భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ వెలిగేదని ఇప్పుడంతా చీకట్లలో కలిసిపోయిందని కేటీఆర్ తీర్మానించేసుకున్నారు. పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు అదే రీతిలో స్పందిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని తాను ముందే చెప్పామని కేటీఆర్ అందులో నిష్టూరమాడుతున్నారు. తాము అధికారంలో ఉంటే ప్రజలకు పూట గడుస్తుందన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతూండటం… మరీ ఎబ్బెట్టుగా ఉందని ఈ తరహా రాజకీయం వర్కవుట్ కాదన్న అభిప్రాయం బీఆర్ఎస్లోనే వినిపిస్తోంది. కానీ ఈ మాట కేటీఆర్‌కు చెప్పే ధైర్యం ఎవరికీ లేకపోతోంది.
భారత రాష్ట్ర సమితి ఓ మాయా ప్రపంచంలో రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజలు కనీస అవసరాలకు నోచుకోవడం లేదని బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల తీవ్ర దుర్భర దారిద్ర్యంలో బతుకుతున్నారని వారిని గట్టున పడేయాలంటే మళ్లీ అర్జంట్‌గా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ మాటల్ని సాధరాణ ప్రజలు పట్టించుకుంటున్నారా లేదా అన్నది చూసుకోకుండా.. సోషల్ మీడియాలో ఓ మాయా ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుటంున్నారు. తెలంగాణలో అసలు కరెంట్ లేదని బీఆర్ఎస్తో పాటే అది కూడా పోయిందని బాధపడిపోతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కింది స్థాయి నేతలు అయితే అనుకోవచ్చు కానీ.. కేటీఆర్ కూడా ఇదే బాధలో ఉన్నారు. పైగా తాము ముందే చెప్పామని అయినా మీరు చేసుకున్నదేనని అనుభవించాలన్నట్లుగా నిష్ఠూరమాడుతున్నారు ఎక్స్ లో ఓ నెటిజన్ అసలు తెలంగాణలో కరెంటే లేదని బీఆర్ఎస్ తో పాటే పోయిందని ట్వీట్ చేశారు. కేటీఆర్ స్పందించారు. తాము ముందే చెప్పామని కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని చెప్పామని .. అయినా కాంగ్రెస్ కు ఓట్లేశారని చెప్పుకొచ్చారు.
కేటీఆర్ ఇలాంటి వాటి వల్ల ఏం చెప్పదల్చుకున్నారో కానీ.. తెలంగాణలో ఉంటున్న వారికి కరెంట్ ఉందో లేదో తెలుస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు వచ్చినప్పుడు కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడటం సహజమే. గత ఏడాది కన్నా డిమాండ్ భారీగా పెరిగినా ప్రజలకు ఇబ్బంది రానీయలేదు, అత్యధిక డిమాండ్ వల్ల నిర్వహణ సమస్యలు వచ్చి అవాంతరాలు ఏర్పడినా… వీలైనంత వేగంగా రెక్టిఫై చేశారు. వ్యవసాయానికి సరైన కరెంట్ లేదని బీఆర్ఎస్ హయాంలో రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇటీవల కనిపించడం లేదు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం.. ఓ మాయా ప్రపంచాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. తెలంగాణలో కరెంట్ ఉండటం లేదని.. అందరూ చీకట్లో మగ్గుతున్నారని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ పవర్ లో లేకపోతే.. అసలు పవరే ఉండదన్నట్లుగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తూండటంతో హాస్యాస్పదమవుతోంది.
ఇందు కోసం బీఆర్ఎస్ క్యాడర్ తప్పుడు ప్రచారాలు చేయడానికి వెనుకాడటం లేదు. ఏడేళ్ల క్రితం బీఆర్ఎస్ హయాంలోనే ఉస్మానియా ఆస్పత్రిలో కరెంట్ లేక ఏర్పడిన కష్టాలపై వచ్చిన పాత వార్తను ఇప్పుడు సర్క్యూలేట్ చేసి.. రేవంత్ సర్కార్ లో కరెంట్ లేదని ఓ కార్యకర్త ప్రచారం చేశాడు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నరేళ్ల గడువు ఉంది. అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్ సర్కార్ కు వచ్చిన నష్టం లేదు. బీఆర్ఎస్ కూడా ఇప్పటికిప్పుడు చేయగలిగిందేమీ లేదు. కాంగ్రెస్ పై ఇన్‌స్టంట్‌గా ప్రజా వ్యతిరేకత పెంచాలన్న తాపత్రాయన్ని మానుకుని కాంగ్రెస్ పార్టీ కి కొంత సమయం ఇచ్చి.. ఆ తర్వాత పోరాటం చేస్తే.. ప్రజలకు నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది.
పార్లమెంట్ ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత కూడా ఇంతగా ఎందుకు బీఆర్ఎస్ కంగారు పడుతుందో ఆ పార్టీ నేతలకూ అర్థం కావడం లేదు. తప్పుడు ప్రచారాలతో ఎల్లకాలం రాజకీయం చేయడం కష్టమని.. రియాలిటీ అంశాలపై దృష్టి సారించాలన్న సూచనలు వస్తున్నాయి. మరి ప్రతిపక్ష పార్టీగా నిజమైన ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తారా.. లేకపోతే ఇలా ఫేక్ న్యూస్ తో రాజకీయం చేస్తారా అన్నదానిపైనే ఆ పార్టీ గమనం ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ పెద్దలు ఈ విషయాన్ని గమనించారో లేదో కానీ.. వారి రాజకీయం మాత్రం… తాము లేకపోతే ప్రజలు బతకలేరన్న పాయింట్ దగ్గరే ఆగిపోయింది. అదే పెద్ద సమస్యగా మారుతోందని గుర్తించలేపోతున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీపై వ్యతిరేకత పెంచే క్రమంలో ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రజలు నమ్మకం కోల్పోతారు. బీఆర్ఎస్ ఈ ప్రమాదాన్ని ఊహించలేకపోతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…