తెలంగాణా మంత్రి వర్గాన్ని త్వరలోనే విస్తరిస్తారని అంటున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత విస్తరణకు ముహూర్తం పెడతారని ప్రచారం జరుగుతోంది. కొత్తగా కేబినెట్ లో తీసుకునే వారిలో యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా తనకు అనుకూలంగా తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేవారిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై పార్టీ హైకమాండ్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు చెబుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ నేతల్లో విస్తృతంగా చర్చజరుగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉన్న నియోజకవర్గాల్లో 15 శాతం మందిని మంత్రి వర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు180మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. తెలంగాణ కేబినెట్లో మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆరు స్థానాల కోసం భారీగా పోటీ ఉంది. తమ సామాజిక వర్గానికి మంత్రిగా అవకాశం ఇవ్వాలని కుల సంఘాల నాయకులు ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ కూడా చేస్తున్నారు.
క్యాబినెట్ విస్తరణలో తమకే అవకాశం వస్తుందని పలువురు ఎమ్మెల్యేలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సామాజిక సమీకరణాలలో భాగంగా తమకి క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని మరికొందరు ఎమ్మేల్యేలు ధీమాగా ఉన్నారు. మరోవైపు క్యాబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు మొదలు పెట్టినట్టు సమాచారం. ఇవ్వబోయే ఆరు మంత్రి పదవులు కొత్తవారికి, యువకులకు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఆరుగురిని రేవంత్ తన కిచెన్ క్యాబినెట్ గా మారుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
ఇప్పుడున్న మంత్రులలో నలుగురైదుగురు మినహా మిగతావారు పార్టీ లైన్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో గానీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు వివరించడంలో గానీ చొరవ తీసుకోవడం లేదని ఈ లోటు కొత్త మంత్రులతో భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. క్యాబినెట్ విస్తరణకు ప్రభుత్వం కసరత్తు చేయనుందనే సమాచారంతో సూపర్ సిక్స్ లో ఎవరెవరు ఉంటారనే చర్చ జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు.
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారు. మక్తల్ ఎమ్మేల్యే వాకిటి శ్రీహరి ఒక్కడే ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ముదిరాజ్ సామాజిక వర్గాన్ని లీడ్ చేయగల వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిపదవి ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముదిరాజ్ సామాజిక వర్గాన్ని లీడ్ చేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే సమాచారాన్ని కూడా ప్రభుత్వం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను క్యాబినేట్ లోకి తీసుకుంటారనే చర్చ బలంగా వినిపిస్తుంది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ వాయిస్ ను బలంగా జనంలోకి తీసుకెళ్లడంలో వెంకట్ సక్సెస్ అయ్యారు. వెంకట్ కు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అటు పార్టీ అధిష్టానంతో మంచి గుడ్ విల్ ఉండడంతో మంత్రిగా దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే ప్రభుత్వ విప్ లుగా ఉన్న ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్యలకు ప్రమోషన్ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు… తెలంగాణలో బలమైన సామాజిక వర్గం కావడంతో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. బీర్ల ఐలయ్య కుర్మ సామాజిక వర్గం.. తెలంగాణలో భారీ ఓటు బ్యాంక్ ఉన్న సామజికవర్గం కావడంతో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
సామాజిక కూర్పులో భాగంగా ఎస్టి వర్గం నుంచి లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ లేదా ఉమ్మడి ఖమ్మం లేదా ఉమ్మడి వరంగల్ జిల్లా లకు చెందిన వారికి అవకాశం దక్కనుంది. ఇక ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో వెడ్మ బొజ్జుకు మంచి గుడ్ విల్ ఉండడంతో అవకాశం దక్కనున్నట్లు ప్రచారం ఉంది.
ఉమ్మడి నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లేదా.. ముస్లిం మైనారిటీ కోణంలో షబ్బీర్ ఆలీకి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగే భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ గెలిస్తే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం ఛాన్స్ ఉంటుందని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. మరోనేత మల్ రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారట.తెలంగాణలో ఖాళీగా ఉన్న ఆరు క్యాబినెట్ బెర్తుల కోసం దాదాపు పది మంది నేతలు పోటీ పడుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…