తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మళ్లీ వీధిన పడ్డాయి. నువ్వెంత అంటే నువ్వంత అన్నట్లుగా రెండు పార్టీల నేతలు కొట్టుకుంటున్నారు. నీయింటికొస్తా అంటే…నీ ఇంటికొచ్చా..అన్నట్లుగా ఇరు పార్టీల నాయకులు తొడలు కొట్టుకుంటున్నారు. దమ్ముంటే రా తేల్చుకుందాం అంటున్నారు. ఇంతకీ తేల్చేదేమిటి. ఇరు పార్టీల నేతలు సాధించేదేమిటన్నది పెద్ద ప్రశ్న కూడా కాదు. ఎందుకంటే వాళ్లు పెద్దగా, ప్రత్యేకంగా ప్రూవ్ చేసేది కూడా ఏమీ లేదు. ఒక టాపిక్ పట్టుకుని కొన్ని రోజులు షో చేస్తారంతే. ఏవరు ఏ పార్టీ అని కూడా ఖచితంగా చెప్పలేం. చీరెలు, గాజులు అంటూ సవాలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ గతంలో ఆయన కాంగ్రెస్ వాది. అరికపూడి గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అనఫిషియల్ మెంబర్. అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే. గతంలో టీడీపీ సభ్యుడు. అంతకుమించి మరో ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఆయన సెటిలర్.. మరి ఎవరు ఏ పార్టీ అని చెప్పాలంటే తెల్లారే సరికి సీన్ మారిపోతుంది. ఇవ్వాళ తెగిడిన వాళ్లే రేపు పొగుడుతారు.
కౌశిక్ రెడ్డి చేత బీఆర్ఎస్ కావాలనే గేమ్ ఆడించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయించిన తర్వాత గులాబీ పార్టీ వేసిన కేసు హైకోర్టులో నలుగుతోంది. అది తమకు అనుకూలంగా వస్తుందని బీఆర్ఎస్ భావిస్తున్న తరుణంలోనే ఫిరాయింపుల స్పీడ్ బాగానే తగ్గింది. దాన్ని పూర్తిగా ఆపెయ్యాలన్నది గులాబీ దళపతి ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే విజృంభించురాజా అని కౌశిక్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా పదవి పొందిన అరికపూడి గాంధీ కూడా తన పోస్ట్ ఇచ్చిన రేవంత్ రెడ్డిపై స్వామి భక్తిని ప్రదర్శించాలంటే బీఆర్ఎస్ పై విరుచుకుపడటం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది.
నిజానికి ఇదంతా ఓ స్క్రిప్టే అన్నట్టుగా సాగుతోంది… కౌశిక్ రెడ్డి భాష తెలుసు కదా… చీరలు, గాజులు అని తిట్టించారు… గాంధీని రెచ్చగొట్టేలా మాట్లాడింపచేశారు… గాంధీ తత్వం తెలుసు కదా, జస్ట్ ఇలా గోకితే చాలు, అలా రెచ్చిపోతాడు… రియాక్షన్ ఉంటుందని… సో, కాంగ్రెస్‌లో చేరలేదు అన్నావుగా, పద, మీ ఇంటికొస్తా, బీఆర్ఎస్ జెండా ఎగరేసి, తెలంగాణభవన్ పోదాం అని కౌశిక్ రెడ్డి అనేసరికి… ఇక అసలు గాంధీ బయటికొచ్చాడు…రా, ఇంటికి రా, చూస్తా, నువ్వు రాకపోతే నేనే నీ ఇంటికొస్తా అన్నాడు… ఇక్కడే ఆపేస్తే అయిపోయేది… ఈలోపు పోలీసులు కౌశిక్ రెడ్డిని హౌజ్ అరెస్టు చేశారు… కానీ గాంధీ ఊరుకోలేదు, తనే స్వయంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లాడు… బీఆర్ఎస్ క్యాంపు కోరుకున్న రిజల్ట్ కనిపించింది… గాంధీ సంయమనం కోల్పోయాడు…ఒకరికొకరు తీసిపోని దుర్భాషలు ఆడుకుంటున్నారు… అవన్నీ సరే, ఏపీ రాజకీయాల స్థాయికి మన తెలంగాణ రాజకీయాలు ఎందుకు దిగజారకూడదు అనే పంతం కనిపిస్తోంది గానీ… ఎక్కడి నుంచో వచ్చినవ్, వయస్సు మళ్లింది, నేను యంగ్, ఈటలనే 100 కిలోమీటర్ల లోతులో బొందపెట్టిన తెలంగాణవాడిని అనే మాటలు కేవలం సెంటిమెంటును రెచ్చగొట్టేందుకేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
గాంధీ వ్యవహారశైలి కాంగ్రెస్‌కు ఖచ్చితంగా ఎంతో కొంత నష్టదాయకమే… దీనికితోడు ఆమధ్య దానం నాగేందర్ సిటీలో తిరగనివ్వను ఏమనుకుంటున్నారో అని తోటి ఎమ్మెల్యేలనే బెదిరించాడు… ఇదంతా కూడా పొలిటిక్స్ ను హాట్ హాట్ గా ఉంచేందుకేనని చెప్పాలి. అధికార పార్టీలో మాత్రమే ఉండాలనుకునే కొందరు నాయకులను అడ్డుకోవడం అంత సులభము కాదు. ఎవరేమనుకున్నా వాళ్లు పట్టించుకోరు. పైగా గతంలో తామున్న పార్టీపైనే వాళ్లు ఎదురుదాడికి దిగుతుంటారు. ఆ క్రమంలో అగ్రనాయకుల మన్ననలు పొందే ప్రయత్నంలో ఉంటారు. ఎందుకంటే తమకు ఇబ్బంది లేకుండా, తమ పనులు కావాలంటే స్వామిభక్తిని ప్రదర్శించాలి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. మరో పక్క కౌశిక్ రెడ్డి రాజకీయాల్లో ఎదగాలని పట్టుదలతో ఉన్నారు. ఆ క్రమంలో పార్టీలో ఇతరులను పక్కకు నెట్టేయ్యాలి. ఆ సంగతి బీఆర్ఎస్ అధిష్టానానికి తెలియని కాదు. కాకపోతే కాంగ్రెస్ పై విరుచుకుపడేందుకు నోటికి పనిచెప్పే నేతలు అవసరం.ప్రస్తుతానికి కౌశిక్ మాత్రమే ఆ పని చేయగలరని అర్థం చేసుకునే అధిష్టానం పెద్దలు ఆయనకు రైట్ రైట్ చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీకి కూడా డైవర్షన్ గేమ్ కావాలి కదా. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది కూడా అదే.. కాకపోతే మధ్యలో బీజేపీ లబ్ధి పొందితేనే ప్రాబ్లమ్. ఆ సంగతి రెండు పార్టీలు అర్థం చేసుకోవాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…