మండుతున్న రాజకీయ బొగ్గు

By KTV Telugu On 24 June, 2024
image

KTV TELUGU :-

సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా వేలం వేసిన అంశంపై రాజకీయం ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సింగేరేణికి ఉన్న గనులు త్వరలో అియపోతాయని ఆ తర్వాత గనులు లేకపోతే సంస్థ మనుగడ ఉండదని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనుల్ని కూడా వేలం వేస్తోంది.ఈ వేలం ప్రక్రియను హైదరాబాద్ లో నిర్వహించారు.  డిప్యూటీ సీఎం స్వయంగా  హాజరయ్యారు.  సంగరేణిని దివాలా తీయిస్తున్నారని.. దానికి కారణం మీరంటే మీరని మూడు పార్టీల మధ్య రాజకీయ మంటలు ప్రారంభమయ్యాయి.

తెలంగాణలో బొగ్గు రాజకీయం నడుస్తుంది. సింగరేణి సంస్థను దివాలా తీసే ప్రయత్నం జరుగుతుంది. దానికి బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేతులు కలిపాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అసలు సింగరేణి ఉసురు తీసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్సేనని జాతీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.  సింగరేణి ఏరియా పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు ను వేలం వేస్తున్నారు.  శ్రావణపల్లి బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గతంలో సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ బొగ్గు బ్లాకును వేలం వేయకుండా, నేరుగా సింగరేణికే కేటాయించాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేసినా.. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కేంద్రం ఇంతకుముందు పలు దఫాలుగా సింగరేణి ఏరియాలోని కల్యాణఖని, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుబ్లాకులకు వేలం నిర్వహించింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కారు ఆ వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. వేలంలో పాల్గొనలేదు.  ఫలితంగా ఆ బొగ్గు గనులు సింగరేణికి దక్కలేదు. వేలంలో ఇతరులకు దక్కాయి. అవి బీఆర్ఎస్ పెద్దల సన్నిహితులకే దక్కాయనే ఆరోపణ కూడా ఉంది. వారి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ వేలంలో పాల్గొనలేదని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి.

బీఆర్ఎస్ హయాంలో  బొగ్గు గనుల వేలం పాట జరిగింది.  2022 అక్టోబర్‌లో  కోయగూడెం బ్లాక్‌ను వేలం వేశారు.  2023లో ఆగస్టులో  సత్తుపల్లి బ్లాక్‌ను వేలం వేశారు.   కోయగూడెం బ్లాక్‌ను దక్కించుకున్నది అరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది  అరబిందో సంస్థకు చెందినది.  సత్తుపల్లి బ్లాక్‌ను శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ దక్కించుకుంది. ఇది  ప్రతిమ గ్రూపు కంపెనీ. ఈ రెండు కంపెనీలు కేసీఆర్ కుటుంబ సన్నిహితులవేనని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. అవి వేలంలో పాడుకోగా..సింగరేణిని ఎందుకు వేలంలో పాల్గొనకుండా ఆపారని ప్రశ్నిస్తున్నారు.   గోదావరి పరిసరాల్లో ఉన్న బొగ్గు గనుల వేలంలో పాల్గొనవద్దని అనధికారికంగా ఆదేశించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ వేలంలో సింగరేణి పాల్గొనలేదు. ఆ ఛాన్స్‌ను ప్రైవేట్ కంపేనీలు క్యాష్‌ చేసుకున్నాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.  సింగరేణి కూడా వేలంలో పాల్గొంది.

వైజాగ్‌ స్టీల్  ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్స్ లేనందు వల్ల నష్టాల్లోకి వెళ్లిపోయింది. సింగేరణిని కూడా అలాగే చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసినా ఇప్పుడు  ప్రభుత్వం సింగరేణికి బొగ్గు గనులు కేటాయింప చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పదేళ్లలో సింగరేణి కనుమరుగు అవుతుంది.  కొయ్యగూడెం, సత్తుపల్లిలోని 6 కోల్ బ్లాకులను   ను సింగరేణికి కేటాయిస్తే అనువుగా ఉంటుందని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.   ఈ విషయమై కిషన్ రెడ్డి ప్రధాని మోదీని ఒప్పించాలని కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క కోరారు. అవసరమైతే ప్రధానితో మాట్లాడేందుకు తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక బొగ్గు గనుల వేలంలో సింగరేణికి రిజర్వేషన్ కల్పించాలని భట్టి కోరారు.  ఈ అంశంపై  కిషన్ రెడ్డికి భట్టి వినతి పత్రం కూడా సమర్పించారు.

అయితే గనుల మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం  వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. సింగరేణిని కాపాడుతామని అంటున్నారు.  ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌లో సింగరేణి లాభం పొందేలా ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. త్వరలో ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడుతామని చెప్పారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కోరిన అంశాలపై చర్చిస్తామన్నారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అంటే ప్రైవేటీకరణ చేసినా ఉద్యోగులకు మేలు జరుగుతుదన్నట్లుగా ఆయ నమాట్లాడుతున్నారు.  మొత్తంగా సింగరేణి  బొగ్గు గనుల రాజకీయం.. తెలంగాణలో ముందు ముందు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఎవరు ఎలాంటి రాజకీయం చేసినా సింగరేణిని కాపాడుకోవడం అన్ని పార్టీల నేతల ముఖ్య ఉద్దేశం అవ్వాలనేది ప్రజల ఆకాంక్ష. రాజకీయ ప్రయోజనాలు చూసుకుని రాజకీయం చేస్తే.. తెలంగాణ ప్రజలకు.. నష్టం జరుగుతుంది.

సింగరేణి వంద శాతం ప్రభుత్వ సంస్థ.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉంది. వీటికి జాతి సంపద అయిన గనులు కేటాయించడం తప్పేమీ కాదు. వేలం వేసి ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే ఆదాయం కన్నా ఎక్కువే వస్తుంది. అయినా ప్రభుత్వాలు ప్రజల్ని మభ్య పెడుతున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి