కాంగ్రెస్ ఆకర్ష్ మిషన్

By KTV Telugu On 24 June, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్కెచ్ ఏంటీ ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కాపాడుకుంటుందా ? కండువా మార్చడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారా ? కాంగ్రెస్ ముందు వారు పెట్టిన డిమాండ్లు వర్కవుట్ కావడం లేదా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు‌‌ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి ?

రాష్ట్ర రాజధాని నగరాన్ని ఆనుకుని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలు… కాస్తా డిఫరెంట్ గా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది.  ఆపరేషన్ ఆకర్ష్ పై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిన నేపథ్యంలో జిల్లాలో కారు దిగి ఎవరైనా హస్తం గూటికి చేరుకుంటారా ? అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ కు అవకాశం దక్కింది. రేవంత్ మంత్రి వర్గంలో జిల్లా ఎమ్మెల్యేలకు ఛాన్స్ దక్కలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేల కోసమే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి క్యాబినెట్ లో బెర్త్ దక్కలేదా ? అన్న చర్చ ప్రారంభమైంది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతంలో మంత్రులుగా పనిచేసిన సబితాఇంద్రారెడ్డి. మల్లారెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మల్లారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయాలని  ట్రై చేశారని… సీఎం రేవంత్ తో వైరం కారణంగా అతన్ని హస్తం గూటికి రానివ్వడం లేదనే ప్రచారం సాగుతోంది. సబితారెడ్డి కుటుంబానికి రేవంత్ రెడ్డికి మధ్య  కొంత గ్యాప్ ఉందనే ప్రచారం ఉంది.  రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ లోక్ సభ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డితో పలుసార్లు భేటీ అయ్యారు.

కాంగ్రెస్ గూటికి రావడం ఖాయమని ప్రచారం జరిగింది. మంత్రి పదవిపై గ్యారంటీ ఇవ్వకపోవడంతో ప్రకాశ్ గౌడ్.. కాంగ్రెస్ పార్టీకి రాకుండా ఆగిపోయినట్లు ఆయన వర్గీయులు గుసగుసలాడుకుంటున్నారు.  కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి లలో ఎవరికి కాంగ్రెస్ పార్టీ వల వేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

ఇంకోవైపు బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. జిల్లా ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ శివారు బీఆర్ఎస్  ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేతలు పార్టీలకి రావాలని కోరితే.. మంత్రి వర్గంలో ఛాన్స్ కోసం పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో చేవెళ్ల, మల్కాజిగిరి రెండు పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.  ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్ పై సందిగ్ధంలో పడ్డారు.

కాంగ్రెస్ ఆఫర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.  మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సీఎం రేవంత్ ఏ విధంగా డీల్ చేస్తారనేది మాత్రం ఇంట్రస్టింగ్ గా మారింది. అయితే ఓ పార్టీ గుర్తుపై గెలిచి  మరో పార్టీలోకి జంప్ చేసే  వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తున్నా  వ్యవస్థలు కఠిన చర్యలు తీసుకోలేకపోవడంపై చర్చ జరుగుతోంది. ఈ అనైతిక వ్యవహారాలకు అడ్డుకట్ట పడాల్సిందే అంటున్నారు వారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి