తెలంగాణ కాంగ్రెస్‌లో కోర్టులంటూ తరచూ సీనియర్లపై విమర్శలు చేస్తూ ఉంటారు. ఉండేది కాంగ్రెస్‌లో అయినా పని చేసేది బీఆర్ఎస్కు అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్ల తీరు ఉంటోంది. వీరు ఆషామాషీ నేతలు కాదు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో పండిపోయిన వారే. బీఆర్ఎస్తో పొత్తులంంటూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వద్దని ప్రజలు అనుకుంటే ఈ రెండింటిలో ఏ పార్టీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ప్రజలు భావిస్తే ఆ పార్టీకి ఓట్లేస్తారు. అంటే ఇక్కడ ప్రధానంగా కావాల్సింది బీఆర్ఎస్ ప్రత్యర్థి హోదా. ప్రత్యామ్నాయం కేటగిరి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ప్రజల్లో అనుమానం కలిగేలా పొత్తు ప్రకటనలు చేస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీ. ఆ పార్టీతో పోటీ పడి ఓడించి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఏం చేస్తున్నారు బీఆర్ఎస్తో పొత్తులంటూ ప్రకటనలు చేస్తున్నారు. దీని వల్ల ఎవరికి లాభం బీఆర్ఎస్కా కాంగ్రెస్ పార్టీకా అంటే కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది. కొద్ది రోజుల కిందట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో బీఆర్ఎస్తో పొత్తుల గురించి మాట్లాడారు. ఎంత రచ్చ కావాలో అంతా అయింది. ఆ తర్వాత తీరిగ్గా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని లైట్ తీసుకున్నారు. కానీ ప్రజల్లో మాత్రం చర్చ ప్రారంభమయింది. తాజాగా సీనియర్ నేత జానారెడ్డి కూడా అదే మాట్లాడారు. రాహుల్ గాంధీ ఇష్యూలో బీఆర్ఎస్ మద్దతు పలికిందని ఆ పార్టీతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందని తేల్చారు. ఆయన మాటలు మరోసారి కలకలం రేపాయి. సాయంత్రానికి తాను ఆ మాటలు మాట్లాడలేదని కవర్ చేసుకున్నారు. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. అయితే సీనియర్ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారన్న అభిప్రాయం ఆ పార్టీలోనే వినిపిస్తోంది. అసలు సీనియర్ల సమస్య ఏమిటన్నది మాత్రం క్యాడర్‌కు అర్థం కాని విషయం.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చావో రేవో అన్నంతగా పోరాటం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఆయన ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కేటీఆర్ ను కార్నర్ చేస్తున్నారు. రాహుల్ అనర్హతా అంశంలో కేటీఆర్ పాజిటివ్ వ్యాఖ్యలు చేసినా వదిలి పెట్టలేదు. బీఆర్ఎస్పై ఏ మాత్రం సాఫ్ట్ కార్నర్ చూపించినా మొదటికే మోసం వస్తుందని రెండు పార్టీలు ఒకటే అనే అభిప్రాయం ప్రజల్లో బలపడితే కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే జాతీయ స్థాయి రాజకీయాల గురించి పట్టించుకోకుండా పోరాటం ఉద్ధృతం చేస్తున్నారు. భుత్వం ప్రకటించిన గ్రూప్-1, ఇతరాత్ర పరీక్షలకు దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తు న్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని కష్టపడి సాధించు కోవాలని లక్షల మంది నిరుద్యోగులు సిరియ్స్గానే ప్రిపేర్ అవుతున్నారు. ఈ పేపర్ లీకేజీ వల్ల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు నిరాశకు లోనయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపైన నిరుద్యోగులు కోపంగా ఉండి తమ వ్యతిరేకతను బహటంగానే వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల్లో ఉన్న ఈ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ల కామెంట్లు ఆయన పోరాటాన్ని బలహీనం చేస్తున్నాయన్న అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. పొత్తులపై మాట్లాడకుండా హైకమాండ్ కట్టడి చేయాల్సి ఉందంటున్నారు. ఎలా చూసినా తెలంగాణలో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకునే అవకాశాలు లేనే లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి తర్వాత ఎవరు ఏ పార్టీతో కలుస్తారు అసలు కలుస్తారా లేదా అన్నది తేలుతుంది. హంగ్ లాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలవవు కాబట్టి బీఆర్ఎస్ ఎవరితో కలవాలనుకుంటే వారితో కలుస్తుంది. బీజేపీపై ఇప్పుడు బీఆర్ఎస్ తీవ్రంగా పోరాడుతూ ఉండవచ్చు కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. అందుకే ఎన్నికల తర్వాత ఏంజరుగుతుందో అంచనా వేయడంకష్టం. వచ్చే ఫలితాలను బట్టి పరస్పర రాజకీయ ప్రయోజనాలను బట్టి పార్టీలు నిర్ణయం తీసుకుంటాయి. కానీ కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మాత్రం ముందే తొందరపడి ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మకమేనని క్యాడర్ అనుమానిస్తోంది. ఎక్కడ కాంగ్రెస్ గెలుస్తుందోనని కంగారు పడిపుతున్నారని మండి పడుతున్నారు. .ఇలాంటి నేతల తెలంగాణ కాంగ్రెస్ దిగజారిపోతోందని ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్లను కంట్రోల్ చేయకపోతే చివరికి వారు పార్టీని బీఆర్ఎస్ బీ టీంగా మార్చేందుకు కూడా వెనుకాడరన్న అభిప్రాయం క్యాడర్లో వినిపిస్తోంది. లేకపోతే చేయాల్సినదంతా చేసేసి మా మాటలు వక్రీకరించారని ప్రకటనలు చేసినట్లుగానే పార్టీ ఓటమి పాలయ్యాక మేము ముందే చెప్పామని ముందుకు వస్తారని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు సెటైర్లు వేస్తున్నారు.