం. నవీన్ రావుకు రెండో సారి ఎమ్మెల్సీ కేటాయించడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు కూడా అదనంగా రాదు. ఓ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారన్న పేరు కూడా రాదు. పైగా సొంత వర్గానికి కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారన్న అసంతృప్తి ఇతర వర్గాల్లో ఉంటుంది.

ఓ పదవిని అది వారి హక్కు అన్నట్లుగా అదే పనిగా పదవీ కాలం అయిపోయిన ప్రతీసారి పొడిగింపు నివ్వడం అనేది పార్టీ కోసం పని చేస్తున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయడమే అవుతుంది. అదే సమయంలో అది పార్టీకి కూడా మంచిది కాదు. ఎమ్మెల్యే లేదా ఎంపీ లేదా మరో పదవి ఏదైనా ఒకే నేతకు పదే పదే అవకాశాలు కల్పించడం వల్ల తమ పార్టీలోనే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదగకుండా చేసుకోవడం అవుతుంది. అది పునాదుల్ని కదిలించుకోవడమే. ఎప్పటికైనా ఓ నేతకు మరో నేత ప్రత్యామ్నాయంగా ఉన్నప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. కానీ సీఎం కేసీఆర్ ఇలా ఒకే పదవిని ఒకరికే కొనసాగించడం వల్ల వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నట్లవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.