హైదరాబాద్‌లో బలమైన అభ్యర్థిని నిలబెడతామని హడావుడి చేసిన కాంగ్రెస్ చివరికి హిందూ అభ్యర్థిని నిలబెట్టి మజ్లిస్‌కు మేలు చేయాలని డిసైడైంది. అధికారంలో లేనంత కాలం తమ పార్టీని కించ పరచడమే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లోనూ ఓడించేందుకు ప్రయత్నించిన మజ్లిస్ కు కాంగ్రెస్ సరెండర్ అయింది. బీసీ అభ్యర్థిని పెట్టాలనుకుంటోంది. కాంగ్రెస్ దుస్థితి చూసి ఆ పార్టీ క్యాడర్ కూడా ఇంత కాలం పోరాడింది ఇందుకేనా అనుకునే పరిస్థితి వచ్చింది.
హైదరాబాద్ ఎంపి సీటు అభ్యర్థి ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ పట్టు సడలించింది. ఎంఐఎం కరుణకటాక్షాలు కావాసల్సిందేనని అనుకుంటోంది. ఎంఐఎం పార్టీ నేతలు కూడా అదే వైఖరిని అవలంభిస్తూ క్రమంగా బిఆరెస్ కు దూరం జరుగుతున్నారు. బిజెపి అభ్యర్థి కొంపెల్ల మాధవీలత గట్టి పోటీ ఇస్తుందని ఎంఐఎం పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరపున బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించాలని ఆ పార్టీ అధినేత అసదుద్దిన్ ఓవైసీ విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలో ప్రచారం సాగుతోంది. హైదరాబాద్‌లో ఎంఐఎంకు సహకరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లిం ఓట్లను పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ బిసి అభ్యర్థిని బరిలో దించితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే పలువురు ముస్లిం నాయకుల పేర్లు పరిశీలనకు వచ్చినా వాటిని పక్కనబెట్టి బిసి అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది.
హైదరాబాద్ పాతబస్తీలో పాతుకుపోయిన మజ్లిస్ ఇటీవల బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కంచు కోటల్లాంటి నియోజకవర్గాల్లో మజ్లిస్ గట్టి పోటీ ఎదుర్కొంది. ఎవరూ పోటీ లేకపోయినా.. ఇలాంటి పరిస్థితి ఉంటే.. తమకు పోటీగా మరో పార్టీ వస్తే.. మజ్లిస్ కు వచ్చే ఫలితాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇంత కాలం మజ్లిస్ విజయరహస్యం పాతబస్తీలోకి తమ పార్టీకి పోటీగా మరో పార్టీ రాకుండా చూసుకోవడం. ఇందు కోసం మజ్లిస్ చాలా ప్రత్యేకమైన వ్యూహాలను అమలు చేస్తూ ఉంటుంది.. అందులో ఒకటి అధికార పార్టీతో సన్నిహితంగా ఉండటం. తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే వారితో సన్నిహితంగా ఉండి.. పాతబస్తీలోకి మీరు రావొద్దు.. బయట అంతా మా పార్టీ మీకు మద్దతు ఇస్తుందని ఒప్పందాలు చేసుకుంటారు. పాతబస్తీలో హిందూ అభ్యర్థులను నిలబెట్టి ఓట్లు చీల్చి మేలు చేసుకుంటారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అదే వ్యూహం పాటించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదే పాటించారు. ఇప్పుడు రేవంత్ తోనూ అలాంటి ఒప్పందమే చేసుకుంటున్నారు.
అయితే మజ్లిస్ పై ఓటర్లకు మొహం మెత్తుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో యాకత్పురా, మలక్ పేట, నాంపల్లిలో గట్టి పోటీ ఇచ్చారు. యాకత్పురా స్థానంలో ఎనిమిది వందల ఓట్ల తేడాతోనే మజ్లిస్ అభ్యర్థి బయటపడ్డారు. బీఆర్ఎస్ తో పాటు ఇతర హిందూ అభ్యర్థులు ఓట్లు చీల్చడంతోనే అది సాధ్యమయింది. నాంపల్లి గురించి చెప్పాల్సిన పని లేదు. ఫిరోజ్ ఖాన్ మజ్లిస్ దాడులను ఎదుర్కొని రాజకీయం చేస్తున్నారు. ఓ దశలో మజ్లిస్ కూడా ఆశలు వదిలేసుకుంది. మలక్ పేటలో ఎప్పుడూ గట్టి పోటీ ఎదుర్కొంటూనే ఉంది. దీనికి కారణం యూకత్పురాలో మజ్లిస్ బచావో తెహరీక్.. ఎంబీటీ గట్టి పోటీ ఇవ్వడం.. నాంపల్లి, మలక్ పేటలో కాంగ్రెస్ పుంజుకోవడం. మజ్లిస్‌కు డేంజర్ గా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ గెలవకుండా.. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓవైసీ ప్రచారం చేశారు. అలాంటి పార్టీని… బలహీనపరిచే అవకాశం వచ్చినా వదులుకుంటూ.. ఆ పార్టీతో లోపాయికారీ ఒప్పందాలకే తెలంగాణ కాంగ్రెస్ మొగ్గు చూపుుంది. పాతబస్తీలో ఎంబీటీకి అధికార పార్టీ మద్దతు ఇస్తే.. పాతబస్తీలో మజ్లిస్ కు పోటీగా ఎదుగుతుంది. కానీ ఎంబీటీని ప్రోత్సహించడం ఆపేసి.. తాము బలపడటం మానేసి.. ఫిరోజ్ ఖాన్ లాంటి నేతల పోరాటాలను తక్కువ చేసి.. మజ్లిస్ తో లోపాయికారీ పొత్తులకు వెళ్తోంది కాంగ్రెస్. ఇది వ్యూహాత్మక తప్పిదమే. రక్షణాత్మక రాజకీయమే. దీని వల్ల కాంగ్రెస్ బలహీనపడుతుంది తప్ప.. సాధించుకునేదేమీ ఉండకపోవచ్చు. ఎందుకటే మజ్లిస్ మద్దతు లేకపోయినా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…