ఎమ్మెల్యేల గుండెల్లో బాంబు పేల్చిన కేసీఆర్

By KTV Telugu On 29 April, 2023
image

ఎన్నికల ఏడాదిలో పార్టీ ఎమ్మెల్యేలకు  గట్టి వార్నింగ్ ఇచ్చారు బి.ఆర్.ఎస్. అధినేత ముఖ్యమంత్రి కేసీయార్. పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని తెగేసి చెప్పారు. దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాల అమలులో ప్రజాప్రతినిథులు అక్రమాలకు పాల్పడితే వారికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని పార్టీ నుండి బయటకు పంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ బాగా పనిచేసి ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో పార్టీ సర్వజన సభ జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలంతా పాల్గొన్న ఈకార్యక్రమంలో కేసీయార్ కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న కేసీయార్ మిగతా ప్రచారాలను నమ్మద్దని సూచించారు. కచ్చితంగా అక్టోబరులోనే ఎన్నికలు జరుగుతాయి. అక్టోబరు 10న వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో 100 స్థానాలకు తక్కువ కాకుండా గెలుస్తున్నాం అని సర్వేలు తేల్చాయన్నారు.

మనల్ని ఎవరూ ఆపలేరు మరోసారి అధికారంలోకి వచ్చేది మనమే అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యేలలో కొందరు సరిగ్గా పనిచేయడం లేదని కొందరిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా దళిత బంధు పథకం అమలులో మూడు లక్షల చొప్పున వసూలు చేసిన ఎమ్మెల్యేల జాబితా తన వద్ద ఉందన్నారు కేసీయార్. వాళ్లకి ఇదే నా లాస్ట్ వార్నింగ్ మునుముందు ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే పార్టీ నుండి బయటకు వెళ్లిపోవలసి ఉంటుంది. మీ అనుచరులు డబ్బులు వసూలు చేసినా మీదే బాధ్యత అని చాలా సీరియస్ గా హెచ్చరించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం అమలులోనూ కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలంతా నేటి నుండే ప్రజలతో మమేకం అవుతూ వారిలో ఉంటూ మంచిగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. మీరు ఎలా పనిచేస్తున్నారో నాకు తెలుస్తుంది. ఎవరైనా తోక జాడిస్తే కత్తిరిస్తా అని హెచ్చరించారు కేసీయార్. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పడం ద్వారా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసినట్లే అని రాజకీయ పండితులు అంటున్నారు. కేసీయార్ హెచ్చరికలతో ఎమ్మెల్యేల్లో కంగారు మొదలైంది.

మూడు లక్షల రూపాయలు వసూలు చేసిన ఎమ్మెల్యేల జాబితా తన వద్ద ఉందని కేసీయార్ వ్యాఖ్యానించడంతో ఆ ఎమ్మెల్యేలు ఎవరెవరా అన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పని తీరు ఆధారంగా టికెట్ ఇస్తే తమకి వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా రాదా అన్న అంశంపైనా ఎమ్మెల్యేల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. పనితీరు బాగా ఉన్న వారికి టికెట్లు గ్యారంటీ అని భరోసా ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మరో చర్చ మొదలైంది. ఆ జాబితాలో తాము ఉన్నామా లేమా అన్న డైలమా మొదలైందంటున్నారు. ఇలా రకరకాలుగా ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. కేసీయార్ వ్యాఖ్యల వెనక ఆంతర్యాన్ని కూడా విశ్లేషించుకుంటున్నారు. వివిధ సందర్భాల్లో కేసీయార్ మెచ్చుకున్న ఎమ్మెల్యేలు మాత్రం కాస్త నిశ్చింతగానే ఉన్నారని అంటున్నారు. రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్ మొదలైంది. తమపై వచ్చిన ఆరోపణలు టికెట్ రాకుండా చేసేంతటి పెద్దవా అని ఆలోచించుకుంటున్నారు. కొందరైతే తమపై అక్రమంగా ఆరోపణలు చేశారే తప్ప తాము ఏ తప్పూ చేయలేదని తమలో తామే సద్ది చెప్పుకుంటున్నారు. కొద్ది వారాల క్రితం కొద్ది మంది ఎమ్మెల్యేలను పిలిచిన కేసీయార్ వచ్చే ఎన్నికల్లో మీమీ నియోజక వర్గాల్లో పోటీ చేయబోయేది మీరే ఇప్పట్నుంచీ జనంలో ఉండండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఆ ఎమ్మెల్యేలు అప్పట్నుంచీ కాస్త రిలీఫ్ గా ఉన్నారు. అపుడు కేసీయార్ పిలవని ఎమ్మెల్యేల్లో మాత్రం  తమ భవిష్యత్ ఏంటన్న  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీయార్ కాంగ్రెస్ బిజెపిలకన్నా చాలా ముందుగా అభ్యర్ధులను ఎంపిక చేసి జాబితాలు విడుదల చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జాబితా విడుదల చేయడానికి ముందే ఆయా నేతలకు సమాచారం ఇచ్చేస్తారని వారు తమ తమ నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే ప్రచారం చేసుకోడానికి ప్రజాసమస్యలపై దృష్టి సారించడానికి వీలుంటుందని అంటున్నారు. ఒక వేళ ఏదైనా అంశంలో ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఎన్నికల లోపే వాటిని సరిదిద్దుకోడానికి సమయం ఉంటుంది కాబట్టి పార్టీకి ఎక్కువ నష్టం జరక్కుండా నివారించుకోవచ్చునని భావిస్తున్నారు. టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానం ఉన్నవాళ్లు ఒక వేళ టికెట్ వచ్చినా బి.ఆర్.ఎస్.గెలుస్తుందో లేదో అన్న అనుమానం ఉన్న వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు సమాచారం. అటువంటి వారిపైనా నిఘా పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ వీడాలనుకునే వారు బలహీన అభ్యర్ధులైతే వారిని వెంటనే సాగనంపేందుకు సిద్ధం అవ్వాలని భావిస్తున్నట్లు అంటున్నారు. అదే బలమైన అభ్యర్ధులైతే మాత్రం వారు పార్టీ వీడకుండా వారి సమస్యలేంటో తెలుసుకుని అవసరమైన హామీలు భరోసాలు ఇవ్వాలన్న వ్యూహంతోనూ ఉన్నారని అంటున్నారు.

2018 ఎన్నికల్లో  కాంగ్రెస్ టిడిపిల తరపున పోటీ చేసి గెలిచి ఆ తర్వాత బి.ఆర్.ఎస్. లో చేరిన వారు వచ్చే ఎన్నికల్లో తమకి టికెట్ వస్తుందా రాదా అన్న టెన్షన్ లో ఉన్నారు. టికెట్ రాదని ముందుగానే తేలిపోతే తిరిగి తమ పాత పార్టీల్లోనే చేరిపోతే ఎలా ఉంటుందని కూడా వారు ఆలోచిస్తున్నారట. బయటి పార్టీల నుండి వచ్చి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మొదటి నుంచీ బి.ఆర్.ఎస్. జెండా మోస్తోన్న గులాబీ నేతలు వచ్చే ఎన్నికల్లో తమకి టికెట్ ఇవ్వకపోతే ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. పార్టీ నేతలను ఎన్నికలకు సమాయత్తం చేయడంతో పాటు ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయాలని కేసీయార్ కృతనిశ్చయంతో ఉన్నారు. బి.ఆర్.ఎస్. తో పొత్తు కోసం వెంపర్లాడుతోన్న కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు ఉండచ్చని పార్టీలోని ఓ వర్గం అంటోంది. అయితే కామ్రేడ్లతో పొత్తులు అవసరం ఉండకపోవచ్చునని మరో వర్గం అంటోంది. ఇటీవల పార్టీ ముఖ్యనేతల భేటీలో కేసీయార్ మాత్రం కమ్యూనిస్టుల పొత్తు గురించి ఓ నేత ప్రస్తావించినపుడు వాళ్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఏం పోటీ చేస్తారు ఎమ్మెల్సీ స్థానాలు ఇద్దాంలే అన్నారని ప్రచారం జరిగింది.

అంటే కమ్యూనిస్టులు అసెంబ్లీ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. కు మద్దతు ఇస్తే ఆతర్వాత బి.ఆర్.ఎస్. అధికారంలోకి వస్తే అపుడు కమ్యూనిస్టు పార్టీలకు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తారన్నమాట. అయితే దీనికి కమ్యూనిస్టులు సిద్ధంగా లేరంటున్నారు. తమకి సీట్లు కేటాయించకపోతే కాంగ్రెస్ తో అయినా పొత్తు పెట్టుకుంటామని కామ్రేడ్లు అంటున్నారు. అదే సమయంలో బిజెపిని ఓడించగల పార్టీతో పొత్తు పెట్టుకుంటామని కమ్యూనిస్టులు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితిపై కేసీయార్ సొంతంగా ఓ సర్వే చేయించారని అంటున్నారు. ఆ సర్వేలో గెలిచే అవకాశాలున్న ఎమ్మెల్యేల జాబితాతో పాటు కచ్చితంగా ఓడిపోతారనుకునే అభ్యర్ధుల జాబితా కూడా ఉందంటున్నారు. ఆ సర్వే ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందని పార్టీ వ్యూహకర్తలు అంటున్నారు. ఆసర్వేలోనే వచ్చే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. బాగా కష్టపడితే మరోసారి అధికారంలోకి రావచ్చునని తేలిందట. సర్వే ఆధారంగానే మనకి 100 స్థానాలు కచ్చితంగా వస్తాయని కేసీయార్ ధీమా వ్యక్తం చేశారని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. అయితే వంద స్థానాలు అనేది మరీ ఎక్కువ అంచనా కావచ్చునంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బహుశా బి.ఆర్.ఎస్. అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బి.ఆర్.ఎస్.తర్వాత రెండో స్థానంలో ఉండేది ఎవరన్నదే ఆసక్తికర ప్రశ్న. దానికోసమే కాంగ్రెస్-బిజెపిలు కొట్టుకుంటున్నాయని బి.ఆర్.ఎస్. నేతలు అంటున్నారు. అయితే తాము రెండో స్థానం కోసమో మూడో స్థానంకోసమో పోటీ పడ్డం లేదని తాము పూర్తి మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తోంటే అధికారంలోకి రాబోయేది తామేనని బిజెపి అంటోంది. చూడాలి మరి ప్రజలు ఏ పక్షాన నిలబడతారో.