మౌనం కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగమే కాదు ఓ అస్త్రం కూడా అయితే ఈ అస్త్రాన్ని పదేపదే వాడితే దానికి ఉన్న విలువ పోతుంది. ఇప్పుడు కేసీఆర్ పాటిస్తున్న మౌనం కూడా అంతే. భీకరమైన శపథాలు చేస్తారు తర్వాత సైలెంట్ గా ఉంటారు. పార్టీ శ్రేణులతో కేసీఆర్ మౌనం వెనుక భయంకరమైన వ్యూహం ఉందని ప్రచారం చేయిస్తారు కానీ తర్వాత చేసేదేమీ ఉండదు కొంత కాలంగా ఇదే జరుగుతోంది. ఓ వైపు ఎన్నికలు ముంచుకొస్తున్నా జాతీయ పార్టీ ప్రకటన తర్వాత కూడా అదే మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఏం చేస్తారు చేయబోతారు అన్న క్లారిటీ పార్టీ శ్రేణులకు ఉండటం లేదు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో గందరగోళం ఏర్పడుతోంది.
మోదీ ఇక కాసుకో యుద్ధమే అని అని కేసీఆర్ ప్రకటించి చాలా కాలం అయింది. మరి కేసీఆర్ ఎక్కడ చేశారు యుద్ధం అంటే ఇంకా ప్రారంభం కాలేదని చెప్పుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు వస్తే కనీసం ఆహ్వానం చెప్పకపోవడం యుద్ధంలో భాగం అనుకోవాలి తప్ప మరే విధంంగానూ పోరాటం అనే కార్యాచరణ కనిపింంచడం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీని పల్లెత్తు మాట అనడం లేదు. అనాల్సి వచ్చినా ఆయన మీడియా కెమెరాలన్నిటినీ ఆపు చేయించి అంటున్నారు కానీ రికార్డెడ్ గా అనడానికి మాత్రం సందేహిస్తున్నారు. కేసీఆర్ ప్రగతి భవన్ దాటని యుద్ధం చేస్తున్నారన్న సెటైర్లు ఈ కారణంగానే వస్తున్నాయి. కేంద్రంపై పోరాటంలో కేసీఆర్ నిస్సహాయత చాలా స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పేరు కూడా తెరపైకి తెస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నల్లో ప్రధానంగా కేసీఆర్ తో ఉన్న ఆర్థిక సంబంధాల గురించే వచ్చాయన్న ప్రచారం గుప్పుమంది. ఓ వైపు తనను బీజేపీ రౌండప్ చేస్తోందని అర్థమవుతూనే ఉంది. అయినప్పటికీ కేసీఆర్ స్ట్రాటజిక్ సైలెన్స్ పాటిస్తూనే ఉన్నారు.
కేసీఆర్ జాతీయ పార్టీగా టీఆర్ఎస్ను మార్పు చేసుకుంటున్నట్లుగా ప్రకటించిన తర్వాత భారీ ఖర్చు పెట్టి మీడియాలో ప్రకటనలు ఇచ్చుకున్నారు కానీ నేరుగా ఇతర రాష్ట్రాల్లో చేసిన రాజకీయమే లేదు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో రెండు సభలు పెట్టారు మూడో సభ కూడా అక్కడే పెడుతున్నారు అక్కడే ఎందుకు ఫోకస్ చేస్తున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత మొదటి టార్గెట్ కర్ణాటక అని స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు కర్ణాటకలో నామినేషన్ల గడువు కూడా ముగిసింది. కానీ ఆయన ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రస్తావనే లేదు. కనీసం కుమారస్వామి పార్టీకి మద్దతు అయినా ఇంకా ప్రకటించలేదు. కుమారస్వామి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంపై ఆసక్తిగాలేరేమో తెలియదు కానీ కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అదే సమయంలో మహారాష్ట్రలో లోకల్ ఎన్నికల్లో దున్నేస్తామని అక్కడ బహిరంగసభలు పెట్టి చెబుతున్నారు. జాతీయ పార్టీకి ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమా మరో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు కీలకమా.
ఎన్నికల ఏడాది బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి ఇతర పార్టీలు రెడీ అవుతున్నాయి. వారందర్నీ కలిపపడానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కానీ కేసీఆర్ వారిని కలిసేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. త్వరలో కేసీఆర్ నుకలుస్తానని నితీష్ ప్రకటించారు. కలవాలనుకుంటే ఒక్క రోజులో కలవొచ్చు కానీ కేసీఆర్ ఆసక్తిగా లేరని చెబుతున్నారు. అఖిలేష్ మమతా బెనర్జీ కూడా కేసీఆర్ ను కలుస్తామన్నారు. అలాంటి పరిణాలేమీ జరుగుతాయన్న సూచనలు కనిపించడం లేదు. దీంతో కేసీఆర్ రాజకీయ వ్యూహాలు రాజీ దిశగా పోతున్నాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. కర్ణాటకలో బీఆర్ఎస్ తెలుగు వాళ్లున్న ప్రాంతాల్లో హడావుడి చేసినా బీజేపీకి ఓట్ల నష్టం జరుగుతుందన్న కారణంగానే సైలెంట్ గా ఉన్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి.
రాజకీయాల్లో సైలెంట్ గా ఉండటం వ్యూహమే కానీ అది అన్ని సందర్భాల్లోనూ కాదు. కేసీఆర్ గతంలో ప్రతీ రోజూ ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని కడిగేస్తానని చెప్పేవారు. అంటే ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. మరి మౌనంగా ఉంటే జరిగే నష్టం కూడా ఆయనకు స్పష్టంగా తెలుసని రాకీయవర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం మహారాష్ట్ర శివారు ప్రాంతాల్లోనే రాజకీయం చేయడం మోదీ షాలపై నోరు మెదపకపోవడం అన్నీ రాజకీయ వ్యూహాలే. కాకపోతే అవి యుద్ధం చేస్తున్నట్లుగా కాకుండా రాజీపడటానికి సంకేతాల్లా ఉన్నాయి. అదే నిజమైతే కేసీఆర్ యుద్ధంలోకి దిగకుండానే ఓటమి ఒప్పుకున్నట్లవుతుంది. మరి దీనికి ఆయన అంగీకరించినట్లేనా.