తెలంగాణలో రాష్ట్రపతి పాలన – కేంద్రం ధైర్యం చేస్తుందా ?

By KTV Telugu On 27 January, 2023
image

తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. కేంద్రానికి నివేదిక పంపించా అని గవర్నర్ తమిళిసై చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. గతంలో కూడా నేను తల్చుకుంటే ఈ ప్రభుత్వం ఉండేది కాదు అని ఓ సందర్భంలో తమిళిసై చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు గవర్నర్ ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదిరింది. కోర్టు ఆదేశించినా రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించకపోవడం సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడంతో పరిస్థితి మరింత సీరియస్ గా మారింది . అదే సమయంలో గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేశారు. ఇలా రెండు వర్గాలు పట్టు విడుపులు లేకుండా పంతానికి పోయి పోరాటం చేస్తున్నాయి. చివరికి ఈ పోరాటం రాష్ట్రపతి పాలనకు దారి తీస్తుందా.

తెలంగాణలో రాజ్యాంగం అమలు కావడం లేదని గవర్నర్ తమిళిసై ఆరోపణ. నిజానికి రాజ్యాంగ ఉల్లంఘన అనేది తీవ్రమైన అభియోగం. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంటే పరిస్థితులు ఎలాంటి మలుపులు అయినా తిరగవచ్చు. తమిళిసై ఈ ఆరోపణ ప్రధానంగా చేయడానికి కారణం రిపబ్లిక్ డే వేడుకలు. కరోనా పేరుతో గణతంత్ర వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అదే కేసీఆర్ ఐదు లక్షల మందితో సభ నిర్వహించారని తమిళిసై అంటున్నారు. ఈ విషయాలన్నింటిపై కేంద్రానికి నివేదిక పంపించానని ప్రకటించారు. అదే సమయంలో హైదరాబాద్‌ రాజ్ భవన్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నేరుగా ప్రభుత్వం విమర్శలు చేశారు.

ఫామ్ హౌస్ ల గురించి మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్ నేతలు గవర్నర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవి గీత దాటుతున్నాయి. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత తిట్లు లాంటి విమర్శలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మహిళా గవర్నర్ కు కనీస గౌరవం ఇవ్వకుండా అనరాని మాటలను అన్నారు కౌశిక్ రెడ్డి. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో పాటు రాజ్యాంగ పరంగా నిర్వర్తించాల్సిన విధులను ప్రభుత్వం నిర్వహించడం లేదని గవర్నర్ కు ప్రోటోకాల్ కూడా కల్పించడం లేదన్న ఆరోపణలు బీజేపీ వైపు నుంచి వస్తున్నయి. ఈ క్రమంమలో గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపించానని చెప్పడం చర్చనీయాంశమవుతోంది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని కేంద్రం సీరియస్‌గా తీసుకుంటే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.

రిపబ్లిక్ డే రాజకీయ పరమైన కార్యక్రమం కాదు. అది దేశానికి సంబంధించిన కార్యక్రమం. గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు కాబట్టి ఈ వేడుకలు చేస్తారు. జనవరి 26న ఢిల్లీలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆగస్టు 15 లాగే జనవరి 26ను కూడా ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తాయి. శకటాల ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోతూండటంతో ఈసారి కూడా రాజ్ భవన్‌లోనే నిర్వహించారు. అంతకు ముందు రోజు హైకోర్టు కూడా కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే నిర్వహించాలని ఆదేశించింది. గతేడాది రాజ్‌భవన్‌లో జరిగిన 73వ గణతంత్ర వేడుకలకు కేసీఆర్ హాజరుకాలేదు. ప్రగతి భవన్‌ లోనే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ ఈ సారి ఇష్యూ రాజ్యాంగ ఉల్లంఘన దిశగా వెళ్లింది. ప్రభుత్వం రెండు రకాలుగా విమర్శలు ఎదుర్కోంటోంది.

రిపబ్లిక్ డే నిర్వహించకుండా దేశాన్ని అవమానించారని రాజ్యాంగాన్ని గౌరవించలేదని ఒకటి కాగా హైకోర్టు తీర్పును కూడా పరిగణనలోకి తీసుకోలేదని మరో విమర్శ ఎదుర్కోవాల్సి వస్తోంది. నిజానికి కేసీఆర్ తమిళిసై వేదిక పంచుకోనంత శత్రుత్వాన్ని పెంచుకోలేదు. ఇటీవల రాష్ట్రపతి తెలంగాణకు వస్తే ఆమెతో కలిసి స్వాగత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు హైకోర్టు సీజే ప్రమాణ స్వికారానికి రాజ్ భవన్ కు వెళ్లారు. ఏ విభేదాలు లేనట్లుగా మాట్లాడారు. ఇప్పుడు రిపబ్లిక్ డే కూడా దేశానికి సంబంధించిన అంశం కాబట్టి అలాగే వ్యవహరించి ఉంటే వివాదం ఉండేది కాదు. రాజకీయ సంచలనం అయ్యేది కాదు. కానీ కేసీఆర్ గవర్నర్ తాము ఇచ్చిన ప్రసంగం చదవరన్న ఆలోచనతోనే తమ ప్రభుత్వం కార్యక్రమం లో తమ ప్రభుత్వాన్ని గవర్నర్ తో విమర్శింపచేసుకున్నట్లవుతున్న కారణంగా నిర్వహించడానికి వెనుకాడినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ టార్గెట్ పెట్టుకున్న రాష్ట్రాల్లో అదే జరుగుతోంది.

తెలంగాణ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరం. గవర్నర్ కు లేని అధికారాల్ని చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. దానికి అనేక ఘటనలు రుజువులుగా ఉన్నాయి. బిల్లులు ఇప్పటికీ శాసనసభ ఆమోదించినప్పటికీ రాజ్ భవన్ లో ఉన్నాయి. వాటిపై అభ్యంతరాలు ఉంటే తిరస్కరించాలి అంతే కానీ దగ్గర పెట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల ఆ చట్టాలు చేయాలనుకున్న ప్రభుత్వం చేతులు కట్టేసినట్లయింది. కానీ పట్టించుకుంటేనా ఇదొక్కటే కాదు ప్రతీ విషయంలోనూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున ప్రసంగంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం పూర్తిగా రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని రాజకీయాల కోసం వాడుకోవడమే. ఈ విషయంలో గవర్నర్ తమిళిసైను ఎవరూ సమర్థించరు. ఆమె తీరును తీవ్రంగా విమర్శిస్తారు.

అయితే తమిళిసై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. ఆమెను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. టిట్ ఫర్ టాట్ అనే అభిప్రాయం ఎక్కువ మందికి వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అలా చేయకుండా ఆమెకు రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన ప్రోటోకాల్ ఇచ్చి ఉంటే ఒక్క గవర్నర్ వ్యవహారశైలి మాత్రమే హైలెట్ అయ్యేది. కానీ ఇక్కడ ప్రభుత్వం గవర్నర్ పట్ల వ్యవహరిస్తున్న విధానం కూడా చర్చనీయాంశం అవుతోంది. కేంద్రం ఇప్పుడు గవర్నర్ నివేదిక ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఇవన్నీ చర్చల్లోకి వస్తాయి. అయితే రాష్ట్రాల్లో రాష్ట్రపతిపాలన విధించడం అంత సులువు కాదు. ఇప్పుడలా విధించకపోవచ్చు. కానీ కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనుకున్నా లేకపోతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరవాతైనా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇలా చేయడం కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇబ్బందికరం అవుతుంది. బహుశా ఆ ప్లాన్ కోసమే గవర్నర్ తో ఇలా రచ్చ చేయిస్తున్నారేమో కానీ ఇదే నిజం అయితే బీఆర్ఎస్ బీజేపీ ట్రాప్ లో పడినట్లే అనుకోవచ్చు.